వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యం
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఆదిలాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు ఓటమిని చూసి కుంగిపోకుండా, గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ బాల, బాలికల క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి సునీత కుమారి, అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
కైలాస్‌నగర్: ఈ నెల 11న నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా ప్రతి ఓటరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పట్ట ణంలోని భాగ్యనగర్‌లో శుక్రవారం నిర్వహించిన స్వీప్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రాంతినగర్ నుంచి హమాలీవాడ వరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆటపాటలతో అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలకు కర దీపికలు అందజేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమన్నారు. సమస్యల పరి ష్కారం కోసం సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నా రు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు. ఓటరు స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యం


