డుమ్మాడమ్మా డుమ్మాడి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికలయ్యాక పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి ప్రధాన అజెండాగా ముందుకు సాగాలి. దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఆరితేరిన నేతలు ఒకప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు దేనినైనా రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దె నెక్కాక ఈ ధోరణి మరింత పెరిగింది. మూడు నెలలకు ఒకసారి జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశం, రెండు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు, ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలు జిల్లా ప్రగతిలో చాలా ముఖ్యమైన భూమిక పోషించేవి. అందునా రాష్ట్ర రాజకీయాల్లో ధురంధరులైన నేతలు ఏలిన తూర్పు జెడ్పీకి మంచి గుర్తింపు ఉండేది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వస్తుందంటే చాలు వేదికపై ఆసీనులయ్యే జిల్లా ఉన్నతాధికారులు, వేదిక దిగున పలు శాఖల అధికారులు వణికిపోయేవారు. ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో, ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలో ముందు నుంచే కసరత్తు చేసేవారు. ఇప్పటి జిల్లా పరిషత్‌లో అటువంటి వాతావరణమే కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు దగ్గర నుంచి సావధానమైన చర్చల వరకు అంతా మొక్కుబడి తంతుగానే ముగిసిపోతున్నాయి. తాజాగా బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంతో కలిపి గడచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాలలో ఇదే వాతావరణం కనిపించింది.
అందుకే ముఖం చాటేస్తున్నారా?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా గాలికొదిలేశారు. ఉమ్మడి జిల్లాలో 50 లక్షల పై చిలుకు జనాభా ఏకాభిప్రాయంతో జిల్లా పరిషత్‌లో వైఎస్సార్ సీపీకి బలమైన పునాదులు వేశారు. 2020–2021లో జిల్లా పరిషత్‌లో 62 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రంపచోడవరం ఏజెన్సీలో విలీన మండలం ఎటపాక మినహా అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. అనంతర పరిణామాల్లో ముగ్గురు సభ్యులు టీడీపీ, జనసేనకు ఫిరాయించడం, ఇటీవల ఒక జెడ్పీటీసీ సభ్యుడు మృతిచెందడంతో 58 మంది సభ్యులతో ఇప్పటికీ వైఎస్సార్ సీపీ మెజార్టీతోనే ఉంది. ఉమ్మడి జిల్లాలో అధికారంలోకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జెడ్పీలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉండటాన్ని జీర్ణించుకోలేక సమావేశాలకు డుమ్మా కొడుతున్నట్టుగా కనిపిస్తోందంటున్నారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో ఎరువుల కోసం రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధ్వానంగా మారిన రహదారులు, అమలుకాని సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సర్వసభ్య సమావేశాలలో జెడ్పీటీసీ సభ్యులు నిలదీస్తారనే భయం వెంటాడుతుండటంతో ముఖం చాటేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు.
నిధులూ రాబట్టడం లేదు..
సహజంగా మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే ఎంతో ముఖ్యమైన అంశాలు చర్చించేందుకు వేదికగా పరిగణించేవారు. 2020–2021లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జెడ్పీ పాలకవర్గం కొలువుదీరిన దగ్గర నుంచి ఏడాదిన్నర క్రితం వరకు సమావేశాలలో ఎన్నో అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చర్చలో పాల్గొని ప్రజాప్రయోజనాల కోసం ఎన్నో విలువైన సూచనలు, సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం. అటువంటిది గడచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాలకు అధికార పార్టీ నుంచి పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు ఏకకాలంలో హాజరైంది లేదంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతున్నారు. ఒకవేళ కొందరు వచ్చినా కారణాంతరాలతో మధ్యలో వెళ్లిపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 48 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై కూలంకషంగా సమీక్షించే అవకాశం ఒక్క జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకే ఉంటుంది. అటువంటి అవకాశాన్ని చేజేతులా జారవిడిచి తమకు అన్యాయమే చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో జిల్లా పరిషత్‌కు ఇసుక సీనరేజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు కూడా విడుదల కావడం లేదు. జెడ్పీ జనరల్ ఫండ్ కూడా అంతంతమాత్రమే. ఇందుకుతోడు ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరి స్థాయిలో వారు రాబట్టగలిగే నిధుల కోసం సభలో అడుగుతామనే వారు రావడం లేదని సభ్యులు అంటున్నారు.
గౌరవ వేతనాలకూ దిక్కు లేదు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వసభ్య సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రతి అంశంపైన చర్చలో పాల్గొనేవారు. అందుకు పూర్తి విరుద్ధంగా ఇప్పటి మెజార్టీ ఎమ్మెల్యేలు జెడ్పీ సర్వ సమావేశాలను పూర్తిగా గాలికొదిలేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితులకు తోడు జెడ్పీటీసీ సభ్యులకు గద్దెనెక్కిన దగ్గర నుంచి 14 నెలలుగా చంద్రబాబు సర్కార్ గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. సుమారు రూ.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరకు టీఏ, డీఏలు కూడా విడుదల చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటు ఎటపాక, అటు రాజోలు, సఖినేటిపల్లి మండలాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొని సభ్యులు రాలేకపోతున్నారు. ఈ విషయాలపై జెడ్పీటీసీ సభ్యులు నులుకుర్తి రామకృష్ణ, మట్టా శైలజ, గొల్లపల్లి రత్నం, ఒమ్మి బిందుమాధవి, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు సభలో నిలదీయడం గమనార్హం. ఇదే కారణంతో బుధవారం ఏకకాలంలో సర్వసభ్య సమావేశం, స్థాయీ సంఘాల సమావేశాలు, బడ్జెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయక తప్పింది కాదంటున్నారు. ఈ ధోరణి మారాలి, పాలకులలో మార్పు వస్తే తప్ప జెడ్పీ సర్వసభ్య సమావేశాల లక్ష్యం నెరవేరదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు.
చిత్రంలో ప్రభుత్వ విప్ బుచ్చిబాబు, సీఈఓ, డీఆర్వో తదితరులు
హాజరైన జెడ్పీటీసీ సభ్యులు గుబ్బల తులసీకుమార్,
రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు తదితరులు
గైర్హాజరీకే మొగ్గు
జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలిపి ముగ్గురంటే ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. విభజనకు ముందున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు జెడ్పీలో ప్రాతినిధ్యం ఉంది. హాజరైంది మాత్రం ముగ్గురే కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, మరో మంత్రి కందుల దుర్గేష్‌లకు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేటంతటి తీరిక, ఓపిక లేకపోవడాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దె నెక్కాక జరిగిన ఆరు సర్వసభ్య సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారు డుమ్మా కొడుతున్నారు. పనులు చేయడానికి నిధుల లేమిపై తాము నిలదీస్తామనే భయంతోనే వారు సమావేశాలకు రావడం లేదని జెడ్పీటీసీ సభ్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు హాజరైన గంటన్నరకే తిరుగుముఖం పట్టారు. పేరాబత్తుల రాజశేఖర్ కూడా వచ్చారు, వెళ్లారు. ఒక్క జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాత్రం నిలిచిపోయిన సత్యసాయి మంచినీటి పథకాన్ని ప్రస్తావించారు.
జెడ్పీ సమావేశాలకు ముఖం
చాటేస్తోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
వైఎస్సార్ సీపీకి
మెజార్టీ ఉండడమే కారణం
ఆరు సమావేశాలుగా ఇదే తంతు
ఘనమైన ‘తూర్పు జెడ్పీ’లో వింత ధోరణి
డుమ్మాడమ్మా డుమ్మాడి!


