పోలవరమా? శాపమా?
రంపచోడవరం: పోలవరం కొత్త జిల్లాగా ఏర్పడి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆ స్థాయి అధికారి ఒక్కరూ నియామకం కాలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విడదీసి కొత్త జిల్లా ఏర్పాటు చేసేసినట్టు ప్రకటించేసి మమ అనిపించేసింది ప్రభుత్వం. జిల్లాకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించి పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్ని కార్యాలయాలకు బోర్డులు ఏర్పాటు చేశారు కానీ ఆ విభాగాధిపతులు మాత్రం లేరు. అల్లూరి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇటు రావడం లేదు.
పాలన గాడిలో పడేనా..
అల్లూరి జిల్లా నుంచి రంపచోడవరం, చింతూరు డివిజన్లను విడదీసి ప్రభుత్వం కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటై 20 రోజులు గడుస్తోంది. కేవలం పేరు మార్పు తప్ప పాలన పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. కొత్తగా ఒక్క ఉన్నతాధికారి కూడా రాలేదు. పోలవరం జిల్లా కలెక్టర్‌గా అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే జిల్లా ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీనే ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. జేసీగా పాడేరు ఐటీడీఏ పీవోకు అదనపు బాధ్యతలు అప్పగించిన కొద్ది రోజులకే రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్‌కు జెసీ బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో జిల్లాలో 12 మండలాలుగా పేర్కొంది. అయితే కొత్త మండలం గుర్తేడులో నేటికీ ఎటువంటి పాలనా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. అక్కడ ఐదు పంచాయతీలకు చెందిన గిరిజనులు మండల కేంద్రం వై.రామవరం చేరుకోవాలంటే మూడు మండల కేంద్రాలను దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటోంది. జిల్లాలో గుర్తేడు మండల కేంద్రంగా గిరిజనులకు తక్షణం సేవలు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లా ప్రకటనతో పాటు తాత్కాలిక కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం రూ. 5కోట్లు కేటాయించారు. ముందుగా పందిరిమామిడి సెంటర్‌కు దగ్గరలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్)లో ఏర్పాటు చేశారు. తరువాత పీఎంఆర్‌సీలో ఏర్పాటు చేస్తామంటున్నారు. వైటీసీలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. నేటికీ ఏ కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో సరైన స్పష్టత లేదు.
కొత్త ఆశలు రేకెత్తించి..
కొత్త జిల్లా ఏర్పాటుతో గిరిజనుల్లో కొత్త ఆశలు రేకెత్తించినప్పటికీ గిరిజనులు అనేక సమస్యలతో పోరాడుతున్నారు. మెరుగైన రవాణా, ఉపాధి అవకాశాలు, సాగునీరు వంటి సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో సాగు నీరు అందించేందుకు భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగెడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి. ముసురుమిల్లి ప్రాజెక్టుకు ఇంకా గేట్లు అమర్చకపోయినా కాలువల ద్వారా రైతులకు నీటిని అందిస్తున్నారు. భూపతిపాలెం ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందడం లేదు. ప్రధాన కాలువతో పాటు సబ్ కెనాల్స్‌ను అధునీకరించాలి. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పాపికొండల పర్యాటకం, మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచాల్సి ఉంది.
పేరుకే జిల్లా.. పాలన శూన్యం
గిరిజనం సమస్యలు యథాతథం
ఇన్‌చార్జి అధికారుల నిర్లక్ష్యంతో
పగ్గాలు లేని యంత్రాంగం
నేటికీ నియామకం కాని అధికారులు
ఏర్పాటు కాని కార్యాలయ భవనాలు
పోలవరమా? శాపమా?
పోలవరమా? శాపమా?


