గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
రంపచోడవరం: కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఐటీడీఏ పీవో, జిల్లా జేసీ బచ్చు స్మరణ్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు గణతంత్ర వేడుకలు నిర్వహించే స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకల కోసం వివిధ శాఖలకు సంబంధించిన శకటాలు, స్టాల్స్, గ్యాలరీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీస్ కవాతు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో మొదటి సారి గణతంత్ర దినోత్సవానికి అందరూ ఆహ్వానితులేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఆర్మ్‌డ్ రిజర్వ్ డీఎస్పీ పి.సీతారం, తహసీల్దార్ బాలాజీ, ఏవో వై.రాజు, ఈఈ వెంకటరమణ, డీఈలు చైతన్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
మన్యం కవి రమేష్‌కు
‘అక్షర ప్రవీణ’ ప్రదానం
వీఆర్ పురం: అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్యర్యంలో మన్యం కవి నూనె రమేష్‌ను అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభ పురస్కారంతో సత్కరించారు. ఏజెన్సీలో పుట్టి తెలుగు భాషపై పట్టు సాధించి సామాజిక సేవతో కూడిన కవితలు, పాటలు వ్యాసాలు రాస్తున్న మన్యం కవిని ఈ పురస్కారం వరించింది. ఈ మేరకు రమేష్‌ను గ్రామస్తులు బుధవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, వేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరి భూషణం, వేదిక జాతీయ కన్వీనర్ టి.పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
లోవలో ప్లాస్టిక్ వద్దు
తుని రూరల్: పర్యావరణానికి, అడవిలో వాతావరణ సమతుల్యతకు ప్లాస్టిక్ రహితంగా లోవ దేవస్థానాన్ని తీర్చిదిద్ధాలని రాజమహేంద్రవరం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్‌ఎన్ మూర్తి అన్నారు. బుధవారం లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారిని దర్శించిన ఆయన భక్తులతో మాట్లాడారు. లోవ దేవస్థానం పరిసరాల్లో అడవి జంతువులు సంచరిస్తున్నాయని, నిషేధిత హానికరమైన ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా తీసుకుంటే జంతువులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు


