ట్యాంకర్ బోల్తాపై విచారణ జరపాలి
తొండంగి: రసాయన వ్యర్థాల లారీ ట్యాంకర్ పంట కాలువలో బోల్తాపడడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలం ఏ.వి.నగరం పీబీసీ కాలువకు అనుసంధానంగా ఉన్న పంట కాలువలో రసాయన వ్యర్థాల(స్పిరిట్)ను పారబోసేందుకు వచ్చిన భారీ ట్యాంకర్ గట్టు విరగడంతో కాలువలో బుధవారం తెల్లవారు జామున బోల్తాపడింది. విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల రైతులు ఉదయం అక్కడకు చేరుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో రెండుసార్లు స్పిరిట్‌ను కాలువలో వేయడంతో తమ పంటలు దెబ్బతిన్నాయని, ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నిరసన తెలిపారు. రైతులపై పోలీసులు దౌర్జన్యం చేయడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా వెంటనే ట్యాంకర్ బోల్తాపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. గతంలో ఇలాగే స్పిరిట్‌ను పంటకాలువలో పారబోయడం వల్ల తమ పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. అనంతరం రాజా మాట్లాడుతూ రైతుల ఫిర్యాదును పెడచెవిన పెట్టడం వల్లే తరచూ స్పిరిట్‌ను ఈ ప్రాంతంలో వేస్తున్నారన్నారు. లారీ బోల్తాపడటంతో ఈ వ్యవహారం బయట పడిందన్నారు. రైతులు ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ప్రశ్నించిన వారిని చంద్రబాబు ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. పంటకాలువలో పడిన స్పిరిట్ సుమారు 20 గ్రామాల ప్రజలకు తాగునీరందించే వాటర్ స్టోరేజ్ ట్యాంకులో కలిసే ప్రమాదం ఉందన్నారు. ఈ ప్రాంత వ్యవసాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. కానీ ఇదేమీ పెద్ద ప్రమాదం కాదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించడం హాస్యాస్పదమన్నారు. బోల్తా పడిన ట్యాంకర్ ఏ పరిశ్రమ నుంచి వచ్చిందో సమగ్ర దర్యాప్తు చేసి తేల్చాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు, ప్రజల పక్షాన పోరాడతామన్నారు. కాగా బోల్తాపడిన ట్యాంకర్‌ను బయటకు తీసేపనిని పోలీసులు ప్రారంభించారు. వైఎస్సార్ సీపీ పంచాయతీల విభాగం రాష్ట్ర కార్యదర్శి కొయ్యా మురళి, యువజన విభాగం రారష్ట్‌ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు ఆరుమిల్లి ఏసుబాబు, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, బూత్ కమిటీల విభాగం రాష్ట్ర కార్యదర్శి బెక్కం చంద్రగిరి, బీసీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ పెండ్యాల రామకృష్ణ, పార్టీ నాయకులు అరిగెల శేషు, సిద్దా శ్రీనివాసరావు, కోడూరి దివాణం పాల్గొన్నారు.
పంట కాలువలో రసాయన వ్యర్థాలు
కలవడంతో నీరు కలుషితం
20 గ్రామాల ప్రజల ఆరోగ్యం,
వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం
కారకులపై చర్యలు తీసుకోవాలి
మాజీ మంత్రి రాజా డిమాండ్


