ఇంటర్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
రంపచోడవరం: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పాడేరు కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. ప్రతి సెంటర్‌లో 144 సెక్షన్ ఉంటుందని, రెవెన్యూ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో, ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు తరలించేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రతీ సెంటర్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో వైద్య సిబ్బందిని నియమించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో పది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 18 ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించినట్లు తెలిపారు.
జేఈఈ–26 పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ మొదట విడత పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకూ నిర్వహించనున్న పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల, మధ్యాహ్నం మూడు నుంచి 6గంటల వరకూ నిర్వహిస్తారు. కాకినాడ అయన్ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షకు ఉదయం 483మంది హాజరుకాగా 15మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహిహించిన పరీక్షకు 492మంది హాజరుకాగా 8మంది హాజరుకాలేదు.


