దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసార్ పేన్ పద్మల్‌పురి కాకో ఆలయం
గుస్సాడీలు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.
ఆరాధ్యదైవం ఏత్మాసార్ పద్మల్‌పురి కాకో
ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసార్ పద్మల్‌పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు.
గుస్సాడి టోపీ ప్రత్యేకం
గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు.
ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం
దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్‌కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్‌కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు.
నాలుగు సగల పేరిట ఉత్సవాలు
దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్‌కోలా, సదర్‌కోలా, కోడల్‌కోలా, సార్‌కోలా, కలివల్‌కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి.
కొలబొడితో ముగింపు
దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీ ర్వదిస్తారు. అనంతరం పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తారు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు.
ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ
సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారీని ప్రత్యేక
పండుగగా గుర్తించింది.
– బజార్‌హత్నూర్
పవిత్రమైన పండుగ
మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి.
– కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీ
ఘనంగా జరుపుకుంటాం
దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం.
– కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి
ప్రోత్సాహం అందించాలి
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్‌మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం.
– మేస్రం దుర్గు, జిల్లా సార్‌మేడి, ఉట్నూర్
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం