
ఐటీఐ గేటుకు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేటుకు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్‌బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.