ఏడుగురే.. ఎంపీడీవోలు! | - | Sakshi
Sakshi News home page

ఏడుగురే.. ఎంపీడీవోలు!

Oct 1 2025 9:50 AM | Updated on Oct 1 2025 9:50 AM

ఏడుగురే.. ఎంపీడీవోలు!

ఏడుగురే.. ఎంపీడీవోలు!

● జిల్లాలో వేధిస్తున్న మండల అధికారుల కొరత ● ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం ● ఎన్నికల నిర్వహణపై ప్రభావం

కై లాస్‌నగర్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ సైతం అమల్లోకి వచ్చింది. త్వరలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. నోటిఫికేషన్‌ నుంచి కౌంటింగ్‌ వరకు మండలంలో నిర్వహించేఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించాల్సిన గురుతర బాధ్యత ఎంపీడీవోపైనే ఉంటుంది. అయితే జిల్లాలో ఎంపీడీవోల కొరత తీవ్రంగా వేఽధిస్తోంది. పలు మండలాల్లో ఎంపీవోలే ఇన్‌చార్జి ఎంపీడీవోగానూ వ్యవహరిస్తున్నారు. రెండు పోస్టుల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. సగానికిపైగా మండలాల్లో ఇన్‌చార్జీలే ఉండటంతో ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముంది.

రెగ్యులర్‌ విధులతోనే బిజీ..

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్‌కార్డులు, ఇందిరమ్మ, గృహజ్యోతి, మహలక్ష్మి వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలదే. వీటితో పాటు తమ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విధులతోనే వారు నిత్యం బీజీగా ఉంటున్నారు. తాజాగా మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అదనంగా వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ మొదలు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఉత్తర్వుల జారీ, శిక్షణలు, ఎన్నికల సామగ్రి సరఫరా వంటి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది.

మెజార్టీ మండలాల్లో ఇన్‌చార్జీలే..

జిల్లాలో మొత్తం 20 గ్రామీణ మండలాలు ఉండగా, వీటి పరిధిలో 20 జెడ్పీటీసీలు, 166 ఎంపీటీసీ స్థా నాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఎంపీడీవోల కొరత ఉండగా తాజాగా మావల రెగ్యులర్‌ ఎంపీడీవో ఆకుల భూమయ్య ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ప్రస్తుతం తాంసి, తలమడుగు, భీంపూర్‌, బజార్‌హత్నూర్‌, బోథ్‌, ఉట్నూర్‌, గాదిగూడ మండలాల్లో మాత్రమే రెగ్యులర్‌ ఎంపీడీవోలు ఉన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేయకపోవడంతో ఉన్నవారిని తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. మిగతా పది మండలాల్లో ఎంపీవోలు, సూపరింటెండెంట్లకే ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇది వారికి తలకుమించిన భారంగా మా రుతోంది. ఆదిలాబాద్‌రూరల్‌ ఎంపీవోగా ఉన్న అ ధికారికి ఇన్‌చార్జి ఎంపీడీవోతో పాటు మావల ఎంపీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకే అధికారి రెండు మండలాల్లో ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా రెగ్యులర్‌ ఎంపీడీవోగా విధులు నిర్వహించాల్సి ఉండగా, కొంతమంది పైరవీలతో తమకు అనుకూలమైన మండలాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఫలితంగా పాలన గాడితప్పడంతో పాటు ఎన్నికల నిర్వహణపై కూడాప్రభావం చూపే అవకాశముంది.

జిల్లాకు ఆరుగురు కొత్త ఎంపీడీవోలు..?

ఇటీవల విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో కొత్తగా కొలువు సాధించిన ఆరుగురిని ఆదిలాబాద్‌ జిల్లాకు ఎంపీడీవోలుగా నియమించినట్లుగా తెలుస్తోంది. వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులను జిల్లాకు కేటాయించినట్లుగా సమాచారం. అయితే మంగళవారం వరకు ఏ ఒక్క అధికారి రిపోర్టు చేయలేదు. వీరంతా విధుల్లో చేరితే అధికారుల కొరత దూరమై ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మావల ఎంపీడీవోగా కృష్ణవేణి

మావల నూతన ఎంపీడీవోగా కృష్ణవేణి నియామకమయ్యారు. సూపరింటెండెంట్‌ హోదా కలి గిన ఈమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని పంచా యతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇది వరకు మా వల రెగ్యులర్‌ ఎంపీడీవోగా పనిచేసిన భూమ య్య మంగళవారం పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో కృష్ణవేణిని నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఇది వరకు ఆమె జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగానూ బాధ్యతలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement