
ఆంగ్లంలో బోధిస్తూ.. పుస్తకాలు రాయిస్తూ..
ఇంద్రవెల్లి: మండలంలోని ఏమాయికుంట ఎంపీయూపీఎస్‌లో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్న బుక గంగయ్య విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌లో రాణించేలా బోధిస్తున్నారు. ఐదోతరగతి విద్యార్థులతో ఇంగ్లిష్‌లో మాట్లాడిస్తున్నారు. వారితో పుస్తకాలు రాయించి ఆవిష్కరిస్తున్నారు. నీతి కథలు రాసి దిశానిర్దేశం చేస్తున్నారు. ‘మా బడికి రండి’ అంటూ బడీడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి కృషి చేస్తున్నారు. ఏమాయికుంట పాఠశాలలో 98 మంది విద్యార్థులుండగా వారి సంఖ్యను 140 మందికి పెంచారు. పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. లయన్స్ క్లబ్ సహకారంతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిస్తున్నా రు. కూరగాయలు పండించి వాటితోనే మధ్యాహ్న భో జనం వండిస్తున్నారు. విద్యార్థులకు శుద్ధజలం అందించేందుకు, ప్లేట్లు పంపిణీ చేయించడానికి తనవంతు కృషి చేశారు. ఇన్ని చేసిన గంగయ్య సేవలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతు ల మీదుగా గంగయ్య అవార్డు అందుకోబోతున్నారు.