
బడులకు రేటింగ్
‘స్వచ్ఛ ఏవమ్ హరిత్’ కింద పాఠశాలల ఎంపిక ఈనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ పచ్చదనం, పరిశుభ్రత నిర్వహణపై.. జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహకం
ఆదిలాబాద్‌టౌన్: పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి దేశవ్యాప్తంగా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 20 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. అయితే ప్రభుత్వం ఇదివరకు స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నిలిచిపోగా, మళ్లీ జాతీయస్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు.
కార్యక్రమ తీరుతెన్నులు..
జిల్లాలో ప్రభుత్వ, లోకల్‌బాడీ, ప్రైవేట్, కేజీబీవీ లు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ తదితర పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్ల యాజమాన్యాలు స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 30 వరకు గడువు ఉంది. పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, తదితర పాఠశాల నిర్వహణపై ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్‌లో కమిటీ బృందం తనిఖీ చేపడుతుంది. 3–స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తా రు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో 4–స్టార్ వచ్చిన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. రూ.లక్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2–స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3–స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4–స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5–స్టార్ కేటాయిస్తారు.
పురస్కారంతో బాగుపడనున్న స్కూళ్లు..
స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహణ బాగుపడనుంది. ఆయా బ డుల్లో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడుతుంది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. నీటిసదుపాయం ఉన్నప్పటికీ వాటిని విని యోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
30 వరకు దరఖాస్తు గడువు..
‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్’ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేస్తారు. ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎంఈవోలు, మండలానికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున సోమవారం డైట్ కళాశాలలో శిక్షణ కల్పించాం. జాతీయ స్థాయిలో ఎంపికై న పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహం అందజేస్తారు. ఈ నిధులను పాఠశాల అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత ఉపాధ్యాయుడిని విహార యాత్రకు తీసుకెళ్తారు. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– ఉష్కం తిరుపతి,
విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి
జిల్లాలో..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు : 1,471
విద్యార్థులు : 1,46,880
ప్రభుత్వ ఉపాధ్యాయులు : 2,667