
మావల గ్రామ పంచాయతీ కార్యాలయం
వివరాలు పంపాలని ప్రభుత్వం ఆదేశం
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత
‘పెండింగ్’ విడుదలపై మాజీ సర్పంచ్‌ల్లో ఆశలు
కైలాస్‌నగర్: సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి దాదా పు ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటికీ వారు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు విడుదల కావడం లేదు. మూడేళ్లకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించడంతో మాజీ సర్పంచ్‌ల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
మూడేళ్లుగా నిలిచిన బిల్లులు ..
జిల్లాలో 473 గ్రామ పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో మాజీ సర్పంచ్‌లు తమ హయాంలో ఎస్‌డీఎఫ్, సీడీపీ, పంచాయతీ జనరల్ ఫండ్‌తో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, సవారీ బంగ్లా షెడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు వంటి పనులు చేపట్టారు. ఇందులో జనరల్ ఫండ్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను సర్పంచ్‌లు పదవీ కాలం ముగిసే సమయంలో డ్రా చేసుకున్నారు. అయితే పాలన గడువు చివరలో సమర్పించిన బిల్లులతో పాటు వివిధ నిధులతో చేపట్టిన పనుల బిల్లులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉపయోగించి కొంతమంది సర్పంచ్‌లు డ్రా చేసుకున్నప్పటికీ అధికారికంగా మాత్రం మూడేళ్లుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో ఆయా నిధులతో పనులు చేపట్టిన వారు ట్రెజరీ, జిల్లా పంచాయతీ, జెడ్పీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
రూ.5.30 కోట్లు పెండింగ్‌లో..
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్‌లో ఎప్పుడైనా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉంటే మాజీ సర్పంచ్‌ల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశమున్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. వాటిని విడుదల చేశాకే ఎన్నికలకు వెళ్లాలనే భావనతో ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల వివరాలు పంపించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేసిన ఆ శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా 924 పనులకు సంబంధించి రూ.5.34కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వివరాలతో కూడిన నివేదిక ను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మేరకు మాజీ సర్పంచుల్లో కొంత ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రభుత్వానికి పంపించాం
గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్ బిల్లుల వివరాలను రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జిల్లాలోని వివరాలు పంపించాల్సిందిగా పంచాయతీ రాజ్‌శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పంచాయతీల్లో చేపట్టిన పనులు, వాటికి సంబంధించిన పెండింగ్ బిల్లుల వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – జి.రమేశ్, డీపీవో