
2న ఓటర్ల తుది జాబితా
కై లాస్‌నగర్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 2న ప్రకటిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు– 2025 నిర్వహణపై వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. వార్డుల వారీగా పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను గురువారం ప్రకటించామన్నారు. అందులో ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీ వరకు ఎంపీడీవో కార్యాలయంలో తెలపాలని సూచించారు. వాటిని ఎంపీడీవోలు పరిశీలించి తగు సవరణలు చేసి తుది జాబితా సిద్ధం చేస్తారని అన్నారు. మండలస్థాయిలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్‌కలెక్టర్ యువరాజ్, ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేశ్, డీఎల్‌పీవో ఫణీందర్‌రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకుల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
జూన్ త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షను కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంబీ, పీఎం విశ్వకర్మ, నాబార్డ్ పథకాలు, వ్యవసా యం ఇతర శాఖల బ్యాంకు లక్ష్యాలపై కలెక్టర్ రాజర్షి షా సమీక్షించారు. బ్యాంకుల వారీగా సాధించిన ప్రగతి తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. గత సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపై ఆరా తీఽశారు. రైతులకు పంట రుణాలతో పాటు స్వయం సహాయ గ్రూపులకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలవాలని సూచించారు. బ్యాంకులు స్థానిక అవసరాలు గుర్తించి, ప్రజలతో మరింత మమేకమవుతూ సేవలందించాలన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.