
ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలి
కైలాస్‌నగర్: అధికారులు నిరంత రం అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రా ణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూ పల్లి కృష్ణారావు ఆదేశించారు. భారీ వర్షా ల నేపథ్యంలో బుధవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టర్లతో ఫోన్‌లో సమీక్షించారు. వర్షపాతం, వరద పరిస్థితులపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. యూరియా సరఫరా, కొరతపై ఆరా తీశారు. జైనథ్, సాత్నాల, మావల, ఆదిలాబాద్ టౌన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కలెక్టర్ రాజర్షి షా మంత్రికి తెలిపారు. జైనథ్‌లో ఇళ్లలోకి నీరు చేరిందని, అక్కడి నుంచి బాధితులను ఇతర ప్రాంతానికి తరలించినట్లు పేర్కొన్నారు. వారికి భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. తరోడలోని లోలెవల్ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని మంత్రికి వివరించారు.