
అటవీ అనుమతుల కు ప్రత్యేక చర్యలు
● వీసీలో రాష్ట్ర మంత్రులు సీతక్క, సురేఖ
కైలాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచా యతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనుల్లో అటవీశాఖ అనుమతులకు ఏర్పడిన ఇబ్బందులు పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఐటీడీఏ అధి కారులతో శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ అనుమతులు రాకపోవడంతో అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం అవుతుందని ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను త్వరలోనే పరిష్కరించి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని వారు భరోసానిచ్చారు. ఆయా శాఖలు సమన్వయంతో పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. కాగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాజర్షి షా ఈ వీసీలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి రోడ్డు, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ నుంచి సిరికొండ మండలం వాయిపేట్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు పెండింగ్‌లో ఉన్నట్లుగా మంత్రులకు వివరించారు.