‘యువ వికాసం’పై కసరత్తు
కై లాస్‌నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రూ.50వేల నుంచి రూ.4.లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెల 7నుంచి 14వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు, స్థితిగతులను ఆరా తీస్తున్నారు. వారు ఎంపిక చేసిన జాబితాలను సోమవారం (నేటి)లోగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖలన్నింటివి కలిపి 47,762 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 39,727 పరిశీలించారు. మిగతా దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. వాటి పరిశీలనను నేటితో పూర్తిచేసేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ ఇటీవల సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షించారు. ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.
13 నుంచి మండల స్థాయిలో..
ఎంపీడీవోలకు అందిన దరఖాస్తుల ఆధారంగా ఈనెల 13 నుంచి 19వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపీడీవో నేతృత్వంలోని ఈ కమిటీలో ఎంపీవో, మండల ప్రత్యేక అధికారి, బ్యాంక్ మేనేజర్లు సంబంధిత శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. సంక్షేమ శాఖలకు సంబంధించి మండల స్థాయి కమిటీలో హెచ్‌డబ్ల్యూవోలను నియమించారు. మున్సిపాలిటీలో గెజిటెడ్ అధికారులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మండలాలకు కేటాయించిన యూనిట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇలా ఎంపిక చేసిన వారి వివరాలను జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. అయితే యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండి, దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులను గుర్తిస్తేనే నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
20 నుంచి జిల్లా స్థాయిలో..
నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి 30 వరకు మండల కమిటీలు అందజేసిన అర్హుల వివరాలను జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, డీఆర్డీవో నోడల్ అధికారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ మండల స్థాయి నుంచి అందిన దరఖాస్తులను, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హత ఆధారంగా యూనిట్ల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియను ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు పూర్తి చేయనుంది. ఆయా తేదీల్లోనే ప్రొసీడింగ్‌లను సైతం సిద్ధం చేయనుంది. జిల్లా కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేయనున్నారు. తొలివిడతలో రూ.50వేలు, రూ.లక్ష లోపు రుణాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తొలివిడతలోనే వారికి లబ్ధి చేకూరే అవకాశముంది.
నేటితో ముగియనున్న క్షేత్రస్థాయి పరిశీలన 13 నుంచి మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 20 నుంచి జిల్లా స్థాయిలో గుర్తింపు
శాఖల వారీగా అందిన దరఖాస్తులు,
పరిశీలన వివరాలు
శాఖ అందిన పరిశీలించినవి
దరఖాస్తులు
ఎస్సీ కార్పొరేషన్ 9804 8143
ఎస్టీ సంక్షేమ శాఖ 12855 11039
బీసీ 18581 15773
ఈబీసీ 653 376
మైనార్టీ 5814 4364
క్రిస్టియన్ మైనార్టీ 55 32
జిల్లాలో కులాల వారీగా కేటాయించిన యూనిట్లు
ఎస్సీ 2,662 ఎస్టీ 6,480 బీసీ 2,403
ఈబీసీ 724 ముస్లిం మైనారిటీ 1,003
క్రిస్టియన్ మైనారిటీ 31
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ ఆర్థికసాయం కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన వివరాల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంలోగా ముగియనుంది. ఈ నెల 13 నుంచి 20వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 20 నుంచి 30వరకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కలెక్టర్ నేతృత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నాం. – మనోహర్‌రావు,
రాజీవ్ యువ వికాసం జిల్లా కన్వీనర్


