
ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు స్వాగతం పలుకుతున్న కేస్లాపూర్ గ్రామస్తులు
● అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా ● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్
ఇంద్రవెల్లి: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలువడం.. ప్రజల విజయమేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది ఆదివారం రాత్రి ముందుగా మండలంలోని కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేస్లాపూర్ గ్రామంలో సంప్రదాయ వాయిద్యాల మద్య ఘన స్వాగతం పలికారు. శాలువలతో సన్మానం చేశారు. అక్కడి నుండి ముత్నూర్ చేరుకుని కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా అన్ని వర్గాలను సమానంగా చూడడంతో పాటు ఖానాపూర్ నియోజకవర్గం సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ పెద్దలు మెస్రం వెంకట్‌రావ్, మెస్రం నాగ్‌నాథ్, మెస్రం ఆనంద్‌రావ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖడే ఉత్తం, ఎండి జహిర్, ఎండీ మసూద్ ఉన్నారు.