
బెల్లంపల్లి: నల్ల బంగారు నేల బెల్లంపల్లిలో వికసించిన ఎర్ర మందారం సుదర్శన్. నూనూగు మీసాల 22ఏళ్ల నవ యవ్వనంలో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్శితుడై సుమారు ఐదు దశాబ్దాలు అజ్ఞాతం వాసం గడిపి 70ఏళ్ల వయస్సులో తుది శ్వాస విడిచాడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన ఆయన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేసి ఏనాడూ ఇంటిముఖం చూడలేదు. నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం, పీడిత జన విముక్తి కోసం పోరాడుతూనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మే 31న తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూశాడు. పీడిత తాడిత ప్రజలు ఆప్యాయంగా దూలా దాదా అని పిలుచుకునేవారు.
ఆరుగురు సంతానంలో అందరి కన్న పెద్ద
సింగరేణి కార్మికుడు కటకం మల్లయ్య, వెంకటమ్మ దంపతులకు ఆరు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు సుదర్శన్. ఆయనకు ఐదుగురు తోబుట్టువులు రఘు, కమలాకర్, సతీష్‌కుమార్, పద్మ, విజయ ఉన్నారు. తండ్రి మల్లయ్య రిటైర్మెంటు అయ్యాక 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందారు. తల్లిదండ్రులు మరణించినా ఇంటి వైపు రాకుండా సుదర్శన్ విప్లవ పంథాను అనుసరించాడు. సుదర్శన్‌ను ప్రభుత్వానికి లొంగిపొమ్మని పోలీసులు కోరిన ప్రతీసారి తండ్రి మల్లయ్య ససేమిరా అనేవాడు. నిక్కచ్చిగా వ్యతిరేకించేవాడు.
డిగ్రీ చదివి.. డిప్లొమా చేసి
ప్రాథమికోన్నత విద్యను బెల్లంపల్లిలో పూర్తి చేసిన సుదర్శన్ డిగ్రీ బీఎస్సీని మంచిర్యాలలో అభ్యసించాడు. ఆ తర్వాత మైనింగ్ డిప్లొమా చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. 1967లో జరిగిన నగ్జల్‌బరి, శ్రీకాకుళ పోరాటాల ప్రభావంతో క్రమంగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్‌ఎస్‌యూ)కు ప్రభావి తం అయ్యాడు. యూనియన్‌లో క్రీయాశీలకంగా ప ని చేశాడు. 1974–75 కాలం ఆయన జీవితాన్ని మ లుపు తిప్పింది. విద్యార్థి దశలో అన్యాయాలు, దౌర్జన్యాలను సహించేవాడు కాదు. బెల్లంపల్లిలో గూండాల ఆగడాలను అరికట్టడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆర్‌ఎస్‌యూలో పని చేస్తూనే కార్మిక వర్గ పోరాటాలకు ఆజ్యం పోశాడు. పెద్ది శంకర్, గజ్జల గంగారాం, నల్లా ఆదిరెడ్డి, బందెల రాములు, పులి మధునయ్యలతో కలిసి సింగరేణి కార్మికవర్గ సమస్యలు, ఆదివాసీ, గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు, దొరలు, భూస్వాములు సాగిస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో క్రీయాశీలంగా పని చేశాడు.
గూండాల హత్య అనంతరం అజ్ఞాతంలోకి..
ఆ రోజుల్లో బెల్లంపల్లిలో ఏ బస్తీలో చూసినా గూండాల ఆధిపత్యం కొనసాగేది. కార్మికులపై దాడులు, కల్లు దుకాణాల్లో దౌర్జన్యాలు, కార్మికులను బెదిరించి కల్లు సీసాలు కొనుగోలు చేయించి గూండాలు తాగేవారు. గూండాలకు కుందేళ్ల శంకర్, దస్తగిరి నాయకత్వం వహించి ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించేవారు. ఇళ్లలో చొరబడి మహిళలను చెరిచేవారు. ఆర్‌ఎస్‌యూలో పని చేస్తున్న సుదర్శన్, బందెల రాములు, మధునయ్య తదితర విప్లవ శ్రేణులు 1978 మార్చి 27న పట్టపగలు కన్నాల బస్తీలో వారిని పట్టపగలు హత్య చేసి ప్రజలకు చేరువయ్యారు. అదే ఏడాది బెల్లంపల్లిలో పని చేస్తున్న సింగరేణి పర్సనల్ అధికారి శ్యామ్‌మోహన్‌రావు కొడుకు రఘు ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేసి చంపేశాడు. అతడిని కఠినంగా శిక్షించాలని నిర్వహించిన ఆందోళనలో సుదర్శన్ పాల్గొన్నాడు. ఈ ఆందోళన లాఠీచార్జీకి దారితీసింది. ఈ రెండు ఘటనల అనంతరం సుదర్శన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అంతకుముందు రామకృష్ణాపూర్ ఏరియా ఆర్‌కే–1లో కార్మికుడిగా కొంతకాలం పని చేశాడు.
రైతు పోరాటాలకు నాయకత్వం
ఆర్‌ఎస్‌యూ నుంచి పీపుల్స్‌వార్‌లో చేరిన తర్వాత సుదర్శన్ జన్నారం, నిర్మల్, లక్సెట్టిపేట ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించాడు. జిల్లా కమిటీ సభ్యుడి హోదాలో పని చేశాడు. ఆ ప్రాంత రైతుల్లో చైతన్యం రగిల్చి భూపోరాటాలు చేశాడు. పీపుల్స్‌వార్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా 1981 ఏప్రిల్ 19న ఇంద్రవెల్లిలో జరిగిన సభకు నాయకత్వం వహించాడు. 1985లో మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిరోంచ ప్రాంతాలకు వెళ్లాడు. ఫారెస్టు లైజన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1995లో స్పెషల్ కమిటీ కార్యదర్శిగా నియామకం అయ్యాడు. 2001లో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదోన్నతి పొందాడు.
ఉద్యమంలో అసువులు బాసిన భార్యాభర్తలు
పీపుల్స్‌వార్‌లో చేరిన సుదర్శన్, లలితక్క భార్యాభర్తలుగా ఉద్యమంలో పని చేశారు. విప్లవ మార్గాన్ని ఎంచుకున్న లలితక్కను పెళ్లి చేసుకున్న సుదర్శన్ దండకారణ్యంలో క్రీయాశీలకంగా పనిచేస్తున్న సమయంలో 2003 మే 13న బెజ్జూర్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసు ఎదురుకాల్పుల్లో లలితక్క మృతిచెందింది.
సుదర్శన్‌కు కన్నీటి జోహార్లు
బెల్లంపల్లి: మావోయిస్టుపార్టీ ఉద్యమంలో పనిచేసి కన్నుమూసిన కేంద్రకమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్‌కు బెల్లంపల్లిలో కుటుంబ సభ్యులు, రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల శ్రేణులు ఆదివారం న్నీటి జోహార్లు అర్పించారు. బెల్లంపల్లి కన్నాల బస్తీలోని సుదర్శన్ సోదరుడు కటకం సతీశ్‌కుమార్ ఇంటికి సుదర్శన్ చిన్ననాటి మిత్రులు, మాజీ నక్సలైట్లు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తరలివచ్చారు. సుదర్శన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమర్‌రహే కామ్రేడ్ సుదర్శన్ అని నినదించారు.
సురద్శన్ పోరాట పటిమ, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు కె.సురేఖ, విశ్వప్రసాద్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, రొడ్డ శారద, నాతరి స్వామి, బండి ప్రభాకర్, కేవీ ప్రతాప్, శ్రీధర్, జగన్, సీపీఐ నాయకులు చిప్పనర్సయ్య, చంద్రశేఖర్, ఐలయ్య, రాజం, బీజేపీ నాయకుడు ఏమాజీ, సీఐడీ రిటైర్డు అడిషనల్ ఎస్పీ పులియాల రవికుమార్, శ్రీమన్నారాయణ, ఆడెపు సమ్మయ్య, ఎం.సత్యనారాయణ, ఎన్.శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

సుదర్శన్, లలితక్క(ఫైల్)