ఘనంగా భాష్యకారుల సాత్తుమొర
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేశారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించారు.


