breaking news
withered
-
కంటి తుడుపు
–నామమాత్రంగా వేరుశనగ పంట తడులు – మమ అనిపించిన ప్రభుత్వం – హడావుడి చేసిన మంత్రులు – రైతుల పెదవి విరుపు చిత్తూరు (అగ్రికల్చర్): వేరుశనగ పంటకు ప్రభుత్వం అందించిన తడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎకరా విస్తీర్ణంలోని పంటను తడిపేందుకు 4 ట్యాంకర్ల నీటికి మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది. ఫలితంగా కనీసమేర కూడా నేల తడవలేదు. ఈ మొక్కుబడి తడులపట్ల రైతులు ఆసక్తి చూపడం లేదు. మంత్రులు మాత్రం వేరుశనగకు తడులు ఇచ్చేశాం, ఎండనీయకుండా కాపాడామంటూ హడావుడి చేస్తున్నారు. పదిరోజులుగా 18 వేల హెక్టార్లలో మాత్రమే తడులిస్తే,గడచిన రెండురోజుల్లోనే 12 వేల హెక్టార్లలో తడులు పూర్తిచేసే విధంగా ముందస్తుగానే నిర్ణయించేసుకున్నారు. దీంతో ఈ నామమాత్రపు తడులు మాకొద్దంటున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌కు 1.21 లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ పంట తీవ్ర వర్షాభావంతో ఎండిపోయింది. నెలరోజులుగా వర్షాభావంతో ఎండిపోయిన పంటను ఆఖరి నిమిషంలో కాపాడతామంటూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం రెయిన్ గన్స్, జనరేటర్లు, స్పింకర్లు తెప్పించి పది రోజులుగా పంటను తడిపే పనులకు శ్రీకారం చుట్టింది. వర్షాధారంగా సాగయ్యే వేరుశనగ పంటను అత్యధికంగా రైతులు నీటి సౌకర్యంలేని మెట్టప్రాంతాల్లో సాగుచేస్తారు. ఈ మెట్టప్రాంత చేలల్లోని వేరుశనగ పంటను తడిపేందుకు ట్యాకర్ల ద్వారా నీటిని తరలించాల్సి ఉంది. నీటి సౌకర్యం లేని మెట్టప్రాంతంలోని పంటకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి, పంటను తడపాలి. ఇందుకుగాను ఎకరా విస్తీర్ణంలోని పంటను తడిపేందుకు 4 ట్యాంకర్ల నీటికే అనుమతి ఇచ్చింది. ఒక ట్యాంకర్ నీటిని తరలించేందుకు ప్రభుత్వం రూ. 260 మాత్రమే చెల్లిస్తోంది. ఒక ట్యాకర్ నీటిని కొనుగోలు చేయాలంటే రూ. 600 నుంచి రూ. 800 వరకు వెచ్చించాల్సి ఉంది. ఒక్కో రైతు ఎకరాకు రూ. 2 వేల వరకు అదనపు మొత్తాన్ని భరించాల్సి ఉంది. ఈ మొత్తాలను వెచ్చించినా ఎకరాకు 4 ట్యాంకర్లు ఏమాత్రం చాలవని రైతులంటున్నారు. దీంతో వీరు చాలీచాలని తడుపులపై ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మొదటి విడత తడులను శుక్రవారంతో ముగించేశారు. మరోపక్క వేరుశనగ పంటకు తడులు అందించి కాపాడేస్తామంటూ నలుగురు మంత్రులు ఐదు రోజులుగా జిల్లాలో తిష్టవేశారు. హడావుడిగా చాలీచాలని తడులు అందించి మొత్తం పంటలను అనతికాలంలోనే తడిపేశామంటూ వీరు చెబుతుండటం గమనార్హం. మొత్తం 38 వేల హెక్టార్లలో పంట ఎండిపోయిందని మంత్రులంటున్నారు. ఈ వారంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి, ప్రభుత్వం ఇచ్చిన తడులకు 26 వేల హెక్టార్ల పంటకు ఉపశమనం కలిగిందని, 12,619 హెక్టార్లలో తడులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తడులు ఇవ్వకుండా మిగిలిపోయిన 17,739 ఎకరాలకు గాను 8, 353 ఎకరాలకు తడులు ఇచ్చామని, మిగిలిన 9.386 ఎకరాలను శుక్రవారం సాయంత్రానికి పూర్తిచేసి, వందశాతం పూర్తి చేస్తామని గురువారం పొంతన లేని లెక్కలు చూపెట్టారు. దీనిబట్టి చూస్తే మంత్రులు వేరుశనగ పంటను కాపాడడంలో ఏవిధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది అర్ధమవుతోంది. ఏమైనప్పటికి ప్రభుత్వం సమకూర్చిన తడులతో పంటను కాపాడిన దాఖలాలు లేవని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
పంటలు ఎండిపోయాక హడావుడి ఎందుకు?
– సీఎం సుడిగాలి పర్యటనలో సాధించింది శూన్యం – పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజం పీలేరు: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పూర్తి ఎండిపోయాయ ముఖ్యమంత్రి, మంత్రుల హడావుడి ఎందుకని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పీలేరు మండలం బాలంవారిపల్లెలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతిందనీ, ప్రభుత్వం చేతనైతే రైతలకు ఇన్పుట్ సబ్సీడీ, పంటల బీమా చేయించాలన్నారు. సుడిగాలి పర్యటనలతో సాధించేదేముందని ప్రశ్నించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప వేరొకటి కాదన్నారు. రెయిన్‌గన్స్ మంత్రులు వచ్చినపుడు మాత్రమే పనిచేస్తున్నాయని, అనంతరం మొరాయిస్తున్నాయని తెలిపారు. మంత్రులు, ఐఏఎస్‌లు, గ్రూప్‌వన్ అధికారులను ఇన్చార్జులుగా నియమించి ప్రభుత్వం సాధించింది శూన్యమన్నారు. సీఎం సుడిగాలి పర్యటనలు హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం, మంత్రుల ప్రొటోకాల్, పర్యటనల ఖర్చులెంతని ప్రశ్నించారు. ఆరు నెలల ముందుగానే కళ్లు తెరచి యాక్షన్‌ప్లాన్ తయారుచేసుకుని ఉండాలన్నారు. ఇప్పుడు హడావుడి చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ పనితీరు అధ్వానంగా ఉందన్నారు. కృష్ణ పుష్కరాల పేరిట రూ.1,400 కోట్ల ప్రజాధనం సీఎం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈనెల 11 నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రెయిన్‌గన్స్, స్ప్రింకర్లపై వైఎస్ఆర్సీపీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.