breaking news
wedding Busy
-
పెళ్లి సందడి
‘పెళ్లి కళ వచ్చేసిందే బాల... పల్లకీని తెచ్చేసిందే బాల.. హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా.. ముచ్చటగా మేళం ఉందా ఆజా ఆజా.. తద్దినక తాళం ఉంది ఆజా ఆజా.. మంటపం రమ్మంటుంది ఆజా ఆజా.. జంటపడు వేళయ్యింది ఆజా ఆజా’.. ప్రేమించుకుందాం రా సినిమాలోని ఈ పాట ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్మోగుతోంది. పెళ్లి సందడి మొదలు కాగా.. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు వేలాది వివాహాలు ఖరారయ్యాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్ల బుకింగ్ క్లోజ్ కాగా.. పెళ్లి సామగ్రి కొనుగోళ్లతో ఆయా షాపులు కిటకిటలాడుతున్నాయి. సాక్షి, వరంగల్ రూరల్: కార్తీక మాసం మొదటి పక్షం రోజులు గురుపాఢ్యమి ఉండటంతో వివాహ ముహూర్తాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ఈ నెల 12వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలకు అనువైన రోజులుగా వేదపండితులు చెబుతుండటంతో జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. డిసెంబర్ 1 నుంచి 2018 ఫిబ్రవరి 16వ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుండటంతో పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. దీంతో పెళ్లి సంబంధాలు ఒకే చేసుకున్న వారు ఈ నెల 30వ తేదీ వరకే చేయాలని నిర్ణయించుకున్నారు. అందులోనూ 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ మూహూర్తాలు ఉండటంతో వాటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడు నెలల వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఎంత కష్టమైన పెళ్లి చేద్దాం.. అని కొంత మంది నిర్ణయించుకుంటున్నారు. సమయానికి డబ్బులు అందకున్న అప్పు తెచ్చి వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ముహూర్తాలలో దాదాపు వెయ్యి నుంచి 2 వేలకు పైగా వివాహాలు జరుగనున్నాయి. అన్నింటికీ డిమాండ్.. రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో కల్యాణ మండపాలు, గార్డెన్లు, ఫంక్షన్ హాల్లు, క్యాటరింగ్, ఫొటో వీడియో, అయ్యగార్లకు, టెంట్ హౌజ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మ«ధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలలను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద పెద్ద హోటల్స్ రూమ్స్ ఇప్పటికే హౌజ్‌ఫుల్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 150కి పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. పెళ్లి ముహూర్తాల రోజున బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు... పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటల్స్ కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పట్టణాల్లో ఇంక కొంత మంది అయితే పెద్ద గ్రౌండ్లను ఎంచుకుంటున్నారు. అపురూపమైన సెట్టింగ్‌లు, ఎక్కడలేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కన్పిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైన వెనుకాడటం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల నుంచి ఆర్ట్ డైరెక్టర్లను కూడ రప్పిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్న వారు సైతం ఎంతో క్లోజ్‌గా వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సులు, రైళ్ల పైనా.. పెళ్లిళ్ల ప్రభావం.. ఈ పెళ్లి ముహూర్తాలతో బస్సులు రైల్వే టికెట్లు ఇప్పటికే చాలా వరకు రిజర్వేషన్ అయిపోయాయి. రైళ్లు రద్దీగా నడుస్తున్నాయి. ఏదేమైనా శుభముహూర్తాల పుణ్యమా అంటూ ట్రావెల్స్ కార్లు బిజీ అయిపోయాయి. రెట్టింపైన ధరలు.. పెళ్లి ముహూర్తాలు ముంచుకురావడంతో అన్ని ధరలపై ప్రభావం పడింది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 10వేలు తీసుకునే బ్యాండ్, డీజే వారు ఈ నెల అధికంగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో బ్యాండ్ వాలా రూ. 13 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో పురోహితుడు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమచారం. సాధారణ సమయాల్లో ఉన్నా ఫంక్షన్ హాల్ల అద్దె 25 శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నారు. తర్వాత ముహూర్తాలు ఫిబ్రవరిలోనే.. అక్టోబర్ 10వ తేదీ వరకు వివాహాలు జరిగాయి. మళ్లీ ఈ నెల 23, 24, 25, 26, 29, 30 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఉన్నాయి. శుక్రపాఢ్యమి వచ్చింది. అందుకే ముహూర్తాలు లేవు. జిల్లాల్లో దాదాపు వెయ్యికి పైగా జంటలు ఒకటి కానున్నారు. – రాజ్‌కుమార్ శాస్త్రి, వరంగల్ వివాహాలకు అనువైన రోజులివి.. ఈ నెల 23 నుంచి వివాహాలకు మంచి ఘడియలు ఉన్నాయి. 30వ తేదీ నుంచి 2018 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రపాఢ్యమి కొనసాగుతుంది. అందుకే చాలా మంది ఈ నెలలోనే వివాహం జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. – వి. రామచంద్రయ్యశర్మ, పురోహితులు బంగారం కొనుగోళ్లు పుంజుకున్నాయి... వివాహ ముహూర్తాలు వరుసగా ఉండటంతో బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోళ్లు పుంజు కున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధించిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో చాలా కాలం నుంచి బంగారం కొనుగోళ్లు సన్నగిళ్లాయి. అయితే కార్తీకమాసం అనంతరం పెళ్లిళ్లు, శుభ ముహూర్తాలు ఉండటంతో కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈనెల 23 నుంచి వరుసగా కళ్యాణాలు ఉండటంతో బంగారం అమ్మకాలు జరుగుతున్నాయి. – పోకల లింగయ్య, పోకల లింగయ్య జువెలర్స్ యజమాని, బులియన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జనగామ. ముందే బుకింగ్... ఈ నెల 23, 24 తేదీలకు నెల రోజుల ముందే ఫంక్షన్ హాల్ బుకింగ్ అయింది. హాల్ కోసం చాలా మంది తిరిగి పోతున్నారు. నెల పది రోజుల సమయం తరువాత పెళ్లిళ్లు అవుతుండటంతో డిమాండ్ బాగా ఉంది. – రమేష్ రెడ్డి, భారత్ ఫంక్షన్ హాల్, భూపాలపల్లి ఎనిమిది కార్డులు వచ్చాయి.. ఈ నెల 23, 24 తేదీలకు సంబంధించిన పెళ్లి కార్డులు 8 కార్డులు వచ్చాయి. ఇంక దాదాపు 10 మంది దూరపు బంధువులు ఫోన్లు, వాట్సప్ ద్వారా ఆహ్వానించారు. అన్నింటికి అటెండ్ కావడం అంటే కొంత కష్టంగానే ఉంది. కానీ తప్పని పరిస్థితిలో అందరు దగ్గరి బంధువులు, స్నేహితులు కావడంతో నేను, మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వేరు చేసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఇంక సమయం ఉంది. కాబట్టి మరికొన్ని కార్డులు వచ్చే అవకాశం ఉంది. – ఆడెపు రవీందర్, వరంగల్ -
ఆ నాలుగు రోజులూ పెళ్లి సందడే
అమలాపురం :వచ్చేది శూన్యమాసం.. నాలుగు నెలల పాటు శుభకార్యాలు నిర్వహించే అవకాశం లేదు. అందుబాటులో రెండు బ్రహ్మాండమైన ముహూర్తాలు. ఇం కేం.. ముందుగా కుదుర్చుకున్నవారే కాకుండా ఇప్పటికిప్పుడు సంబంధాలు కుదుర్చుకున్నవారూ తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వచ్చే వారంలో జిల్లాలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈనెల 13, 14,15,19 తేదీల్లో శుభముహూర్తాలు రావడంతో జిల్లాలో వేలాది పెళ్లిళ్లు జరగనున్నాయి. పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశాలు, కొత్త వ్యాపార సంస్థలు, దుకాణాల ఆరంభం వంటి కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి. 13వ తేదీన రాత్రి 7.54 గంటలకు, 12.33 గంటలకు, 14న రాత్రి 7.54, అర్ధరాత్రి 12.36, తిరిగి తెల్లవారు జామున 3.21కి, 15న రాత్రి 12.29కి, 19న తెల్లవారు జామున నాలుగు గంటలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 14న తెల్లవారుజామున 3.21, 15న అర్ధరాత్రి 12.29 గంటల ముహూర్తాలు మిథునలగ్నంలో రావడంతో ఈ రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి శూన్య మాసం మొదలవుతోంది. దీంతో డిసెంబర్ వరకూ ముహూర్తాలు లేవు. డిసెంబరులో ముహూర్తాలున్నా అవి చెప్పుకునేంత పెద్దవి కావు. బలమైన ముహూర్తాలు కావాలంటే ఫిబ్రవరి, మార్చి వరకూ వేచి చూడాల్సిందే. ఈ కారణాల వల్లే ఈ నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు గృహప్రవేశాలు పూర్తి చేస్తున్నారు. 14న ఒక్కరోజే జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వెయ్యి వరకు వివాహాలు జరగనున్నాయి. మిగిలిన ముహూర్తాల సమయంలో కూడా భారీగానే పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. అమలాపురం శ్రీభూసమేత వెంకటేశ్వరరావు ఆలయంలో 150 వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. సమయం దగ్గర పడే నాటికి వీటి సంఖ్య ఇంకా పెరుగుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. అన్నీ గిరాకీనే అటు పెళ్లిళ్లు.. ఇటు గృహప్రవేశాలు.. వేలాది సంఖ్యలో జరుగుతుండడంతో పురోహితుల వద్ద నుంచి వంట మేస్త్రుల వరకు, లైటింగ్ నుంచి పూల డెకరేషన్ వరకు గిరాకీ ఏర్పడింది. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం వంటి పట్టణాలతోపాటు మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణమంటపాలు బుక్కయ్యాయి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటున్నవారు ప్రైవేట్ పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలపై ఆధారపడుతున్నారు. మిగిలినవారికి ఖాళీస్థలాలు.. ఇంటి ముందు రోడ్లే వివాహ వేదికలు కానున్నాయి. అయితే వర్షాకాలం కావడం వల్ల ఎక్కువ మంది కల్యాణ మంటపాలకే మొగ్గు చూపుతున్నారు. పురోహితులకు, వంటవారికి చేతి నిండా పనే అన్నట్టుగా ఉంది. లైటింగ్, బ్యాం డ్ మేళాల వారు సైతం ఇప్పటికే శ్రావణమాసం కారణంగా అరటి, పువ్వుల ధరలకు రెక్కలొచ్చాయి. ముహూర్తాలు దగ్గర పడే కొద్దీ వీటి రేటు పెరుగుతుందని వ్యాపారులు అంచనా.