breaking news
Warangal Rural SP
-
డబ్బుల కోసం కన్న కొడుకునే అమ్మిన తండ్రి.. తల్లి చొరవతో..!
నాన్న.. కుటుంబమనే టీంకు నాయకుడు. ఇంట్లో అందరి బాధ్యతలను ముందుండి చూసుకుంటాడు. అందుకు ఎంత కష్టమైన ఇష్టంగా భరిస్తాడు. తను ఉండగా.. పిల్లలకు ఏ ఆర్థిక ఇబ్బందులు రాకుండా సమాజంలో పోరాడతాడు. ఇంట్లో నాన్న ఉంటే కుటుంబ సభ్యులకు ఉండే ధైర్యమే వేరు. అలాంటిది.. నాన్నే డబ్బుల కోసం పిల్లలను అమ్మేస్తే.. ! ఇలాంటి అమానవీయ ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. జిల్లాలో షేక్ మసూద్ అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. వారికి నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇటీవల వారిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. డబ్బుల కోసం షేక్ మసూద్.. ముగ్గురు మహిళల సహాయంతో తన కుమారుడిని హైదరాబాద్ కు చెందిన దంపతులకు విక్రయించాడు. విషయం తెలుసుకున్న భార్య పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఆ ముఠా దగ్గర నుంచి బాలుడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి మసూద్‌తో పాటు ఇందుకు సహకరించిన శాకరాసికుంట, రాయపుర, కేఎల్ మహేంద్రనగర్, కీర్తినగర్ చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఓ సినిమా థియేటర్‌కు వాచ్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తి కూడా ఇందులో పాలుపంచుకున్నారని తెలిపారు. బాలున్ని అయాన్ గా గుర్తించి, తల్లి చెంతకు చేర్చారు. చదవండి:సంసారానికి పనికిరాని భర్త.. డబ్బుల కోసం మరో పెళ్లి.. ఫోటోలు మార్పింగ్ చేసి.. -
ఇక ఇంటింటికీ పోలీస్
వరంగల్ క్రైం : ప్రజా రక్షణ కోసం ఇకనుంచి ఇంటింటికీ పోలీసుల సందర్శన ఉంటుందని వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జి ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. దొంగతనాలను నిరోధించడానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘మీ కోసం పోలీసు’ సదస్సును హన్మకొండ పోలీసులు అమృత గార్డెన్స్‌లో గురువారం నిర్వహించారు. సదస్సుకు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో పాల్గొన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి.. ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలనే పద్ధతులపై హన్మకొండ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వివరించారు. అనంతరం ఎస్పీ చేతులమీదుగా ‘అప్రమత్తంగా ఉండండి-దొంగతనాలను నివారించండి’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్‌ను విడుదల చేసిన తర్వాత వలంటరీ బృందాలకు ప్రచార సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దొంగతనాలను నిరోధించడంలో ప్రజల సహకారం తప్పనిసరి అని ఇందుకోసం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం యువత అవసరం ఎంతైనా ఉందని, ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లను వినియోగించడం ద్వారా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత పెంపొం దుతుందని అన్నారు. ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి శాంతిభద్రతల పరిరక్షణకు అనేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోనే తొలిసారిగా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రజా రక్షణ కార్యక్రమం ‘మీ కోసం పోలీసు’ తొలిసారిగా హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 20వేల కుటుంబాలను అప్రమత్తం చేయడంతోపాటు వారిని చైతన్యవంతులను చేసేందుకు స్టేషన్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లతో 350 బృందాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో బృందంలో ఇద్దరు వలంటీర్లు ఉంటారు. వీరు ఇంటింటికీ దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితుల పట్ల వ్యవహరించాల్సి తీరు, వీటిపై ఎలా స్పందించాలనే తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత పోలీసు సూచనలతో కూడిన స్టిక్కర్ ఆ ఇంటికి అతికించి ఇంటి యజమానికి కరపత్రాన్ని అందజేస్తారు. కార్యక్రమంలో హన్మకొండ డీఎస్పీ శోభన్‌కుమార్, కేయూసీ, సుబేదారి ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, నరేందర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, ఎస్సై శ్రీనివాస్, పులి రమేష్, తాజొద్దీ, ఎన్సీసీ ఇన్చార్జి మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.