breaking news
Vashi
-
షిర్డీ వెళ్లొస్తుండగా తెలుగువారిపై దారి దోపిడీ
ముంబై: దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన తెలుగు వారిపై మహారాష్ట్రలో దోపిడీ దొంగలు దాడికి పాల్పడి దొరికిన సొమ్మును దోచుకెళ్లారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాసీలో చోటుచేసుకుంది. బాధితులు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అయితే దోపిడీ దొంగల దాడిలో గాయపడిన తెలుగువారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వికారాబాద్ జిల్లా బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కె.రాములు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. కుల్కచర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రమేశ్. వీరిద్దరూ తమ కుటుంబంతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీకి కారులో వెళ్లారు. షిర్డీ యాత్ర ముగించుకుని శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. కర్నాటకలోని వాసీ పోలీస్స్టేషన్ పరిధిలోకి రాగానే దొంగలు వీరి కారును అడ్డగించారు. రోడ్డుపై మేకులు వేసి కారు పంక్చరయ్యేలా చేశారు. అయితే దొంగలను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దొంగలు రెచ్చిపోయారు. ఆ కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొడుతూ.. కత్తులతో బెదిరిస్తూ డబ్బులు, ఆభరణాలు వసూల్ చేశారు. దీంతో ప్రాణభయంతో వారంతా తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదు ఇచ్చేశారు. ప్రస్తుతం కర్నాటకలోని హుమ్నాబాద్లో ఉన్న ఓ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా కత్తులు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది. వీరి దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలను దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాసీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని రావాల్సి ఉంది. -
హోటల్లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి
ముంబయి: ముంబయిలోని వాషి ప్రాంతంలో ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎన్ఎంఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం ... హోటల్లో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో మృతి చెందిన ఓ మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.