
ముంబై: మహానగరం ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున నవీ ముంబైలోని వాషీలోగల రహేజా రెసిడెన్సీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. 10వ అంతస్తులో తెల్లవారుజామున 12.40 గంటలకు ప్రారంభమైన మంటలు 11, 12 అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ)పరిధిలోని అగ్నిమాపక విభాగం తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే వాషి, నెరుల్, ఐరోలి, కోపర్ఖైరేన్ స్టేషన్ల నుండి అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది హోస్ లైన్లు వేసి, వెంటనే మంటలను అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశారు.‘ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా బయటకు తరలించాం’ అని ఎన్‌ఎంఎంసీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తం జాదవ్ తెలిపారు.
10వ అంతస్తులోని ఒక ఫ్లాట్ నుండి మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మృతులంతా రహేజా రెసిడెన్సీ నివాసితులేననని జాదవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోనికి తెచ్చేందుకు చాలా సమయం పట్టిందని, ఎవరూ లోపల చిక్కుకోకుండా అగ్నిమాపక బందాలు పర్యవేక్షించాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంపై వాషి అగ్నిమాపక కేంద్రంతోపాటు ఎన్‌ఎంఎంసీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.