breaking news
vaira river
-
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
-
భారీ వర్షాలు: రెండో రోజు నిలిచిన రైళ్లు
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. గుంటూరు జిల్లావ్యాప్తంగా శుక్రవారం మళ్లీ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. నగర శివారులోని పలు కాలనీలు ఇప్పటికే జలమయమైనాయి. దీంతో శివారు ప్రాంతానికి చెందిన ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గురువారం వరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ఏడుగురు మృతి చెందగా... మరొకరు గల్లంతయ్యారు. అలాగే జిల్లాలోని రైల్వే ట్రాక్ ఏడు చోట్ల దెబ్బతింది. దీంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గుంటూరు - సికింద్రాబాద్ మధ్య రెండో రోజు కూడా రైళ్లు నడవని పరిస్థితి ఏర్పడింది. రైల్వే ట్రాక్‌లు మరమ్మతులు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగింది. భారీ వర్షాలతో జిల్లావ్యాప్తంగా 66 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఓ వేళ వరద పోటెత్తితే రంగంలోకి దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలోని వర్షాలు, వరదల పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలెక్టర్ కాంతిలాల్ దండే ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలకు జిల్లాలోని కాకుమాను మండలం కొండపాటూరులో నల్లమడ వాగుకు గండి పడింది. గరికపాడు సమీపంలో కొమ్మమూరు కెనాల్‌కు గండి పడింది. దీంతో పంట పొలాల్లొకి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా : జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు కుంటలు చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజానగరం చెరువుకు గండిపడింది. కృష్ణా జిల్లా : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. 70 గేట్లు ఎత్తి లక్షా 32 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల కారణంగా నందిగామ, వీరులపాడు, వత్సవాయి మండలాల్లో పొన్నేరు, కట్టలేరు, వైరా ఏరు ఉధృతిగా ప్రవహిస్తుంది. వీరులపాడు కూడలి వద్ద కాజ్వే పైకి భారీగా నీరు వచ్చి చేరింది. 25 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో వేగవతి, సువర్ణముఖి నదులకు వరద పోటెత్తింది. దీంతో మద్దివలస రిజర్వాయర్‌కు 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తివేసి.. నీటికి దిగువకు విడుదల చేశారు. -
'టీడీపీ నేతల అక్రమ ఇసుక రవాణా వల్లే విషాధం'
-
'టీడీపీ నేతల అక్రమ ఇసుక రవాణా వల్లే విషాధం'
విజయవాడ : వీరులపాడు మండలం కొణతాలపల్లిలోని వైరా నదిలోపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై వైఎస్ఆర్ సీపీ నేత డాక్టర్ జగన్మోహన్రావు స్పందించారు. టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు... ఆ క్రమంలో ఏర్పడిన ఇసుక గుంతల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలన్నారు. వైరా నదిలో పడి ఆదివారం ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులు శ్రీనివాసరావు, నాగేంద్రబాబు, అరుణ్‌కుమార్‌గా గుర్తించారు. వీరి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.