breaking news
underworld don dawood
-
దావూద్.. కేరాఫ్ పాక్
భారత్ ఇచ్చిన ఆరు చిరునామాలు ధ్రువీకరించిన ఐరాస - తొమ్మిది చిరునామాల్లో ఆరు సరైనవే - కుటుంబ సభ్యుల పేర్లు పేర్కొన్న ఐరాస కమిటీ ఐక్యరాజ్యసమితి: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు పాకిస్థాన్ ఆశ్రయమిచ్చినట్లు మరోసారి రుజువైంది. భారత్ వాదనకు బలం చేకూరేలా పాక్‌లో దావూద్ నివాసాలకు సంబంధించిన చిరునామాలను ఐరాస కమిటీ ధ్రువీకరించింది. భారత్ రూపొందించిన పాక్‌లోని దావూద్ చిరునామాల జాబితాలోని తొమ్మిందింటిలో.. ఆరు సరైనవేనని, మూడు మాత్రం తప్పు చిరునామాలని ఆ కమిటీ స్పష్టం చేసింది. దీంతో భారత్ వాదనను ఖండిస్తూ వస్తున్న పాక్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది. భారత్ ఇచ్చిన జాబితాను భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, అల్‌కాయిదా శాంక్షన్స్ కమిటీ సోమవారం సవరించింది. జాబితాలోని మూడు చిరునామాలను కొట్టివేసింది. ఈ మూడింటిలో ఒకటి యూఎన్‌లో పాక్ రాయబారి మలీహ లోధీది అని గుర్తించింది. భద్రతా సమితి కమిటీ 1267 (1999), 1989 (2011), 2253 (2015) తీర్మానాల విషయంలో అండర్లైన్, కొట్టివేతలతో ఆ సవరణలు చేసింది. సవరణల్లో వ్యక్తులు, సంస్థలకు చెందిన ఆస్తుల జప్తు, ప్రయాణాలపై నిషేధం, ఆయుధాల ఆంక్షలు ఉన్నాయి. దీనిలో దావూద్‌కు సంబంధించిన పాకిస్తాన్‌లోని కరాచి చిరునామాలు కూడా ఉన్నాయి. ఈ చిరునామాలతోనే గతేడాది ఆగస్టులో భారత్ ఒక జాబితా ఐరాసకు ఇచ్చింది. యూఎన్ సవరణ జాబితాలో దావూద్ పాస్‌పోర్ట్ నంబర్లను కూడా పేర్కొంది. 1985 ఆగస్టు 18న దుబాయ్ ఇచ్చిన పాస్‌పోర్టు, 1991 ఆగస్టు 12న పాక్‌లోని రావల్పిండిలో పొందిన పాస్‌పోర్టును అతను దుర్వినియోగం చేశాడని పేర్కొన్న కమిటీ.. 1996లో పాస్‌పోర్టు నం సి-267185 (కరాచి), 2001లో నంబర్ హెచ్-123259 (రావల్పిండి), నంబర్ జి-869531 (రావల్పిండి)లలో పాక్ ఇచ్చిన వాటిని కూడా పేర్కొంది. భుట్టో ఇంటి సమీపంలోనే నివాసం దావూద్ చిరునామాల్లో ఒకటి పాక్ మాజీ ప్రధాని భుట్టో కొడుకు బిలావల్ భుట్టో నివాసం సమీపంలో ఉంది. దావూద్ చిరునామాల జాబితాను పాక్ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్‌కు ఇవ్వాలని భారత భద్రతా సలహాదారు రెండేళ్ల క్రితం అనుకున్నారు. ద్వైపాక్షిక చర్చలు రద్దు కావడంతో జాబితాను ఐరాసకు అందజేశారు. పాక్‌లో తరచూ ఇళ్లు మార్చే దావూద్ పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టాడని, పాక్ సంస్థల రక్షణలో అతను ఉన్నాడని నివేదికలో పేర్కొన్నారు. దావూద్ తండ్రి పేరు షేక్ ఇబ్రహీం అలీ కస్కర్, తల్లి పేరు అమీనా బి, భార్య పేరు మెహజబీన్ షేక్‌గా పేర్కొంది. ముంబైలో పుట్టిన దావూద్‌కు షేక్ ఫరూఖీ, బాబా సేథ్, బాబా భాయ్, ఇక్బాల్ భాయ్, ముచ్చాద్, హజీ సాహెబ్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయని తెలిపింది. -
దావూద్ చిరునామా దొరికింది..
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందం నిగ్గు తేల్చిన వాస్తవమిది. పాకిస్థాన్‌లోని ఆరు ప్రాంతాల్లో దావూద్‌కు ఇళ్లు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి బృందం నిర్థారించింది. ఈమేరకు దావూద్ నివాసాలకు సంబంధించి భారత్ సమర్పించిన 9 చిరునామాల్లో 6 సరైనవేనని ఐరాస ప్రత్యేక బృందం తేల్చింది. మూడు చిరునామాలు మాత్రం తప్పని పేర్కొంది. యూఎన్ఓ వ్యాఖ్యలతో దావూద్‌కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూ వస్తోందని భారత్ చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లైంది. పాకిస్థాన్‌లో దావూద్ నివాసాలకు సంబంధించి భారత నిఘా సంస్థలు కచ్చితమైన ఆధారాలు సంపాదించాయి. ఆ సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పాకిస్థాన్ విదేశాంగ కార్య దర్శి సర్తాజ్ అజీజ్‌కు అందచేశారు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బృందానికి కూడా ఆ సమాచారాన్ని చేరవేశారు. భారత్ అందించిన ఆధారాలను ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. అనంతరం దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని నిర్దారించింది. కాగా 1993లో ముంబై పేలుళ్లకు దావూద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అతడు భారత్ నుంచి పరారయ్యాడు. ముంబై నుంచి మకాం ఎత్తేసి విదేశాలకు పారిపోయాడు. కొన్నాళ్లు దుబాయ్‌లో తలదాచుకున్నాడని, తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీలో నివాసం ఏర్పరచుకున్నాడని, పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అతడికి సహకరిస్తోందని వార్తలు వచ్చాయి. ఆ కథనాలు వెలువడిన వెంటనే దావూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, అతడి అప్పగింత కోసం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భారత హోంశాఖ ప్రకటించింది. అయితే, పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం అతడు తమ దేశంలో లేనే లేడంటూ ఆ వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు దావూద్ ఇబ్రహీం భారత్‌కు మాత్రమే కాదు, అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కూడా ‘బాగా కావాల్సిన’ (మోస్ట్ వాంటెడ్) నేరగాడు. ముంబైలో 1993లో జరిగిన పేలుళ్లకు ఆర్థిక సహకారం అందించడమే కాకుండా, పేలుళ్ల కుట్రలో కీలక పాత్ర పోషించినందుకు ఇతడిపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2008లో జరిగిన ముంబై పేలుళ్లు సహా పలు ఉగ్రవాద చర్యల్లో దావూద్ పాత్ర ఉన్నట్లు భారత్, రష్యా ఇంటెలిజెన్స్ సంస్థలు ఆధారాలు సేకరించాయి.