గుండెపోటుతో బస్సులో వ్యక్తిమృతి
మన్ననూర్ : హైదరాబాద్ నుంచి (పికెట్ డిపో) శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం గుండెపోటుతో గోరిట అనిల్(45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మన్ననూర్ వద్ద చోటుచేసుకుంది. బస్సు కండక్టర్ ఎస్ఎస్ కుమార్ తెలిపిన వివరాలు... రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ గ్రామానికి చెందిన అనిల్‌తో పాటు మరోవ్యక్తి శ్రీశైలం వెళ్లేందుకు విడివిడిగా టికెట్ తీసుకున్నారని తెలిపారు. బస్సు మన్ననూర్‌కు చేరుకోగానే బస్సులోని మొత్తం 25మంది ప్రయాణికుల్లో 9మంది దిగిపోయారని చెప్పారు. ఈ క్రమంలో బస్సులో మిగిలి ఉన్న ప్రయాణికులను లెక్కించుకునేందుకు వెనక్కి వెళ్లగా, వెనక నుంచి రెండోసీట్లో కూర్చున్న వ్యక్తి మృతి చెందినట్లు గమనించిన కండక్టర్ బస్సుడ్రైవర్ యాదయ్యకు తెలిపాడు. బస్సును అక్కడే ఆపి, వెంటనే అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమర్టం కోసం అదేబస్సులో అమ్రాబాద్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.