breaking news
Telangana appointed Day
-
అపాయింటెడ్ డే తర్వాతే ఆ సంస్థల విభజన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపాయింటెడ్ డే నాటికి షెడ్యూల్ తొమ్మిదిలోని 20 సంస్థలను విభజించాలని ముందు నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడది సాధ్యం కాదని, రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి జెన్కో, ఆర్టీసీలో మాత్రమే విభజన ప్రక్రియ పూర్తయిందని.. బ్రూవరీస్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ, సీడ్స్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విద్యుత్ ఆర్థిక సంస్థ, రాష్ట్ర గిడ్డంగులు, పర్యాటకాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, వైద్య మౌలిక సదుపాయల సంస్థలను జూన్ రెండో తేదీకి విభజించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే వీటి విభజన అంత సులువు కాదని, అందుకు గడువు కావాలని ఆయా సంస్థల అధిపతులు కోరినట్లు సమాచారం. -
టీఆర్‘ఎస్’ టీంపై కసరత్తు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ అపాయింటెడ్ డే సమీపిస్తోంది. జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించనుంది. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కొలువుదీరేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కొత్త సర్కార్ ఏర్పాటైన వెంటనే జిల్లా పరిపాలన వ్యవస్థ భారీ ప్రక్షాళన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా నుంచి మండల స్థాయిలో అధికారుల బదిలీలతో రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రధాన శాఖలు భారీగా కుదుపునకు గురయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన అధికారులకు జిల్లాలో పోస్టింగ్‌లు ఇప్పించారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో చాలా మంది ఇలా ఎవరో ఒకరు సిఫారసు చేస్తే వచ్చిన వారే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ అధికారులంతా ఆ పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేస్తూ వారికి విధేయులుగా నడుచుకున్నారు. వరుసగా జరిగిన సహకార, పంచాయతీ, మునిసిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కొందరు అధికారులైతే బహిరంగంగా అధికార పార్టీకి సహకారం అందించారు. అందోల్, సంగారెడ్డి తదితర నియోజకవర్గాల పరిధిలో కొందరు పోలీసు అధికారులైతే టీఆర్ఎస్ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగి భయాందోళనలకు గురి చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలకు విధేయులుగా వ్యవహరించిన అధికారులను బదిలీపై జిల్లా సరిహద్దులు దాటించాలని ఆయా నియోజకవర్గాల నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఎవరి వారు తమ నియోజకవర్గాల్లో సొంత టీంలను ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల్లో చాలా మంది స్థానచలనం తప్పని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అండతో వీర్రవీగిన కొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐల తక్షణ బదిలీలు ఉండవచ్చని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మాజీల అండతో దీర్ఘకాలంగా పోస్టులకు అతుక్కుపోయిన అధికారులకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ బదిలీ తప్పదని తేలిపోవడంతో ఇతర జిల్లాల్లో మంచి పోస్టింగ్‌లను దక్కించుకోవడానికి ఇప్పటికే కొందరు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కీలక కుర్చీలపై కర్చీఫ్ జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పోస్టులను దక్కించుకోవడానికి బయటి జిల్లాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా స్థాయి పోస్టుల కోసం టీఆర్ఎస్ ముఖ్యనేతలను, నియోజకవర్గ, మండల స్థాయి పోస్టుల కోసం ఆయా స్థానాల నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదించి ముందే బెర్తులు ఖరారు చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారుల పంపకాల అనంతరం జిల్లాలో ఖాళీ అయ్యే పోస్టులు ఇతర అధికారుల చేతుల్లోకి వెళ్లకుండా కొందరు అధికారులు ఇప్పటి నుంచే కర్చీఫ్ వేస్తున్నారు. సదరు పోస్టులు మీకేనని టీఆర్ఎస్ ముఖ్యనేతలు, తాజా ఎమ్మెల్యేలు తమను కలిసిన కొందరు అధికారులకు హామీలు గుప్పిస్తున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణేతరుల గుర్తింపు షురూ.. తెలంగాణలో పనిచేస్తున్న తెలంగాణేతర అధికారులు, ఉద్యోగులందరినీ గుర్తించి వారివారి సొంత ప్రాంతాలకు పంపిస్తామని కేసీఆర్ గురువారం ఖరాఖండీగా తేల్చి చెప్పారు. దీని కోసం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో పనిచేస్తున్న తెలంగాణేతరులను గుర్తించే బాధ్యతలను టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది.