breaking news
Swaccha Bharath
-
Tirupati Municipal Corporation: వ్యర్థం.. పరమార్థం
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. ఇటీవల స్మార్ట్‌సిటీ పోటీల్లో వరుసగా 5 జాతీయ స్థాయి ర్యాంకులు సొంతం చేసుకుని తిరుపతి ప్రత్యేకతను చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తొలిసారిగా వాటర్ ప్లస్ (వ్యర్థపునీటి నిర్వహణ, పునర్వినియోగం) విభాగంలో నిర్వహించిన పోటీల్లో తిరుపతి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. దక్షిణాది నుంచి నాలుగు నగరాలు మైసూర్, విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలు పోటీపడ్డాయి. ఈ పోటీల్లో తిరుపతి వాటర్ ప్లస్ డిక్లరేషన్ పొందిన ఏకైక నగరంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వహించిన పోటీల్లో తిరుపతి ఈసారి తొలి ఈవెంట్లోనూ సత్తా చాటింది. వచ్చే ఏడాది నిర్వహించే ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం పోటీ పడనుంది. వ్యర్థపు నీటిశుద్ధి ఇలా.. తిరుపతిలో బాత్రూమ్స్, టాయిలెట్ల నుంచి రోజుకు 34.5 ఎంఎల్డి వ్యర్థపు నీరు (3కోట్ల 45 లక్షల లీటర్ల నీరు) వెలువడుతోంది. ఈ నీటిని పునర్వినియోగం దిశగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రేణిగుంట సమీపంలోని తూకివాకం గ్రీన్ సిటీలో ఎస్టీపీ (సివర్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను నిర్వహిస్తోంది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్‌ను వివిధ కేటగిరీల వారీగా శుద్ధి చేస్తోంది. టాయిలెట్ల నీటిని ప్రత్యేక యాంత్రీకరణ పద్ధతిలో, బాత్ రూమ్‌ల నీటిని మూడు చెరువుల ద్వారా ఫిల్టర్ చేస్తూ శుద్ధి చేస్తోంది. ఇలా రోజుకు 22 ఎంఎల్డీ నీటిని పునర్వినియోగంలోకి తీసుకువస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వినియోగానికి పైపులైన్ల ద్వారా రోజుకు 5 ఎంఎల్డీ సరఫరా చేస్తున్నారు. తద్వారా నెలకు రూ.5లక్షల వరకు కార్పొరేషన్‌కు ఆదాయం లభిస్తోంది. అలానే తూకివాకం పంచాయతీ పరిసర ప్రాంతాల రైతులకు ఈ శుద్ధి నీటిని రోజుకు 12 ఎంఎల్‌డీని ఉచితంగా సరఫరా చేయడంతోపాటు నీటి శుద్ధి అనంతరం అడుగున నిలిచే సారవంతమైన బురదను సైతం పొలాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది. పార్కుల నిర్వహణకు.. తిరుపతిలో పార్కుల నిర్వహణ, డివైడర్లలో మొక్కల పెంపకాలకు శుద్ధి చేసిన ఈ నీటిని వినియోగిస్తున్నారు. 4 పార్కులు, మొక్కల పెంపకం, డివైడర్లలో పచ్చదనం కోసం రోజూ 3 ఎంఎల్డీలకు పైగా నీటిని వినియోగిస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు ఈ నీటి కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. లీటరు నీటికి రూ.4–5లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇలా వ్యర్థపు నీటి పునర్వినియోగంతో లాభపడుతూనే రైతులకు ఉచితంగా నీటిని ఇస్తోంది. ఈ ప్రక్రియ కోసం నెలకు రూ.5లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఎస్టీపీలో 26 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వాటర్ ప్లస్ పోటీలకు డాక్యుమెంటేషన్‌ను డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరరెడ్డి సిద్ధం చేయగా, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ విజయకుమార్‌రెడ్డి ప్లాంట్ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. నగర ప్రజల విజయం ఈ ఏడాది తిరుపతికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు రావడం నగర ప్రజల విజయం. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రతి అంశంలోనూ తిరుపతి ముందడుగు వేస్తోంది. అధికారుల పనితీరు అవార్డులను తెచ్చిపెడుతోంది. అందరూ సమన్వయంతో ఇదే స్థాయిలో ముందుకెళ్లి తిరుపతి కీర్తిని మరింత ఇనుమడింప చేస్తాం. –భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యే తిరుపతి మరింత విస్తరిస్తాం ఎస్టీపీ ప్లాంట్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎస్డీఆర్ టెక్నాలజీ ద్వారా రోజుకు 5ఎంఎల్డీ వాటర్‌ను మరింతగా శుద్ధి చేసి టాయిలెట్లు, ఇతర అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాం. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచింది. వచ్చే ఏడాది ఫైవ్‌స్టార్ నగరంగా తిరుపతిని జాతీయ స్థాయిలో నిలుపుతాం. –పిఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శుభ పరిణామం ప్రభుత్వ ప్రోత్సాహంతో తిరుపతి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. దీర్ఘకాలిక ప్రాజెక్టులను చేపట్టిన అధికారుల కృషితో తిరుపతికి జాతీయ గుర్తింపు లభించింది. దక్షిణ భారతదేశంలోని వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరంగా తిరుపతి నిలవడం శుభపరిణామం. తిరుపతిని అన్ని విధాల అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తాం. –డాక్టర్ ఆర్.శిరీష, మేయర్, తిరుపతి జాతీయ గుర్తింపు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తొలిసారి వాటర్ ప్లస్ విభాగానికి పోటీలు నిర్వహించారు. మొత్తం 16 నగరాలు పోటీపడగా ఇండోర్, సూరత్, నార్త్ ఢిల్లీ, తిరుపతి నగరాలు మాత్రమే ఇప్పటివరకు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన నగరాలుగా నిలిచాయి. దక్షిణ భారత దేశం నుంచి ఈ సర్టిఫికేషన్ పొందిన ఏకైక నగరం తిరుపతి కావడం విశేషం. -
స్వచ్ఛభారత్ కోసం కృషి చేద్దాం
భారత్ స్వాభిమాన్ కేంద్ర ప్రభారి డా. జయదీప్ ఆర్యా జిన్నారం: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారత్ స్వాభిమాన్ కేంద్ర ప్రభారి డా. జయదీప్ ఆర్యా పిలుపునిచ్చారు. గురువారం జిన్నారం మండలం అన్నారంలోని ప్రకతి నివాస్‌లో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జయదీప్ ఆర్యా మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలని పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో స్వామి రాందేవ్ బాబా ప్రపంచ వ్యాప్తంగా యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. రసాయనాలతో పండిస్తున్న ఆహార ధాన్యాలు, అనారోగ్యాన్ని కల్గిస్తున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో çభారత్ స్వాభిమాన్ రాష్ట్ర అద్యక్షుడు శ్రీధర్‌రావు, మహిళా ప్రభారి మంజుశ్రీ, పతంజలి రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, కిసాన్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, పటాన్చెరు నియోజకవర్గ ప్రభారి విఠల్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నినాదాలతో పరిశుభ్ర భారత్‌గా మార్చలేం: రాహుల్
ముంబై: ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. స్పష్టమైన వ్యూహం, సరైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా కేవలం నినాదాలతో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చలేమని ఎద్దేవా చేశారు. ముంబైలోని దేవనార్ డంపింగ్ గ్రౌండ్‌ను ఆయన కాంగ్రెస్ నేతలతో కలసి మంగళవారం సందర్శించారు. గత నెల రోజుల కాలంలో ఈ డంపింగ్ గ్రౌండ్లో మూడుసార్లు అగ్నిప్రమాదం జరిగింది. అందులోంచి వస్తున్న పొగ, విషవాయువుల వల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ఈ డంపింగ్ గ్రౌండ్ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ అక్కడ పర్యటించారు.