breaking news
Sudden audits
-
భద్రాద్రిలో ‘ఔషధ’ తనిఖీలు
రూ.2.10 లక్షల విలువైన అక్రమ మందులు సీజ్ భద్రాచలం :భద్రాచలం పట్టణంలో బుధవారం ఔషద నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొత్తగూడెం, ఖమ్మం అర్భన్, రూరల్ డ్రగ్ ఇన్సిపెక్టర్లు జీ సురేందర్, వీ లక్ష్మీనారాయణ, కె సురేందర్‌ల నేతృత్వంలోని అధికారుల బృందం ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రులపై దాడులు చేశారు. ఐటీడీఏ రోడ్‌లోని చంద్రశేఖర్ హోమియో క్లినిక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన రూ.10 వేల విలువ గల మందులను, రెడ్‌క్రాస్ బిల్డిండ్ ఎదురుగా ఉన్న శ్రీవెంకటరమణ నర్సింగ్ హోమ్‌లో రూ.2 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటి నిల్వలకు ఎటువంటి అనుమతులు లేకపోవటంతో సీజ్ చేశారు. భద్రాచలం పట్టణంలో ఔషద నియంత్రణ అధికారుల తనిఖీలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదుల నేపథ్యంలో సదరు అధికారులు నేరుగా రెండు ఆసుపత్రులను తనిఖీ చేశారు. అక్కడ అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, పట్టణంలోని ఇతర ఆసుపత్రులు, హోల్‌సేల్, రిటైల్ మందుల దుకాణాల జోలికి వెళ్లకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. భద్రాచలం కేంద్రంగా ఉన్న కొన్ని హోల్‌సేల్ దుకాణాలు నాసిరకం మందులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో తిరిగే ఆర్ఎంపీలతో ఒప్పందం కుదుర్చుకున్న కొంతమంది హోల్‌సేల్ మందుల విక్రయ దుకాణదారులు పెద్దఎత్తున నిల్వలు చేసి సరఫరా చేస్తున్నారనే ప్రచారం ఉంది. కానీ ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం ఈ దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఎవరో ఫిర్యాదు చేస్తే తప్ప, ఔషధ నియంత్రణ అధికారులు మందులు దుకాణాలు, ఆసుపత్రులపై తనిఖీలు చేయాలనే ఆలోచన లేకపోవటం కూడా వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో తనిఖీల కోసమని వచ్చిన ఔషధ నియంత్రణ అధికారులకు పట్టణంలో పేరుమోసిన మందుల విక్రయ దుకాణదారులు రాచ మర్యాదలు చేయటం గమనార్హం. సదరు అధికారులు హోటల్లో అల్పాహారం తీసుకునే సమయంలో కూడా కొంతమంది మందుల దుకాణ యజమానులు వారికి సేవలు చేస్తూ కనిపించారు. తనిఖీల కోసమని వచ్చిన సందర్భంలో ఇలా మందుల దుకాణదారులను వెంట వేసుకొని తిరగటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా ఔషధ నియంత్రణ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు భద్రాచలం కేంద్రంగా సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించాల్సుంది. -
ఇకపై పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
జోగిపేట : పాఠశాలల్లో విద్యార్థుల చదువు సామర్థ్యాలు.. మౌలిక వసతులపైనా దృష్టి సారించిన తెలంగాణ సర్కార్ ఇకపై వారంలో ఒక రోజు జిల్లాలోని ఏదో ఒక పాఠశాలలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల రెండు వారం నుంచే అధికారుల పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ఏ పాఠశాలను తనిఖీ చేస్తామనే విషయం రాష్ట్ర ఉన్నత అధికారులకు తప్ప డీఇఓలకు సైతం తెలియనివ్వమని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నిర్ణయంతో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఏ పాఠశాలలో తనిఖీ ఉంటుందోనని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఇన్చార్జ్ ఎంఈఓలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పాఠశాలలు.... జిల్లాలో 2,900 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.40 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 12,300 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జిల్లాలో జిల్లా పరిషత్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. మండల, పట్టణ కేంద్రాల కంటే ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల్లోని పాఠశాలలకు టీచర్లు వారంలో రెండు రోజులకు మించి పాఠశాలలకు వెళ్లని వారు కూడా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఉపాధ్యాయులు లేక ఆయా పాఠశాలల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన సంఘటనలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పుల్కల్ మండలంలోని ఒక పాఠశాలలో ప్రైవేట్‌గా ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేసుకుని రెగ్యులర్ ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా కొడుతున్న సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలి సిందే. జిల్లాలో గల ఏకోపాధ్యాయ పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలో సుమారుగా వంద వర కు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నట్లు సమాచారం. మారు మూల ప్రాంతాల పాఠశాలలకు అధికారులు వెళ్లకపోవడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు సక్రమంగా నడవడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక తనిఖీల నిర్ణయాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నట్లు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహించ డం సహించరాని నేరమేనన్నారు.