Subsidized devices
-
సాగు.. ఇక బహుబాగు
గజ్వేల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఆరునెలలుగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట దొరికింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈమేరకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ వ్యవసాయరంగంలో యాంత్రికీకరణ కీలకంగా మారింది. ప్రతి ఏటా జిల్లాలో 6 లక్షల హెక్టార్లకుపైగా వివిధ పంటలు సాగవుతున్నాయి. పురాతన పద్ధతులకు క్రమంగా స్వస్తి పలుకుతున్న రైతులు, అధునాతన యంత్రాల వాడకంపై దృష్టి సారించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఈ విధానం అనివార్యమవుతోంది. దీంతో యాంత్రీకరణ పథకానికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తాజాగా కొన్నిరోజుల క్రితం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపిక ఎలా అంటే... కొత్తగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంత్రికీకరణ పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేయనున్నారు. ఈ కమిటీలో జేడీఏ, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్, ఆత్మ పీడీ, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీతో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నాబార్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో వ్యవసాయాధికారి, డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డ్వామా ఏపీఓ, ఎంపీడీఓ, తహశీల్దార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసి 50 శాతం సబ్సిడీపై పరికరాలను అందించనున్నారు. ఈసారి హార్వెస్టర్, రొటోవేటర్, శ్రీవరిసాగు యంత్రం, ట్రాక్టర్లు వంటి భారీ యంత్రాలను కూడా సబ్సిడీపై అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. రైతులు ఈ పథకానికి మీ-సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేస్తే మండల స్థాయి కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. సబ్సిడీపై పరికరాలు పొంది గతంలో ఇతరులకు అమ్ముకొని యాంత్రికీకరణను అభాసుపాలు చేసిన ఘటనల నేపథ్యంలో ఈ దుస్థితిని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం రికవరీ యాక్ట్ సైతం ప్రయోగించబోతోంది. -
కరెంటు సమస్యను అధిగమించిన నలుగురు రైతులు
షాబాద్: పంటల సాగులో కరెంటు పాత్ర ఎనలేనిది. ప్రస్తుత తరుణంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఆ నలుగురు రైతులకు మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు ప్రభుత్వం అందజేసే కరెంట్‌పై ఆధారపడి వ్యవసాయం చేయడంలేదు. సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ పంటలు పండిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వివరాలు.. షాబాద్ మండలం మన్‌మర్రికి చెందిన రైతులు భిక్షపతి, లక్ష్మయ్య, రాంచంద్రయ్య, యాదయ్య. వీరికి ప్రభుత్వం 2012లో ఇందిర జలప్రభ పథకం కింద సోలార్ పరికరాలను అందజేసింది. రూ.6 లక్షల విలువైన ఈ పరికరాలను ప్రభుత్వం వందశాతం రాయితీపై అంద జేసింది. దీంతో వారు అప్పటినుంచి సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ బోరుబావుల ద్వారా తలా రెండు ఎకరాల్లో పత్తి, వరి, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో 24 గంటలపాటూ కరెంట్ ఉత్పత్తి అవుతోంది. దీంతో వారు విద్యుత్ సమస్యను అధిగమించి పంటల సాగులో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా రైతులను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని మిగతా రైతులు సౌరశక్తిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోలార్ ద్వారా రానున్న వేసవిలో విద్యుత్ కోతలను అధిగమించవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీ విద్యుత్ కోతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. రైతులకు సబ్సిడీపై సోలార్ సిస్టమ్‌ను పంపిణీ చేస్తోంది. వాటర్‌షెడ్ పథకంతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీలను అందిస్తూ సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతల సమస్యకు సౌరశక్తితో చెక్ పెట్టవచ్చంటున్నారు. రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. మన్మర్రి గ్రామంలో సౌరశక్తిని ఉపయోగించే నలుగురు రైతులను చూసి మిగతావారు కూడా సోలార్ సిస్టమ్ కోసం వ్యవసాయ శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు.