breaking news
Sub-Registrar Srinivasa Rao
-
సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావుపై ఏసీబీ కేసు
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు - పలు కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు - మొత్తం ఆస్తుల విలువ రూ.150 కోట్ల పైనే.. సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్‌రావు ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం బోయిన్పల్లి, అల్వాల్‌లోని శ్రీనివాస్‌రావు నివాసాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌రావు ఆయన కుమారుడు కనిష్క పలు కంపెనీలు స్థాపించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. హాసిని పవర్ ప్రాజెక్ట్, జయశ్రీ ఎంటర్ప్రైజెస్, పద్మనాభ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు స్థాపించినట్టు ఏసీబీ తెలిపింది. అక్రమార్జనను 12 బ్యాంకు ఖాతాల ద్వారా జరిపినట్టు బయటపెట్టింది. హాసిని పవర్ ప్రాజెక్ట్‌లో రూ.1.90 కోట్లు, నార్త్ స్టార్ హోమ్స్ కంపెనీలో రూ.1.93 కోట్లు, మంజీరా హోల్డింగ్స్‌లో రూ.50 లక్షలు, ఐకాన్ కన్స్ట్రక్షన్లో రూ.8.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ తెలిపింది. శ్రీనివాస్‌రావు తన బినామీల పేరిట రూ.1.27 కోట్ల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు కూడబెట్టారు. అదే విధంగా మూసాపేట్లో రూ.11లక్షల విలువైన 11 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా శ్రీనివాస్‌రావు ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అభిప్రాయపడింది. భార్య మృతిచెందినా బ్యాంకు లావాదేవీలు శ్రీనివాస్రావుకే చెందిన అల్వాల్ సత్యసాయి కాలనీలోని ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సునీతరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. సునీత తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌రావు ఇంట్లో నుండి పలు బ్యాంక్‌లకు చెందిన పాస్ పుస్తకాలు, దస్తావేజులు, 17 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌రావు భార్య జయశ్రీ మృతి చెందినప్పటికి ఆమె పేరుమీద ఇప్పటికీ బ్యాంక్ లావాదేవీలు జరగడం విశేషం. శ్రీనివాస్‌రావు భార్య, కొడుకు, తోడల్లుడు పేర్ల మీద డొల్ల కంపెనీలు సృష్టించారని తెలుస్తోంది. సోదరుడి ఇంట్లోనూ సోదాలు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు సోదరుడి ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీహెచ్బి కాలనీలో ఉన్న శ్రీనివాసరావు రెండవ సోదరుడు నాగేందర్ నివాసంలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏసీబీ డీఎస్పీ, సీఐలతో పాటు పలువురు అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు. -
గోల్డ్‌స్టోన్ ప్రసాద్ మరో భూమాయ!
► హైదర్‌నగర్‌లో రూ.5 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ ► 2006లో అసైన్మెంట్ డీడ్‌కు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ పెండింగ్ ► 2013లో సేల్‌డీడ్ కింద పెండింగ్ డాక్యుమెంట్‌ను క్లియర్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సాక్షి, హైదరాబాద్: గోల్డ్‌స్టోన్ ప్రసాద్ చేసిన మరో భూమాయ వెలుగు చూసింది. తాజాగా రూ. ఐదు వేల కోట్ల భూ కుంభకోణం బయటపడింది. హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో రూ. 12 వేల కోట్ల విలువైన 800 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు దండు మైలారం శివారులోని సుమారు రూ. వందల కోట్ల విలువైన రెండు వేల ఎకరాల అటవీ భూములను కాజేసేందుకు కూడా ప్రసాద్ స్కెచ్ వేసిన సంగతి తెలిసిందే.రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌లో 196.20 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని 2013 లో ఎంచక్కా తన అనుయాయులకు చెందిన సూట్ కేసు కంపెనీలకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ధారా దత్తం చేశాడు. ఆ భూములను తనకు నచ్చిన వారికి కట్టబెట్టాడు. కొంత భూమిని ఇతరులకు కూడా దర్జాగా విక్రయించాడు. ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భారీ స్థాయిలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడినట్లు ప్రాథమికంగా తేలడంతో దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు కమిషనర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ రెండ్రోజులుగా కూకట్పల్లి ఎస్సార్వోలో రికార్డుల ను పరిశీలించి కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఆయన్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయ త్నించగా స్విచ్చాఫ్ అని వచ్చింది. ఏడేళ్లుగా పెండింగ్‌లో రిజిస్ట్రేషన్ హైదర్‌నగర్‌లోని సర్వే నంబరు 172లో 192 ఎకరాల ప్రభుత్వ భూమి వివాదం(సీఎస్ 14/1958 భూ వివాదం కేసు)లో నిజాం వారసులు, సైరస్, పైగా కుటుంబీకుల ద్వారా తనకు హక్కులు సంక్రమించాయని, తనకు సంక్రమించిన హక్కులను ట్రినిటీ, సువిశాల్ తదితర కంపెనీలకు బదలాయిస్తూ అసైన్మెంట్ రిజిస్టర్ చేయాలని 2006లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్ 4 దస్తావేజులను సమర్పించాడు. సదరు దస్తావేజులను పరిశీలించిన అప్పటి సబ్ రిజి స్ట్రార్ అసైన్మెంట్ డీడ్‌కు ఉండాల్సిన అర్హతలు లేవని, సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అసైన్మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్‌కు, సేల్‌డీడ్ రిజిస్ట్రేషన్‌కు మార్కెట్ వ్యాల్యూ, చెల్లించాల్సిన స్టాంప్‌డ్యూటీలో చాలా వ్యత్యాసం ఉండడంతో సదరు రిజిస్ట్రేషన్ల(సి 1,2,3,4/2006)ను పెండింగ్‌లో పెట్టారు. సేల్ డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసే పక్షంలో దాదాపు రూ.30 కోట్లదాకా స్టాంప్‌డ్యూటీ కింద ప్రభు త్వానికి చెల్లించాలి. ఈ విషయంలో ఉన్నతాధి కారులు కూడా సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్‌గా తనకు అనుకూలమైన వ్యక్తి (రాచకొండ శ్రీనివాస రావు) రావడంతో సదరు రిజిస్ట్రేషన్‌ను సేల్ డీడ్గానే చేయించుకున్నాడు. కేవలం 30.60 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ఫలితంగా సర్కారుకు సుమారు రూ. 29 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 4 దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్ అసైన్మెంట్ డీడ్లుగా ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న 4 దస్తావేజులను సేల్డీడ్లుగా రిజిస్ట్రేషన్ చేసిన కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఆ దస్తావేజుల్లో 53 చోట్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌కు తాజాగా ఫిర్యాదు అందింది. -
భూ కుంభకోణం ఎఫెక్ట్: సబ్ రిజిస్ట్రార్ల బదిలీ
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో 29 మంది సబ్ రిజిస్ట్రార్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు ఇటీవల వెలుగుచూసింది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం. ఈ కేసులో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రియల్ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పీవీఎస్ శర్మ, పీఎస్ పార్థసారథిలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సబ్ రిజిస్ట్రార్ల ప్రస్తుత స్థానాలు, బదిలీ స్థానాల వివరాలివి.. -
భూదందాలో బడా బాబులు!
రూ.10 వేల కోట్ల భూముల కుంభకోణం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మియాపూర్‌లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజి స్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్న ఈ అక్రమార్కులు.. తమ బాగోతం బయటపడకుండా మరిన్ని అవకతవకలకూ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పాత్రధారులతో పాటు తెర వెనుక సూత్రధారులను పట్టుకొనేందుకు వేట ప్రారం భించారు. ఈ వ్యవహారంలో ఎకరానికి రూ.కోటి వరకు చేతులు మారినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగంగా సాగేందుకు ప్రభుత్వం ఈ భూదందా కేసు ను సోమవారం సీఐడీ విచారణకు అప్పగించింది. కాగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన నాలుగు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చల్లగా కాజేశారు.. శేరిలింగంపల్లి మండలం మియాపూర్, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరం ధర సుమారు రూ.14.5 కోట్ల పైనే ఉంటుంది. దీంతో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన పలువురు రాజకీ య నాయకులు, బడా రియల్టర్లు ఆ భూములపై కన్నే శారు. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో కుమ్మక్కై 693.04 ఎకరాలను కాజేసేందుకు వ్యూహం పన్నారు. ‘ఎక్క డైనా భూముల రిజిస్ట్రేషన్ (ఎనీవేర్ రిజిస్ట్రేషన్)’ వెసులుబాటును తమకు అనుకూలంగా మల్చు కున్నారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని దీనికి వేదికగా చేసుకున్నారు. 2016 జనవరి 15న అమీరున్నీసా బేగంతో పాటు మరికొందరు ఆ భూములపై తమకు హక్కులు ఉన్నాయని.. వాటిని ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు దాఖలు పరుస్తున్నామని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై ఎలాంటి సందేహాలూ వ్యక్తం చేయకుండానే.. సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, నంబర్ 20లో 109.18 ఎకరాలు, నంబర్ 28లో 145.26 ఎకరాలు, నంబర్ 100లో 207 ఎకరాలు మొత్తంగా 693.04 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు అసలు ఈ భూములకు ఎలాంటి మార్కెట్ విలువ లేదంటూ రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించేశారు. ఈ కొనుగోలు వ్యవహారంలో సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ తరఫున మేనేజర్ పీవీఎస్ శర్మ రిజిస్ట్రేషన్‌కు హాజరైనట్లు తెలిసింది. మరిన్ని అవకతవకలు కూడా.. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు బాగోతం బయటపడ కుండా మరిన్ని అవకతవకలకూ పాల్పడ్డారు. వాస్తవానికి ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను బుక్–1లో నమోదు చేయాల్సి ఉండగా.. ఈ భూముల రిజిస్ట్రేషన్లను చరాస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన బుక్–4లో నమోదు చేశారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే రూ.587 కోట్ల వరకు స్టాంపు డ్యూటీగా వసూలు చేయాల్సి ఉండేది. అది కూడా లేకుండా చేశారు. కేసు సీఐడీకి అప్పగింత వేల కోట్ల భూముల కుంభకోణం కావడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఈ కేసులో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రియల్ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పీవీఎస్ శర్మ, పీఎస్ పార్థసారథిలను అరెస్టు చేశామని చెప్పారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న రియల్ఎస్టేట్ సంస్థల బాధ్యులను పట్టుకునేందుకు ముగ్గురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని వెల్లడించారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ప్రచారమవుతున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు సంబంధించి సాక్ష్యాధారాలేవీ ఇప్పటివరకు దొరకలేదని తెలిపారు. సూత్రధారుల కోసం వేట భూముల కుంభకోణంలో పాత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు.. సూత్రధారుల కోసం వేట ప్రారం భించారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కొంత మంది రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉందన్న సమాచారం మేరకు ఆ దిశగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కోసం గాలింపు ముమ్మ రం చేశారు. ప్రత్యేక బృందాలు ముంబై, బెంగళూరు లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో శర్మ, పార్థసారథిల సోదరుడు కూడా కీలకపాత్ర పోషించినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకుంటే చిక్కుముడి వీడి.. బాగోతం వెనుక ఉన్న పెద్దల వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కాగా పోలీసు అరెస్టు చేసిన ముగ్గురిని మియాపూర్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. గోల్డ్‌స్టోన్ సంస్థ పాత్రపై సందేహాలు ఈ కుంభకోణంలో భాగస్వామి అయిన పార్థసారథి గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ సంస్థలో డైరెక్టర్‌గా ఉండడంతో ఆ సంస్థ పాత్రపైనా సందేహాలు వస్తున్నాయి. మియాపూర్ పరిధిలో గోల్డ్‌స్టోన్ సంస్థకు మంచి పట్టు ఉంది. 172, 77, 78 సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే పలు సర్వే నంబర్లలోని భూముల విషయంలో గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులకు, గోల్డ్‌స్టోన్ సంస్థకు మధ్య భూ వివాదాలు ఉండడం గమనార్హం. కాలనీలు, రోడ్లు ఉన్నా కూడా.. శేరిలింగంపల్లి మండలం మియాపూర్‌లోని సర్వే నంబర్లు 20, 28, 100, 101లలో మొత్తంగా 1,187.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబర్ 20లో మొత్తం 252 ఎకరాలు ఉండగా.. హుడాకు 109.18 ఎకరాలు కేటాయించారు, మిగతా 142.22 ఎకరాల్లో ఇళ్లు, రహదారులు తదితరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇదే సర్వే నంబర్లోని109.18 ఎకరాలను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక సర్వే నంబర్ 28లో మొత్తం 384.15 ఎకరాలుండగా... హుడాకు 140.38 ఎకరాలు, మెట్రోరైల్‌కు 104 ఎకరాలు కేటాయించగా, మరో 100 ఎకరాల్లో హుడా లేఅవుట్ చేశారు. మిగతా సుమారు 39.17 ఎకరాల్లో కాలనీలు, రోడ్లు ఉన్నట్లు రికార్డులు తెలియ జేస్తున్నాయి. ఈ సర్వే నంబర్లో 145 ఎకరాలను గంపగుత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక సర్వే నంబర్లు 100, 101లో 550.39 ఎకరాలుండగా... ఏకంగా 438 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమిలోనూ పలు కాలనీలతో పాటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. తొలి నుంచీ అవినీతిమయమే! కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్‌రావు తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో టీఎన్జీవోల భూములకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురైనట్లు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ స్థానం నుంచి మూడుసార్లు బదిలీ అయినా.. తనకున్న పలుకుబడి, రాజకీయ నేతల అండదండలతో ఐదేళ్లుగా అక్కడే కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు వివాదాస్పద భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో చాలా వరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో కూకట్పల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరగడం శ్రీనివాస్‌రావు పాత్రపై మరిన్ని సందేహాలు రేకిత్తిస్తోంది. అదంతా హెచ్ఎండీఏ స్థలమే: కమిషనర్ చిరంజీవులు మియాపూర్‌లోని 100, 101, 20, 28 సర్వే నంబర్లలో ఉన్న 693.04 ఎకరాల భూమి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దేనని కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేసిన అంశాన్ని తీవ్రంగా తీసుకున్న చిరంజీవులు.. దీనిపై జిల్లా కలెక్టర్‌తో చర్చించి క్రిమినల్ కేసు నమోదుచేయాలని నిర్ణయించారు. ఆ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి మియాపూర్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూములు ప్రభుత్వానివేనని.. అవి ప్రస్తుతం హుడా, మెట్రోరైల్, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని శేరిలింగంపల్లి తహసీల్దార్ తిరుపతిరావు తెలిపారు. సర్వే నంబర్లు 20, 28, 100, 101లలో ఉన్న ఈ భూములు ప్రభుత్వ భూములని స్పష్టం చేస్తూ 2007లోనే రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశామని.. అయినా ఆ భూములను రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు.