breaking news
stoned to death
-
పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి..
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో కత్వా జిల్లాలోని మారుమూల గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక పోలీస్ అధికారిని రాళ్లతో కొట్టి అమానుషంగా చంపారు. ఫింటర్ చౌక్ వద్ద శనివారం రాత్రి విధులు నిర్వహించిన హేమంత్ కుమార్‌తో నిందితులు గొడవ పడ్డారు. ఇద్దరూ రాళ్లు తీసుకుని దాడి చేయడంతో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తంమడుగులో పడివున్న హేమంత్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. నిందితులను నరేశ్ భద్వాల్, మన్వీర్ లలోత్రాగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై హత్యకేసు నమోదు చేశామని, ఓ నిందితుడిని అరెస్ట్ చేశామని, మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
ప్రియుడితో కలిసిందని కొట్టి చంపారు
కాబుల్: వేరొకరితో వివాహం నిశ్చయమై కూడా ప్రియుడితో కలిసి ఉందన్న ఆరోపణలతో ఓ యువతిని దారుణంగా చంపేశారు. షరియత్ చట్టాలను ఆటవికంగా అమలుచేసే అఫ్ఘానిస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో సంచలనం రేపుతున్నది. తాలిబన్ల దురాగతాలను మరోసారి ప్రపంచం ముందుంచింది. సెంట్రల్ అఫ్ఘాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌లో ఫిరోజ్కోహ్ అనే కొండప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది రొక్సానా. 20 ఏళ్ల ఆ యువతికి రెండు నెలల కిందటే నిఖా పక్కా అయింది. అయితే అప్పటికే, అదే ఊరికి చెందిన మరో యువకిడితో రొక్సానా ప్రేమలో ఉంది. పెళ్లితో విడిపోనున్న ఆ జంట.. చివరిసారిగా ఒక దగ్గర కలుసుకున్నారు. కాస్త దగ్గరయ్యారు. ఈ విషయం ఆనోటా ఈనోటా ఊరంతా తెలిసిపోయింది. దీంతో వరుడి తరఫు కుటుంబం, రొక్సానాతో పెళ్లిని రద్దు చేసుకుంది. ఆ తర్వాత తాలిబన్ల నాయకులు రంగంలోకి దిగారు.. రొక్సానాను, ఆమె ప్రియుడిని దోషులుగా తేల్చారు. వ్యభిచారానికి పాల్పడిందన్న అభియోగంపై రొక్సానాను.. నాలుగడుగుల గుంటలో నిల్చోబెట్టి, అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఒక్కో దెబ్బకు ఆమె పెట్టిన కేకలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి. కాగా, రొక్సానా ప్రియుడిని కొరడాతో కొట్టి వదిలేశారు! అక్టోబర్ 25న జరిగినట్లు భావిస్తున్న ఈ సంఘటనపై ఘోర్ గవర్నర్ సీమా జోయెదా స్పందించారు. (అఫ్ఘానిస్థాన్ లో ఉన్న ఇద్దరు మహిళా గవర్నర్లలో జొయెదా ఒకరు) హత్యకు గురైన మహిళ రొక్సానాయే అని జోయెదా స్పష్టం చేశారు. రాళ్లతో కొట్టి చంపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. 'ఈ ఏడాదిలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే మొదటిసారి. సమాచారం తెలిసిన వెంటనే కాబుల్‌కు ఫోన్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడాను. రొక్సానా హత్యతో సంబంధం ఉన్నవారిని చట్టపరంగా శిక్షించాలని కోరాను' అని జోయెదా చెప్పారు. గత సెప్టెంబర్‌లో ఖురాన్‌ను కాల్చేసిందన్న ఆరోపణలపై తాలిబన్లు.. ఫర్కుందా అనే 27 ఏళ్ల మహిళను కొరడాతో కొట్టిచంపారు. తర్వాత ఆమె నిర్దోశి అని తేలడంతో మహిళా లోకం భగ్గుమంది. వందలాది మహిళలు ఫర్కుందా అంతిమయాత్రలో పాల్గొని నిరసనలు తెలపడం తెలిసిందే.