breaking news
STCC
-
ఈ మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మూసివేస్తున్నారా!? కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే?
దుబాయ్: ప్రభుత్వ రంగ ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును కేంద్రం అధ్యయనం చేస్తోందని, దేశ ప్రయోజనాల రీత్యా తగు చర్యలు తీసుకుంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. వీటిని మూసివేసే యోచనేదైనా ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మేము అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. దేశ ప్రయోజనాల రీత్యా తగు నిర్ణయం తీసుకుంటాం. అరుదైన వనరులను వృధా చేయకూడదు‘ అని పేర్కొన్నారు. తూర్పు యూరోపియన్ దేశాలతో వాణిజ్య నిర్వహణ కోసం 19056లో ప్రభుత్వ ట్రేడింగ్ విభాగంగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ) ఏర్పాటైంది. రైల్వే, ఇంజినీరింగ్ పరికరాల ఎగుమతులకు సంబంధించి ఎస్టీసీ అనుబంధ సంస్థగా 1971లో ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ (పీఈసీ)ను నెలకొల్పారు. ఇది 1997లో స్వతంత్ర సంస్థగా మారింది. మరోవైపు, ఎస్టీసీ నుండి విడగొట్టి స్వతంత్ర సంస్థగా మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ని 1963లో ఏర్పాటు చేశారు. లోహాలు, ముడి ఖనిజాల ఎగుమతులు, ఫెర్రస్యేతర లోహాల దిగుమతుల కోసం దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఈ మూడు కంపెనీలు వాణిజ్య శాఖ నియంత్రణలో ఉన్నాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల వల్ల కొన్ని దేశాల్లో ఆహార ధాన్యాలపరమైన సమస్యలు తలెత్తవచ్చని మంత్రి చెప్పారు. అలాంటి పరిస్థితి తలెత్తితే ఆయా దేశాలకు మానవతా దృక్పథంతో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాలు గోధుమలు అత్యధికంగా ఉత్పత్తి, ఎగుమతి చేస్తున్నాయి. -
కేన్సర్ వ్యాప్తి నిరోధానికి కొత్త మార్గం?
కేన్సర్ కణాల్లో కొన్నింటికి ఓ అనూహ్యమైన లక్షణముంటుంది. చుట్టూ ఉన్న కేన్సర్ కణాలను అవి తినేస్తూంటాయి. ఈ ప్రక్రియను ఎన్టోసిస్ అంటారు. వందేళ్లుగా అందరికీ తెలిసిన ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని కేన్సర్ కణతుల పెరుగుదలను నిరోధించేందుకు కేంబ్రిడ్జ్లోని బబ్రహాం ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఎన్టోసిస్కు కణ విభజన ప్రక్రియ ఒక ప్రేరకంగా పని చేస్తోందని.. కణాలు అడ్డూ అదుపు లేకుండా విడిపోతూ ఉండటాన్ని కేన్సర్ అంటారు కాబట్టి.. ఈ రెండింటి మధ్య సంబంధంపై మానవ ఎపిథీలియల్ కణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. సాధారణంగా ఈ కణాలు విడిపోయేటప్పుడు కూడా తమ పరిసరాలకు గట్టగా అతుక్కునే ఉంటాయి. ఒకవేళ ఇలా అతుక్కునే లక్షణం తక్కువగా ఉన్నప్పుడు ఎన్టోసిస్ లక్షణాలు అలవడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కేన్సర్ కణాల్లోనూ ఇలాంటి లక్షణాన్ని పుట్టించగలిగితే కేన్సర్ నెమ్మదించేలా లేదా నిరోధించేలా చేయవచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఓలివర్ ఫ్లోరే అంటున్నారు. ఎన్టోసిస్ను మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా కేన్సర్తోపాటు ఇతర వ్యాధులకు మెరుగైన చికిత్స లభిస్తుందని అంచనా.