breaking news
Special Discount
-
తెలంగాణ.. పెట్టుబడులకు స్వర్గధామం
♦ 8 నెలల్లో రూ.29,905 కోట్ల పెట్టుబడులు ♦ పెట్టుబడులతో వచ్చే వారికి ప్రత్యేక రాయితీలు ♦ తెలంగాణ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పెట్టుబడులతో తరలివచ్చే వారికి తెలంగాణ స్వర్గధామమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మేకిన్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా గురువారం ముంబైలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్వెస్టర్ల సదస్సు’లో జూపల్లి మాట్లాడారు. 450కిపైగా జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకున్న సానుకూలతలను వివరించారు. నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) ఆవిష్కరించిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్రానికి రూ.29,905 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 356 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశామన్నారు. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా 90,324 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న మేకిన్ ఇండియా కోవలోనే రాష్ట్రం కూడా ఐపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు. పెట్టుబడులకు భౌగోళిక తెలంగాణ అత్యంత అనుకూల ప్రాంతంగా పేర్కొంటూ.. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ లా యూనివర్సిటీతో పాటు అనేక ప్రతిష్టాత్మక వర్సిటీలున్నాయని జూపల్లి వెల్లడించారు. పెట్టుబడులతో వచ్చే వారిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన టీ-ఐడియా ద్వారా అనేక రాయితీలు ఇస్తున్నామన్నారు. నిరంతర విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు 10 శాతం నీరు, పరిశ్రమల స్థాపనకు 1.45 లక్షల ఎకరాలతో భూ బ్యాంకు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు తదితరాల రూపంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జూపల్లి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలు, సౌర విద్యుత్ విధానం, ముచ్చర్ల ఫార్మాసిటీ, స్పైసెస్ పార్కు తదితరాలపై పరిశ్రమల ప్రతినిధులు సందేహాలను లేవనెత్తగా జూపల్లితో పాటు, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ నివృత్తి చేశారు. సమావేశంలో సీసీఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ వనితా దాట్ల, ఫ్టాప్సీ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం, ఐటీ రంగ ప్రతినిధి, శ్రీనివాస్ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు. అనంతరం మేకిన్ ఇండియాలో భాగంగా వివిధ రాష్ట్రాలు, పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను జూపల్లి సందర్శించారు. -
ట్రూజెట్ ప్రత్యేక డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్థానిక విమానయాన సంస్థ ట్రూ జెట్ ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. ట్రూ జెట్‌లో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్, విద్యార్థులు, మీడియా సంస్థల ప్రతినిధులు, దక్షిణ భారత ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, మూవీ ఆర్టిస్ట్స్అసోసియేషన్ సభ్యులకు 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ట్రూ జెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. టాలీవుడ్ నటుడు రాంచరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ట్రూ జెట్ 4 నెలల క్రితం విమాన సర్వీసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల నుంచి సర్వీసులను విజయవంతంగా నడుపుతున్నామని, ఆ ప్రత్యేక ఆఫర్లతో మరింత మంది ప్రయాణీకులను ఆకర్షించగలమన్న ధీమాను టర్బో మెఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ వ్యక్తం చేశారు. -
ప్రేమతో.. ఎయిర్కోస్టా ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్కోస్టా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీని ప్రకటించింది. బుధవారం (ఫిబ్రవరి 11వ తేదీ.. రాత్రి 12 గంటలు) నుంచి శనివారం (ఫిబ్రవరి 14వ తేదీ.. రాత్రి 12 గంటలు) వరకు కొన్న ప్రతి టెకెట్ పైనా రూ.599 రాయితీని ఇస్తున్నట్లు ఎయిర్కోస్టా సీఈఓ కెప్టెన్ కేఎన్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టికెట్లపై మంగళవారం (ఫిబ్రవరి 17వ తేదీ) నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.