breaking news
Sonia Gandhi Statue
-
గిదేందే శంకరన్న ....
అధిష్టానానికి వీర విధేయుడిగా పేరుగాంచిన శంకర్రావు అలియాస్ శంకరన్నకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. తనతో పాటు తన కుమార్తె సుస్మితకు టికెట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టిఆర్ఎస్ నుండి వచ్చిన వివేక్, వినోద్లకు టికెట్టు ఇచ్చి, శంకర్రావును దూరం పెట్టి చెయ్యి మార్కు చూపించి షాక్ ఇచ్చింది. దాంతో ఆరుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తనకు టికెట్ నిరాకరించడంపై గుస్సాగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణను రూపొందించుకోవటంలో బిజీగా ఉన్నారు. ఇక తమకు గిట్టనివాళ్లపై కేసులు పెట్టించటాని కాంగ్రెస్ అధిష్టానం శంకర్రావును ఆటలో అరటిపండుగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధిష్టానం అనుగ్రహంతో మంత్రి పదవి అలంకరించిన శంకర్రావు తననోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో ఆయన్ని పార్టీ పదవి నుంచి పీకేసి పక్కన కూర్చోపెట్టింది. దాంతో సోనియమ్మ భజన చేయటమే కాకుండా శంక్రరావు అవకాశం ఉన్నప్పుడల్లా తన విధేయతను చాటుకునేవారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టించేశారు. అంతేనా... సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు ప్రతిపాదన కూడా తెచ్చారు. అయితే శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదోమో అనిపిస్తోంది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు వినయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. దాంతో గదేందే శంకరన్న సీన్ రివర్స్ అయ్యిందని చెవులు గుసగుసలాడుకుంటున్నారు. -
కిరణ్ కంటే నేనే బెటర్: శంకర్రావు
సికింద్రాబాద్: తెలంగాణవాసుల ఎన్నోయేళ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి గుడి నిర్మిస్తానని..ఇందుకు ప్రభుత్వం స్థలం కేటాయించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విజ్ఞప్తి చేశారు. మారేడుపల్లి డివిజన్ పరిధిలో రెండెకరాల ప్రభుత్వభూమిని కేటాయిం చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ త్వరలో లేఖ రాస్తానని ప్రకటించారు. గురువారం బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్‌కవర్ సీఎం అని,ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు లేదని ఎద్దేవాచేశారు. అర్హత ప్రాతిపదికన చూస్తే కిరణ్ కంటే తనకే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అధిష్టానం దయవల్ల ముఖ్యమంత్రి అయిన కిరణ్..అదే అధిష్టానాన్ని తిట్టడం ఆయన మూర్ఖత్వమన్నారు. నెహ్రూ-ఇందిర కుటుంబం తమ జీవితాల్ని దేశానికి అంకితం చేశాయన్నారు. సోనియాను విమర్శించడం సీమాంధ్ర నేతలకు అలవాటుగా మారిందని, వారికి తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు.