''ఎక్కడో తప్పు జరిగింది''..!
న్యూఢిల్లీః కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ ఉడీ ఉగ్రదాడిపై స్పందించారు. బుధవారం జరిగిన ప్రత్యేక ప్రశ్నలు సమాధానాల కార్యక్రమంలో ఉడీ ఘటనపై సంధించిన ప్రశ్నకు ఆయన.. ఈ దశలో మొత్తం సమాచారాన్ని బటయ పెట్టలేమన్నారు. అయితే ఎక్కడో తప్పు జరిగిందని ఒప్పుకున్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఉరి ఘటనపై పారికర్ ను ప్రశ్నించగా ఎక్కడో తప్పుజరిగిందన్నారు. నేను చర్చల కంటే విషయాన్ని అమలు పరచడానికే ఇష్టపడతానని, ఇటువంటి తప్పు మరోసారి జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని పారికర్ పేర్కొన్నారు. మేం ఎక్కడా లోపం జరగదన్న నమ్మకంతో ఉన్నామని, ఉడీ ఘటన ఎంతో సున్నితమైన విషయమని రక్షణమంత్రి చెప్పుకొచ్చారు.
ఉడీ దాడి కారకులను దండించి తీరుతామన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన కేవలం ప్రకటమాత్రమే కాదని, దాని అమలు విషయంలో సీరియస్ గా ఉన్నట్లు పారికర్ తెలిపారు. నలుగరు జెయిషే మొహమ్మద్ త్రీవ్రవాదులు ఆదివారం సైనిక స్థావరంపై దాడికి దిగి 18 మంది సైనికుల మృతికి కారణమయ్యారని, ఈ కొత్త దాడి భారత్ పాకిస్థాన్ మధ్య సంబంధాలను మరింత పలుచబడేలా చేసిందని రక్షణమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పులు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని పారికర్ హామీ ఇచ్చారు.