breaking news
siddhantha
-
కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు .. వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల నుంచి ఎంత దొరికితే అంత అన్నట్లుగా రుణాలు సమీకరించాయి. అత్యంత తక్కువగా రూ. 1 లక్ష నుంచి అనేక కోట్ల దాకా తీసుకున్నాయి. స్టాక్ ఎక్సే్చంజీలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్ ద్వారా ఈ వివరాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టయిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రుణభారం 2019 మార్చి 31 నాటికి రూ. 5,251 కోట్లుగా ఉంది. ఇది గతేడాది మార్చి ఆఖరున ఉన్న రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఇక సీడీఈఎల్ ప్రమోటర్ కంపెనీలు దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ మొదలైనవి కూడా పలు దఫాలుగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. సోమవారం అదృశ్యమైన సిద్ధార్థ.. బుధవారం నేత్రావతి నదిలో శవంగా తేలిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యం కావడానికి ముందు ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలోని అంశాలు సిద్ధార్థ ఆర్థిక సమస్యల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ఆయన సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్‌లోని విషయాలు బైటికి వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ► టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ (గతంలో జీఈ మనీ ఫైనాన్స్ సర్వీసెస్), షాపూర్జీ పల్లోంజీ ఫైనాన్స్ (ఎస్పీఎఫ్) వంటి సంస్థల నుంచి కూడా సిద్ధార్థ రుణాలు తీసుకున్నారు. ఇందులో టాంగ్లిన్ డెవలప్మెంట్స్ అనే అనుబంధ సంస్థకు ఎస్పీఎఫ్ రూ. 12 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు 2018 ఏప్రిల్‌లో ఎంసీఏకు సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ► ఇక మరో ఫైలింగ్‌లో కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు ‘రూ. లక్ష దాకా టర్మ్ రుణ సదుపాయం కల్పించేందుకు‘ క్లిక్స్ క్యాపిటల్ అంగీకరించిన డీల్ గురించిన ప్రస్తావన ఉంది. ► సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీలు (ఆతిథ్య, రియల్టీ రంగాలవి) ఎంత మేర రుణాలు తీసుకున్నాయన్నది ఇంకా ఇథమిథ్థంగా తెలియనప్పటికీ.. వీటి అప్పుల భారం కూడా సీడీఈఎల్ స్థాయిలోనే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017 తర్వాత సిద్ధార్థ రుణాల పరిమాణం గణనీయంగా పెరిగింది. అయితే, గడువులోగా వీటిలో ఎన్ని రుణాలను చెల్లించారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొండిబాకీలుగా మారా యన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది. ► ఎంసీఏ డేటా ప్రకారం 2018 మార్చి ఆఖరు నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ స్వల్పకాలిక రుణాలు, తక్షణం జరపాల్సిన చెల్లింపుల పరిమాణం రూ. 36.53 కోట్లుగా ఉన్నాయి. ► వీజీ సిద్ధార్థ, సీడీఈఎల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు తమ వద్ద ఉన్న షేర్లలో మూడొంతుల షేర్లను తనఖా పెట్టాయి. ఇటీవలే రెణ్నెల్ల క్రితం జూన్‌లో కూడా సిద్ధార్థ కొన్ని షేర్లను అదనంగా తనఖా పెట్టారు. జూన్ ఆఖరు నాటికి సీడీఈఎల్‌లో సిద్ధార్థకు 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డేకు 4.05 శాతం, నాలుగు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 17 శాతం మేర వాటాలు ఉండేవి. ► ప్రమోటింగ్ సంస్థలు తమ మొత్తం హోల్డింగ్‌లో 75.7 శాతం (సుమారు 8.62 కోట్ల షేర్లు) తనఖాలో ఉంచాయి. జూన్ ఆఖర్లో కూడా సిద్ధార్థ కొత్తగా మరో 1.39 శాతం (29.2 లక్షల షేర్లు) తనఖా పెట్టారు. గ్రూప్ కంపెనీలు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా వీటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరిట తనఖా పెట్టారు. ► ఇక సీడీఈఎల్‌లో సివన్ సెక్యూరిటీస్‌కి ఉన్న మొత్తం వాటాలు (0.21 శాతం) వాటాలు తనఖాలోనే ఉన్నాయి. అటు సీడీఈఎల్‌లో కాఫీ డే కన్సాలిడేషన్స్‌కు ఉన్న 5.81 శాతం వాటాల్లో 95.96 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. ► దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్ వాటాల్లో 83.07 శాతం, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్ వాటాల్లో 78.9 శాతం వాటాలు తనఖాలో ఉన్నాయి. పార్లమెంటులోనూ సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన.. దివాలా స్మృతి (ఐబీసీ)పై చర్చ సందర్భంగా పార్లమెంటులో కూడా సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన వచ్చింది. వ్యాపార వైఫల్యాలనేవి జరగరానివేమీ కాదని, వ్యాపారవేత్త విఫలమైనంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపారం సజావుగా సాగని పక్షంలో వ్యాపారవేత్తలు గౌరవప్రదంగా తప్పుకునేందుకు తగు పరిష్కారమార్గం చూపడమే ఐబీసీ ఉద్దేశమని వివరించారు. అటు.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ విషాదాంతాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారపరమైన వైఫల్యాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని వైసీపీ ఎంపీ ఎం శ్రీనివాసులు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. వ్యాపారాలు నడపడంలో కష్టాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. వ్యాపారసంస్థల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే సంస్థలను, తప్పుడు విధానాలు పాటించే సంస్థలను ప్రభుత్వం ఒకే రీతిగా చూస్తోందంటూ ‘గుర్రాలు, గాడిదలను ఒకే గాటన కట్టేయడం సరికాదు’ అని శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పూచీకత్తు కారణంగా ఒక పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవాల్సిన తీవ్ర పరిస్థితులు తలెత్తడం సరికాదని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. -
సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం
వైఖానస దివ్య సిద్దాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో వక్తలు మండపేట : గ్రామ స్థాయి నుంచి సనాతన ధర్మపరిరక్షణకు తిరుమల వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ కృషి చేస్తోందని వైఖానస పండితులు పేర్కొన్నారు. మండపేట వేదికగా వైఖానస నామకరణ శతాబ్ది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీదేవి, భూదేవి సమేత జనార్దనస్వామి ఆలయం, సీతారామ కల్యాణ మండపంలో ఉదయం 8.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ ఉత్సవాలకు రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వైఖానస పండితులు తరలివచ్చారు. సీతారామ కల్యాణ మండపంలో వైఖానస వివర్థని సభ ప్రధాన కార్యదర్శి దివి శ్రీనివాసదీక్షితులు మాట్లాడుతూ పూర్వీకులు అందించిన వేద విద్యను భావితరాలకు అందించేందుకు తిరుమలలోని వైఖానస వివర్థని సభ పాటుపడుతోందన్నారు. వందేళ్ల క్రితం మండపేట వేదికగా వివర్థని సభకు నామకరణం జరిగిందని, ఇది జాతీయ స్థాయికి విస్తరించిందన్నారు. వైఖానస ఆగమం తదితర అంశాలపై ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎస్ నారాయణదీక్షితులు, డాక్టర్ సీతారామ భార్గవ, వేదాంతం రామకృష్ణమాచార్యులు, ఎన్. వేణుగోపాల్ వివరించారు. ఆగమాన్ని డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా యధాతధంగా భవిష్యత్తు తరాలకు అందించడం, ప్రాంతీయ వైఖానస సంఘాలు ఏర్పాటుచేసేందుకు శాఖీయులు ఐక్యతతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ నాయకులు వి. సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సనాతన సంప్రదాయాల పరిరక్షణలో వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శతాబ్ది సమావేశం అనంతరం వైఖానస పండితులకు ధర్మ ప్రతిష్టాన్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఆకట్టుకున్న శోభాయాత్ర వైఖానస దివ్య సిద్ధాన్త వివర్ధనీ సభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కపిలేశ్వరపురం వైఖానస సంఘం ఆధ్వర్యంలో జనార్దనస్వామి ఆలయంలో సుదర్శన మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. వేదపండితులు బిక్కవోలు కేశవాచార్యులు ఆధ్వర్యంలో హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. తిరుచ్చి వాహనంపై విఖనస మహర్షిని ప్రతిష్ఠించి మంగళవాయిద్యాలు, కోలాటం, గరగనృత్యాలు, వేదమంత్రాలతో పట్టణంలో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కేవీఎస్ఆర్ఎన్ ఆచార్యులు, సంఘ నాయకులు ఖండవిల్లి రాధాకృష్ణమాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌కుమార్, నారాయణ దీక్షితులు, పెద్దింటి రాంబాబు, ఎస్వీ రామశర్మ, అంగర సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.