breaking news
sea line
-
తీర ప్రాంతంలో విషాదం.. 34 మంది జలసమాధి
ఆంటనానారివో(మడగాస్కర్): బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి అయ్యారు. శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మడగాస్కర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ అధీనంలోని మయోటే ద్వీపానికి చేరుకునేందుకు మడగాస్కర్ దేశంలోని అంబిలోబే, టమతమే, మజుంగా ప్రాంతాలకు చెందిన 58 మంది శరణార్థులు ఒక పడవలో బయల్దేరారు. మార్గమధ్యంలో నోసీ బే అనే ద్వీపం సమీపంలో హిందూ సముద్రజలాల్లో పడవ మునిగింది. ఈ ప్రమాదంలో నీట మునిగిన 34 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. 24 మందిని అక్కడి మత్స్యకారులు కాపాడారు. మయోటే అనేది పేదరికం కనిపించే చిన్న ద్వీపాల సముదాయం. అంతకుమించిన నిరుపేదరికంతో మగ్గిపోతున్న మడగాస్కర్‌లో కంటే మయోటేలో జీవనం కాస్త మెరుగ్గా ఉంటుందని శరణార్థులు అక్కడికి వలసపోతుంటారని అధికారులు చెప్పారు. -
తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ..
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా): 2008లో ముంబైలో జరిగిన ఘటన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరప్రాంత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలోని కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ కేంద్రంలో బుధవారం సాయంత్రం శిక్షణ పూర్తి చేసుకున్న 22వ బ్యాచ్ సెక్యూరిటీ గార్డుల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐజీ సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రసంగించారు. ముంబైపై దాడి అనంతరం ఓడరేవుల భద్రతపై శ్రద్ధ పెరిగిందన్నారు. చొరబాటుదారులు, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెంచామన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించే విషయంలో కృష్ణపట్నం పోర్టు ప్రథమస్థానంలో ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. పోర్టు విజ్ఞప్తి మేరకు కృష్ణపట్నం పోలీసుస్టేషన్‌కు ఆయుధాలు సమకూరుస్తామని ఐజీ సంజయ్ చెప్పారు. ఈ అంశంపై సీఎంతో చర్చిస్తున్నామన్నారు. దీని వల్ల పోర్టులో ఇతర దేశాల నుంచి వచ్చే నౌకలకు సాయుధ బలగాల భద్రత ఉంటుందన్నారు. సెక్యూరిటీ కేంద్రం ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేఎస్‌ఎస్‌పీఎల్‌లో యువత ఉపాధి కోసం కొత్త కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణలో ప్రతిభ కనబరచిన గార్డులకు జ్ఞాపికలు అందజేశారు. ఆల్‌రౌండర్‌గా నిలిచిన కే.రమేష్‌కు ఐజీ చేతుల మీదుగా షీల్డ్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.