breaking news
Savitri Movie
-
మంచి కథ లభిస్తే బాలకృష్ణతో నటిస్తా
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను సావిత్రి చిత్ర కథానాయకుడు నారా రోహిత్ విజయవాడ : మంచి కథ లభిస్తే నందమూరి బాలకృష్ణతో కలిసి నటిస్తానని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తాను నటించిన ‘సావిత్రి’ చిత్రం విడుదలైన సందర్భంగా ఆ చిత్రం ప్రదర్శిస్తున్న ఊర్వశి ఐనాక్స్ థియేటర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ప్రేక్షకుల మధ్య కూర్చున్ని చిత్రాన్ని తిలకించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సావిత్రి పూర్తి కుటుంబ కథాచిత్రమన్నారు. తానెప్పుటికీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానన్నారు. సినిమా పైరసీని ప్రోత్సహించవద్దని ప్రేక్షకులను కోరారు. చిత్ర నిర్మాత డాక్టర్ వీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘సావిత్రి’ పూర్తి ఎమోషనల్, కామెడీ చిత్రమన్నారు. సంక్రాంతికే రావాల్సిన ‘సావిత్రి’ ఉగాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ విజయవాడ తన సొంత ఊరని, ఇక్కడే ప్రేక్షకుల మధ్య సినిమా చూడాలనే తన ఆకాంక్ష నెరవేరిందన్నారు. -
సావిత్రి పెళ్లెలా అయిందంటే..
చిత్రం: ‘సావిత్రి’, తారాగణం: నారా రోహిత్, నందిని, ధన్యాబాలకృష్ణన్, మురళీశర్మ, ‘అల్లరి’ రవిబాబు, ‘ప్రభాస్’ శ్రీను, పమ్మి సాయి, మాటలు: కృష్ణచైతన్య, సంగీతం: శ్రవణ్, నిర్మాత: డాక్టర్ వి.బి. రాజేంద్రప్రసాద్, కథ: స్క్రీన్‌ప్లే: దర్శకత్వం: పవన్ సాదినేని ఇటీవల వరుసగా ఒకటికి నాలుగు సిన్మాలు చేస్తున్న యువ హీరో నారా రోహిత్. విభిన్నమైన కథలు ఎంచుకుంటాడని పేరొస్తున్న ఈ హీరో, ‘ప్రేమ - ఇష్క్ - కాదల్’ ద్వారా ఆకర్షించిన దర్శ కుడు పవన్ సాదినేని కలయికలోది ‘సావిత్రి’. దొరబాబు (మురళీశర్మ) దంపతులకు ఇద్దర మ్మాయిలు. గాయత్రి (ధన్యా బాలకృష్ణన్), సావిత్రి (నందిని). సావిత్రికి చిన్నప్పటి నుంచి ‘పెళ్ళి’ అంటే తగని ఉత్సాహం! బామ్మ (రమాప్రభ)తో కలసి ట్రైన్లో ట్రావెల్స్ వాళ్ళతో షిర్డీకి వెళుతున్న ప్పుడు ఆమెకు బుుషి (నారా రోహిత్) తారసపడతాడు. డాక్టరైన హీరో ఎదురవుతాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఒక ప్రేమ జంటను కలిపేందుకు ప్రయత్నిస్తూ హీరోయిన్‌కూ దగ్గరవుతాడు. హీరో పెళ్ళి చూపులు చూడాల్సిన అమ్మాయి, ట్రైన్లో ఎదురుపడడంతోనే అతను ప్రేమలో పడ్డ అమ్మాయి - ఒకరే అనే అలవాటైన ట్విస్ట్ పాత్రలకు కాక, ప్రేక్షకులకే తెలుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది. ఇక అక్కడ నుంచి కథ కొత్త మలుపు తిరుగుతుంది. హీరో ప్రేమను ఒప్పుకోని హీరోయిన్... ఆమె తండ్రిని ఒప్పించలేని హీరో... హీరోయిన్ను పెళ్ళాడాలని 20 ఏళ్ళుగా బ్రహ్మచారిగా మిగిలిపోయిన విలన్ కాని విలన్ (‘అల్లరి’ రవిబాబు)... హీరోయిన్ బాబాయ్ (అజయ్) పాత్రల మధ్య కథ నాలుగు స్తంభాలాటే. చివరకు హీరోయిన్ తండ్రి ఎలా కన్విన్స అయ్యాడు, సావిత్రి పెళ్ళెలా జరిగిందన్నది మిగతా సిన్మా. నిజానికి, సావిత్రి అనే పేరు చూసి పూర్తి లేడీ ఓరియంటెడ్ సిన్మా అనుకోకూడదు. కథానాయిక లైఫ్ చుట్టూ కథ తిరిగినా, కథని నడిపేది చుట్టూ ఉన్న పాత్రలు, పరిస్థితులే. ఆరంభమైన కాసేపటికే హిందీ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, మన తెలుగు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటివన్నీ గుర్తుకు వస్తాయి. అయితే, ఆ పోలికలు ఫస్టాఫ్‌తో సరి. అక్కడ నుంచి కథ మరోలా ముందుకెళుతుంది. కొన్నిచోట్ల పలువురు యువ హీరోల శైలిని తలపించారు రోహిత్. హీరో బాలకృష్ణ ప్రస్తావన, పాటల వాడకం లాంటి ఫ్యాన్స మెచ్చే ట్రిక్కులూ వాడారు. పనిలో పనిగా నటన, దేహం మీదా దృష్టి పెట్టాలని ఫ్యాన్స భావిస్తారు. నందిత తదితర నటులు, డైలాగ్‌లు, కెమేరా విభాగాల వారు అక్కడక్కడ మెరుస్తారు. వినోదం బాగున్నా, హీరోయిన్‌కీ, ఆమె పెళ్ళికీ మరింత బలమైన ప్రతికూల స్థితులుంటే ఇంకా బాగుండేది. వెరసి, ప్రేమకథగా మొదలై చివరికి ఆడపిల్ల మనసు తెలుసుకోని పెంపకం దగ్గర కుటుంబకథగా ‘సావిత్రి’ ఆగుతుంది.