breaking news
Sanitation Defect
-
పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు : టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుపతి : తిరుమలలో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. హెల్త్ డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని స్పష్టం చేశారు. చైర్మన్ కార్యాలయంలో ఆరోగ్య విభాగం అధికారి రాంనారాయణ్ రెడ్డితో వైవీ సుబ్బారెడ్డి పారిశుద్ధ్యంపై శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తిరుమలలో పారిశుద్ధ్య లోపంపై అనేక ఫిర్యాదులు అందాయని, వెంటనే చర్యలు చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నడకదారిలో వచ్చే భక్తుల అవసరాలకు అనుగుణంగా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా చెత్త సమస్య తలెత్తకుండా పక్కా ప్రణాళికలను రూపొందించాలని అన్నారు. అయితే ప్రస్తుతం చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలించాలని చైర్మన్ హెల్త్ ఆఫీసర్‌కు చెప్పారు. ‘బర్డ్’ లో ఆకస్మిక తనిఖీ.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ‘బర్డ్’ ఆస్పత్రిలో శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బర్డ్ (బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసెర్చ్, రిహబిలిటేషన్ ఫర్ డిజబుల్డ్)కి త్వరలోనే నూతన డైరెక్టర్ని నియమిస్తామని టీటీడీ చైర్మన్ అన్నారు. ఆస్పత్రిలో రూ.4 కోట్లతో నలభై పడకలు అదనంగా నిర్మిస్తామన్నారు. అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక శ్రీవారి దర్శనాలకు సంబంధించి లిస్ట్ 1, లిస్ట్ 2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని అన్నారు. వీఐపీ దర్శనాలకు క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు. -
మంచం పట్టిన పల్లెలు
♦ పారిశుద్ధ్యం అధ్వానం ♦ జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న డయేరియా కేసులు ♦ ఇప్పటికే ఇద్దరు చిన్నారుల మృతి తాండూరు రూరల్: పల్లెలు మంచం పట్టాయి. ఎక్కడ.. ఏ ఇంట్లో చూసినా మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాల మూలుగులే వినిపిస్తున్నాయి. నెల రోజులుగా తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో అతిసార, డయేరియా వంటి రోగాలతో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజు ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి 40-60 డయేరియా కేసులు వస్తున్నాయి. ఓపీలో 100 కేసులు నమోదవుతున్నాయని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల నుంచి ఇద్దరు చిన్నారులు అతిసారతో మృతి చెందారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మండలంలోని జినుగుర్తి పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. వైద్యం కోసం అవస్థలు పడుతున్నారు. లోపించిన పారిశుద్ధ్యం.. వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. అక్కడక్కడా తాగునీటి పైప్‌లైన్ లీకేజీలు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కరన్‌కోట్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, లేబర్ కాలనీల్లోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన మురుగును తొలగించలేదని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. ఉద్దండపూర్ అనుబంధ గ్రామమైన గుండ్లమడుగు తండాలో రోడ్డుపై మురుగునీరు పారుతోంది. జడిపిస్తున్న డయేరియా.. జిల్లా ఆస్పత్రిలో రోజురొజుకూ డయేరియా కేసుల నమోదు పెరుగుతోంది. గతనెల 25న 42, 26న 53, 27న 53, 28న 46, 29న 48, 30న 52 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు డయేరియా బారిన పడి బాధపడుతున్నారు. అయితే జబ్బులతో ఆస్పత్రికి వస్తే ఇక్కడా పరిసరాలు ఆపరిశుభ్రంగానే ఉన్నాయని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కొత్త రోగాల లోకం!
గాంధీ... నిమ్స్... నీలోఫర్... ఉస్మానియా... మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులివి. ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈ ఆస్పత్రులు ఇప్పుడు కొత్త రోగాలకు కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో మురికికూపాలుగా మారుతున్నాయి. ఓ వైపు మౌలిక వసతుల కొరతతో ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులు సర్దుకోవాల్సి వస్తోంది. మరోవైపు రోగుల బంధువులూ అక్కడే సేదదీరాల్సి వస్తోంది. వ్యర్థాలు పక్కనే ఉంటాయి. దీంతో వీరంతా రోగాల బారిన పడుతున్నారు. ఎలుకలు... పందికొక్కు లు... నల్లులు... ఈ ఆస్పత్రులకు అదనపు హంగులు. * ఉస్మానియాలో ఎలుకలు, పంది కొక్కులు, దోమలు * నిమ్స్‌లో నల్లులు..ఈగలు... నీలోఫర్‌లో ఇన్ఫెక్షన్ * కంపు కొడుతున్న వార్డులు.. ప్రబలుతున్న వ్యాధులు * ధర్మాస్పత్రుల్లో రోగులకు కొత్త కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వాస్పత్రులు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాధులు నయం కావాలని వెళుతున్న వారికి కొత్త రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో దుర్వానస వెదజల్లుతున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు ఆస్పత్రి వ్యర్థాల్లో కలిసి పోతున్నాయి. ఉస్మానియాలో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతుండగా... నిమ్స్‌లో నల్లులు రోగుల రక్తం పీల్చేస్తున్నాయి. నిలోఫర్‌లో ఇన్ఫెక్షన్తో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. గాంధీలో వార్డుల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరింపలేనివిధంగా ఉంటోంది. నీలోఫర్‌లో రక్షణ ఏదీ? నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో పారిశుద్ధ్యానికి ప్రభుత్వం నెలకు రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం నిత్యం రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి, చేతులు దులుపుకుంటున్నారు. రోగి బంధువులు పడకల చుట్టే కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాక్టీరియా, ఇతర వైరస్ పిల్లలకు సులభంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి పది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి పది మంది మృతుల్లో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారు. హే గాంధీ... గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధానికి ప్రభుత్వం నెలకు రూ.23.7 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో వార్డుల్లో పేరుకుపోతోంది. ఆస్పత్రి ఆవరణలోని క్లీనికల్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. బ్యాక్టీరియా విస్తరిస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఎలా శుభ్రపరచాలంటే... ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. అవుట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్లు శుభ్రం చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చే యాల్సి ఉంది. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా శానిటేషన్ ఎజెన్సీలు పట్టించుకోవడం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు కనిపించడం లేదు. ఒప్పంద పత్రంలో రెండు వందల మంది సిబ్బందిని శానిటేషన్ కోసం వినియో గిస్తున్నట్లు చూపుతున్నా.. ఆస్పత్రుల్లో యాభై మందికి మించి కనిపించడం లేదు. ఉస్మానియా వార్డుల్లో దుర్వాసన కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట నరకకూపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.17.8 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ వార్డుల్లో చెత్త పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఆర్ఎంఓ ఆఫీస్, గుండె, మూత్రపిండాలు, తదితర వార్డుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. డ్రైనేజ్ లీక్ కావడంతో ఆస్పత్రి చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో వీటిని తాగిన రోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సిరంజీలు, బ్లేడ్లు వంటి క్లీనిక్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. నిమ్స్‌లో నల్లుల బెడద నిమ్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రయోజనం కానరావడం లేదు. పడకలను రోజుల తరబడి శుభ్రం చేయక పోవడంతో మంచాల్లో నల్లులు తిష్టవేస్తున్నాయి. ఇవి రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిమ్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఇటీవల పీసీబీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నట్లు తెలిసింది.