breaking news
Sambasiva Rao kunanneni
-
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మూడో మహాసభలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. బుధవారం రాత్రి వరకు కార్యదర్శి ఎన్నికకు సంబంధించిన హైడ్రామా కొనసాగింది. ఇప్పటివరకు రెండు దఫాలు కార్యదర్శిగా కొనసాగిన చాడ వెంకట్రెడ్డి కూడా మరోసారి అవకాశం కావాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం బరిలో నిలిచారు. దీంతో ముగ్గురు నేతలు పోటీ పడటంతో సభ్యుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము రెండున్నర వరకు సభ్యులు తర్జనభర్జన పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరికి చాడ వెంకటరెడ్డి తప్పుకోగా కూనంనేని, పల్లా మధ్య పోటీ అనివార్యమైంది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మహాసభలో ఎన్నికైన రాష్ట్ర సమితి సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మొత్తం 110 ఓట్లు పోలు కాగా, అందులో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్లు చెల్లలేదు. దీంతో 14 ఓట్ల మెజారిటీతో కూనంనేని విజయం సాధించారు. కాగా, అంతకుముందు మహాసభ 101 మంది రాష్ట్ర సమితి సభ్యులను, 9 మంది కంట్రోల్ కమిషన్ సభ్యులను ఎన్నుకుంది. సమితి సభ్యుల నుంచి 31 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుంది. గురువారం నూతన కార్యవర్గం వివరాలను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెల్లడించారు. కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు చిన్న వయసు నుండే పార్టీలో పనిచేసు్తన్నారని, విశాలాంధ్ర విలేకరిగా, ఖమ్మం జిల్లాలో పార్టీలో వివిధ హోదాలను నిర్వర్తించారని, రాష్ట్ర సహాయ కార్యదర్శిగానూ పనిచేశారని చాడ తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల విధానం ద్వారా పార్టీ కార్యదర్శిగా కూనంనేనిని ఎన్నుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు: కూనంనేని ప్రజాసమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాలను నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇదీ చదవండి: కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు! -
సాంస్కృతిక దాడులను ఎండగట్టాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, సాంస్కృతిక రంగంపై దాడులను ఎండగట్టేందుకు కవులు, కళాకారులు, రచయితలు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారుల ఆట, పాట, డప్పుల దరువు పోషించిన కీలక పాత్రను నేటి పాలకులు మరిచిపోయారన్నారు. ఈ కళాకారులను ఆదుకునే చర్యలు తీసుకోకుండా, వారికోసం సాంస్కృతిక విధానాన్ని రూపొందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. సమగ్ర సాంస్కృతిక విధానం కోసం ఈ నెల 17న హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి నేతలు కె.లక్ష్మినారాయణ, పల్లె నర్సింహ తెలిపారు.