దీక్షలకు వేళాయె...
నేటి నుంచి ఉపవాసాలు
తెల్లవారుజాము సహర్ నుంచే ప్రారంభం
పాతబస్తీలో మొదలైన సందడి
వినియోగదారులతో కిటకిటలాడుతున్న మార్కెట్లు
దీపకాంతుల్లో మక్కా మసీద్
సాక్షి, సిటీబ్యూరో: సకల శుభాల మాసం రంజాన్ నెల ప్రారంభమైంది. సోమవారం తెల్లవారు జామున 4.13 గంటలకు ముస్లింలు సహర్తో కఠోర ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఫజర్, జోహర్, అసర్, మగ్రీబ్, ఇషా నమాజులు రోజుకు ఐదు సార్లు చేస్తారు. సూర్యోదయానికి ముందు సహర్తో ఉపవాస దీక్షను చేపట్టి సూర్యస్తమయం అనంతరం రోజాను విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. మతసామరస్యాన్ని చాటేలా అన్ని వర్గాల వారిని ఆహ్వానించి ఇఫ్తార్ విందులు నిర్వహిస్తారు.
దర్శనమిచ్చిన నెలవంక
రంజాన్ మాసం ప్రారంభాన్ని సూచించే నెలవంక ఆదివారం సాయంత్రం దర్శనమివ్వడంతో ఉపవాస దీక్షలకు ముస్లింలు సిద్ధమయ్యారు. నగరంలోని మసీదుల్లో సైరన్లు మార్మోగాయి. పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకొంటూ.. రంజాన్ పవిత్ర మాసాన్ని ఆహ్వానించారు. నగరంలోని మసీదులన్నీ ఇప్పటికే ముస్తాబయ్యాయి. పవిత్ర ప్రార్థనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. చారిత్రక మక్కామసీదులో సామూహిక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని అన్ని మసీదుల్లో పటిష్టమైన భద్రతతోపాటు నిరంతరం మంచినీరు, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేశారు.
సందడిగా మార్కెట్లు..
ఈ మాసంలో అవసరమైన సేమియా, కర్జూరతోపాటు ఇతర పండ్లను ఖరీదు చేయడంలో ముస్లింలు నిమగ్నమయ్యారు. చార్మినార్, మక్కా మసీదు, మెహిదీపట్నం, నాంపల్లి, టౌలిచౌకీ తదితర ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలన్నీ వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. వ్యాపార సంస్థలనూ అలంకరించారు.