breaking news
Rural issues
-
సాదాసీదాగా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లెల్లో ఎన్నో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 నెలలు పూర్తవుతోంది. ఇంత వరకు పల్లె అభివృద్ధికి.. అత్యవసర సమస్యల పరిష్కారానికి నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి వేదికైన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సి ఉంది. సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీసి నిధులు రాబట్టుకునేందుకు చక్కని వేదికైన సమావేశంలో పల్లె సమస్యల పరిష్కారానికి జవాబు దొరకలేదు. అనేక మంది జెడ్పీటీసీలు స్థానిక సమస్యలపై ప్రస్తావించనే లేదు. మాట్లాడిన వారు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోయారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేసినా టీడీపీ ప్రజాప్రతినిధులు సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మరి కొందరు జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించేవారికి సర్దిచెప్పి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్ జానకి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే దొరవారిసత్రం జెడ్పీటీసీ సభ్యురాలు ఎం.విజేత ‘సాక్షి’లో వచ్చిన ‘మహాప్రభో నీళ్లివ్వండి’ శీర్షికన వచ్చిన కథనం గురించి ప్రస్తావించారు. దొరవారిసత్రం మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. అదే విధంగా మండల పరిధిలో సుమారు 40 గిరిజన కాలనీలు ఉంటే ఏ ఒక్క కాలనీ అభివృద్ధి చెందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులఅభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏ ప్రాజెక్టు ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ధ్వజమెత్తిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలు సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీశారు. స్థానిక సర్పంచ్ల ఆమోదం లేకుండా గ్రామాల్లో పనులు మంజూరు కానీ, పనులు చేయడానికి వీల్లేదని.. గతంలో ఉన్న కమిటీలను ప్రభుత్వం రద్దుచేసిందని గుర్తుచేశారు. అనంతరం తాగు, సాగునీటి సమస్య పరిష్కారానికి అధికారయంత్రాంగం ఏం చేస్తుందో చెప్పాలిని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోవటానికి అధికారుల వైఫల్యమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ఇసుక తరలింపులో దొరికిన వారు దొంగ.. దొరకని వారు దొరలా చెలామణి అవుతున్నారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని సీఎస్ఆర్ యాక్టివిటీస్ విమర్శలకు దారితీస్తోందని ముత్తుకూరు జెడ్పీటీసీ లేవనెత్తిన సమస్యకు ఎమ్మెల్యే కాకాణి కూడా సమర్థించారు. కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని వివరించారు. అయితే వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదని.. స్థానికులకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో కాలువల కింద ఉన్న పంటలకు ఆలస్యంగా సాగునీరు ఇచ్చారని, దీంతో అనేక మంది రైతులు పంటలు వేయకుండా భూములను బీళ్లుగానే ఉంచారని గుర్తుచేశారు. కాలువను త్వరగా ఆధునికీకరించి వచ్చే పంటలకైనా పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీటి విషయంలో తలెత్తే సమస్యలను ముందుగా పరిష్కరించుకునేందుకు ఐఏబీ సమావేశాన్ని సెప్టెంబర్‌లోనే నిర్వహిస్తే... పంటలు సాగుచేసుకునే సమయానికి పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ జానకికి సూచించారు. అదే విధంగా సీపీఆర్ నుంచి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులకు, మరి కొన్ని చెరువులకు నీరిస్తే భూగర్భ జలాలు మెరుగుపడి, కనీసం తాగునీటి సమస్యైనా తీరుతుందని ఎమ్మెల్యే అన్నారు. అది అధికారిక సమావేశమా? టీడీపీ సమావేశమా? సీఎం నిర్వహించిన అధికారిక సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదని.. ఆ సమావేశానికి ఎవరెవరో వచ్చారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ విషయంపై కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి లేచి సాంకేతిక కారణాలతో పొరబాటు జరిగిందని సీఎం ఆ రోజే సమాధానం ఇచ్చారని ఎమ్మెలే రామిరెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలను రివ్యూమీటింగ్ ఉందని రమ్మన్నారు కానీ.. టీడీపీ మీటింగ్ అని రమ్మనలేదని ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. అంతకు ముందు సీతారంపురం జెడ్పీటీసీ సభ్యురాలు జ్వోతి స్థానిక ఎంపీడీఓ తీరుపై ఫిర్యాదు చేశారు. స్థానికంగా ప్రభుత్వ పథకాలు చేపట్టే సమయంలో జెడ్పీటీసీ అయిన తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో మరి కొందరు జెడ్పీటీసీ సభ్యులు లేచి అన్ని మండలాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నిధులు రావు.. కనీసం స్థానికంగా ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వరా? అంటూ నిలదీశారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ కావలి చెరువు ఆక్రమణలకు గురవుతోందని అధికారులకు ఫిర్యాదు చేస్తే... వారేమో 30 ఏళ్ల క్రితం నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఆ నోటీసులను ఉప సంహరించుకుని చెరువును ఆక్రమించుకున్న వారినపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా జిల్లా పరిషత్ సమావేశంలో కొంత మంది తప్ప మిగిలిన వారు సమస్యల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. -
ప్రజల కష్టాలు తీరుస్తా..
- ‘పల్లె నిద్ర’లో వారి ఇబ్బందులు చూశా.. - రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గణపురం : నియోజకవర్గంలో నాలుగేళ్ల కాలంలో ‘పల్లె నిద్ర’ చేసిన గ్రామాలు వందకు పైగానే ఉన్నాయి.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ప డుతున్న ఇబ్బందులను తెలుసుకున్నాను.. తన పదవీ కాలంలో తప్పకుండా ఆయా గ్రామాల సమస్యలు పరిష్కరించి ప్రజల కష్టా లు తీరుస్తానని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని కర్కపల్లి గ్రామంలో 2011 డిసెంబర్లో పల్లె నిద్ర చేసిన మొగిలి రాజయ్య ఇంటిని ఆది వారం స్పీకర్ సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాజయ్య కుటుం బం అనుభవిస్తున్న కటిక దారిద్య్రాన్ని ఆనాడు కళ్లారా చుశానని చెప్పారు. పరకాల నుంచి భూపాలపల్లికి పోయే ప్రతీసారి తాను నిద్రిం చిన ఇంటివైపు చూస్తానని చెప్పారు. రాజ య్య, అతని కుమారుడు ఓదెలు భూజలపై చేతులు వేసి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడారు. అన్నం పెట్టి ఆదరించిన ఆ కుటుంబం రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు. ఇలాంటి కుటుంబాలలో మార్పు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నానని, ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలతో పక్కా గృహాం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. చెంచుకాలనీ వాసులకు స్పీకర్ వరాలు రేగొండ : చెంచుల అభివృద్ధి కోసం పరితపిస్తున్న మధుసూదనాచారి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈనెల 18న మండలంలోని చెంచుకాలనీని సందర్శించారు. ఆదివారం మరోసారి ఆ కాలనీకి చేరుకుని స్థానిక ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు జిల్లా కేంద్ర తెలియదని చెప్పడంతో స్పీకర్ స్పందించారు. తీరిక సమయం చూసుకుని చెంచుకాలనీవాసులను నాలుగు వ్యాన్లలో వరంగల్ పట్టణానికి తరలించి అక్కడి చారిత్రక ప్రాంతలను వెంట ఉండి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాలనీలోని విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఎలాంటి ఆపద వచ్చినా తనకు ఫోన్ చేసేలా కాలనీలో సెల్ ఫోన్ ఉంచుతామన్నారు. స్పీకర్ ఇన్ని వరాలు కురిపించడంతో చెంచుకాలనీ వాసులు ఆనందంతో పొంగిపోయారు. స్పీకర్ వెంట కుంచాల సదావిజయ్‌కుమార్, మోడెం ఉమేష్‌గౌడ్, బలేరావు మనోహర్‌రావు, పున్నం రవి, పాడి ప్రతాఫ్‌రెడ్డి, తడక శ్రీనివాస్‌గౌడ్, ఐలు శ్రీధర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.