RP Road
-
Hyderabad: ట్రాఫిక్ క్లియర్ కంటే చలాన్లకే ప్రాధాన్యం?
హైదరాబాద్: సిటీ ట్రాఫిక్ పోలీసుల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ క్లియర్ చేయడంపై కంటే చలాన్ల మీదే వారికి ఎక్కువ దృష్టి ఉంటుందనే విమర్శలకు ఊతమిచ్చే ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. చేతిలో కెమెరా, మొబైల్ ఫోన్ పట్టుకుని కేవలం చలాన్ల కోసమే రోడ్లపై వేచి చూసే పోలీసులు చాలాచోట్ల కనిపిస్తుంటారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను ఫొటో తీయడమే వారి డ్యూటీ. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి టీఎస్ 10ఎఫ్డీ 8002 కారును ఆర్పీరోడ్‌లోని దర్గా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉదయం 10.15 గంటలకు నిలిపి, మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ మధ్య సమయంలో కారుకు ఉదయం 10.29, 10.50, మధ్యాహ్నం 12.18 గంటలకు వరుసగా మూడు చలాన్లు వేశారు ట్రాఫిక్ పోలీసులు. అవి కూడా వేర్వేరు సెక్షన్లకు కాదు. అన్నీ కూడా క్యారేజ్ వే లో పార్కింగ్ పేరిటే కావడం గమనార్హం. ఇదీ మహంకాళి ట్రాఫిక్ పోలీసులు చేసిన ఘన కార్యం. రాణిగంజ్, ఆర్పీరోడ్‌లోని షాపుల ముందు నిత్యం పార్క్ చేసే వాహనాలను మాత్రం పట్టించుకోరు. -
ఓ తండ్రి ప్రేమ!
బిడ్డ కోసం రికార్డుల వేట నిమిషంలో 62 గుంజీలు రెండేళ్ల కుమారుడితో మరో సాహసం సైకిల్ వెనక్కి తొక్కించిన వైనం సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని గుజరాతీ ఉన్నతి పాఠశాల ఈ కృత్యానికి శనివారం వేదికైంది. నగరంలోని మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అమీర్ కె వడ్సరియా.... అతని రెండున్నరేళ్లకుమారుడు మేహుల్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం వినూత్న ప్రయోగం చేశారు. అమీర్ ఒక నిమిషంలో 62 గుంజీలు తీశాడు. మేహుల్ ఒక నిమిషంలో 50 మీటర్ల వరకు ట్రైసైకిల్‌ను రీవర్స్‌లో(వెనక్కి) తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో అమీర్ గంట వ్యవధిలో ఉన్న 1100 గుంజీల రికార్డును... 1450 గుంజీలు తీసి బద్దలుకొట్టారు. శనివారం ఒక నిమిషంలో 62 గుంజీలు తీసి మరో రికార్డు నెలకొల్పారు. చికిత్స కోసమే.... గుజరాత్‌కు చెందిన అమీర్ ఎనిమిదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని...భార్యా పిల్లలతో నగరానికి వచ్చాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ చాలీచాలని డబ్బులతో బతుకుబండిని లాగిస్తున్నాడు. అయిదేళ్లుగా పెద్ద కుమారుడు ఆమన్(8) కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రో)తో బాధ పడుతున్నాడు. కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. చికిత్స చేయించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించ లేదు. కొడుకు కోసమే గుంజీలు తీయడం ప్రారంభించానని... ఈ రికార్డు నెలకొల్పడం ద్వారా వచ్చే డబ్బుతో బిడ్డకు వైద్య సేవలు అందించవచ్చని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అమీర్ పేర్కొన్నాడు. తన చిన్న కుమారుడు మేహుల్ తోనూ ట్రై సైకిల్ రివర్స్‌లో తొక్కించడం ప్రారంభించానన్నాడు. వీటిని వీడియో తీసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకు పంపిస్తానని తెలిపాడు. ఈ రూపంలో డబ్బు సమకూరితే బిడ్డ వైద్య సేవలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు చెప్పాడు. బిడ్డ కోసం తండ్రి...అన్న కోసం చిన్నారి చేసిన ఈ ప్రయోగాలు చూపరులను ఆకట్టుకోవడంతో పాటు...కదిలించాయి.


