breaking news
responcibility
-
అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే
- వారి చదువులు, బాగోగులన్నీ చూసుకుంటాం: కేసీఆర్ - పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం - జూలై నుంచి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. కేబినెట్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో అనాథలెవరూ ఉండబోరని.. అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ‘‘పదో తరగతి వరకు అనాథ పిల్లలను చదివించేందుకు కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఆ తర్వాతేం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియని దిక్కుతోచని, దయనీయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. దేశం మొత్తం అనుసరించే గొప్ప కార్యక్రమంగా ఇది ఉండాలని భావిస్తున్నాం. అనాథ పిల్లలను ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చదివించాలి, ఏమేం ఏర్పాట్లు చేయాలనే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. మంత్రులు ఈటల, జోగు రామన్న, చందూలాల్, లక్ష్మారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారం పది రోజుల్లో నివేదిక అందిస్తారు..’’ అని కేసీఆర్ ప్రకటించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. - పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందించేందుకు 35,250 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపేలా 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పాలమూరుకు 70 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు నీటి తరలింపు. అదనంగా హైదరాబాద్‌కు 20 టీఎంసీలు. - గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా పథకం అమలు. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రిజిస్టర్డ్ సొసైటీల్లోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. - విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సాయం. బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయింపు. మైనారిటీ విద్యార్థులకు 10 గురుకుల పాఠశాలలు, 10 వసతి గృహాల ఏర్పాటు. హా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు కడుపు నిండా భోజనం, రోజు విడిచి రోజు కోడిగుడ్డు. - నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు. - ఈనెల 12న లాంఛనంగా టీఎస్ ఐపాస్ ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడా లేనంత సరళంగా ఉండేలా ఖరారుకు నిర్ణయం. - జూలై నుంచి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ. వయోపరిమితి సడలింపుపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం. - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు స్క్రీనింగ్. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తింపు. -
గవర్నర్‌పై గురుతర బాధ్యత
ఇతర రాష్ట్రాల గవర్నర్లకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పాత్ర కీలకమైనదీ, క్లిష్టమైనదీ. రాష్ట్ర విభజనకు పూర్వం సైతం రెండు ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర, సమైక్య ఉద్యమాలు చెలరేగి, రెండు భిన్నమైన వాదనలు వినిపించిన దశలోనూ కేంద్ర నాయకత్వం గవర్నర్ నరసింహన్ అందించే సమాచారంపైనా, ఇచ్చే సలహాపైనా ఆధారపడేది. ముఖ్య మంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి పదవిలో కొనసాగుతూనే పార్టీ అధిష్ఠానవర్గంపైన తిరుగుబాటు చేసినట్టు వ్యవహరించిన రోజులలో నరసింహన్ బాధ్యత మరింత పెరిగింది. అందుకే నరసింహన్ అంత తరచుగా ఢిల్లీని సందర్శించిన గవర్నర్ మరొకరు లేరు. ఢిల్లీ వె ళ్ళిన ప్రతిసారీ రాష్ట్రపతినీ, ప్రధానినీ, దేశీయాంగమంత్రినీ, అధికార కూటమి అగ్రనాయకులనూ, అధికారపక్షం అధినేతనీ కలుసుకునే అవకాశం నరసింహన్లాగా మరే గవర్నర్‌కూ లభించలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలలోనూ అస్థిర పరిస్థితులూ, రాష్ట్ర విభజన జరిగిన తీరూ, విభజన చట్టం తెచ్చిన చిక్కులు కూడా ఇందుకు కారణం. మంగళవారం మరోసారి ఢిల్లీ వెడుతున్న గవర్నర్ నరసింహన్‌పైన గురుతరమైన బాధ్యత ఉంది. ఆయన మామూలు రాజకీయాల ద్వారా రాజభవన్‌కు వెళ్ళిన వ్యక్తికాదు. ఐపీఎస్ అధికారిగా, ఇంటెలిజెన్స్ శాఖను నిర్వహించిన ఉన్నతాధికారిగా పని చేశాక ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా, అనంతరం ఆంధ్రప్రదేశ్ అదనపు గవర్నర్‌గా, దరిమిలా పూర్తికాలం గవర్నర్‌గా, విభజన తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా నియుక్తుడైన మాజీ ఉన్నతాధికారి. వివాదాలకు అతీతంగా ఉంటారనీ, న్యాయానికీ, ధర్మానికీ పెద్దపీట వేస్తారనీ, దైవభక్తీ, పాపభీతీ కలిగినవారనీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సంభవించిన రాజకీయ విస్ఫోటనం నరసింహన్ సంయమనానికీ, ధర్మాధర్మ విచక్షణకూ అగ్నిపరీక్షగా పరిణమిస్తున్నది. ఆయన నివేదికపై ఆధారపడే ‘ఓటుకు నోటు’ కేసులో ఎటువంటి వైఖరి అనుసరించాలో కేంద్రం నిర్ణయించుకుంటుంది. రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి గవర్నర్ నివేదికను వినియోగించుకునే అవకాశాలకోసం కేంద్ర సర్కారు తరచి చూసే అవకాశం ఉంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన గూఢచర్యం ఫలితంగా నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్ను ఇటీవలి ఎంఎల్సీ ఎన్నికలలో డబ్బుతో లోబరుచుకొని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి వీడియోలో రూ. 50లక్షల నగదు సహితంగా దొరికిపోయారు. తక్కిన రూ 4.50 కోట్లు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఇస్తామంటూ ఆయన స్పష్టంగా చెప్పడం టీవీల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూశారు, విన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆయనతో మాట్లాడినట్టు నిరూపించే ఆడియోను న్యూస్ చానళ్ళు ప్రసారం చేశాయి. దీంతో టీడీపీ అధినేత సంకటావస్థలో చిక్కుకున్నారు. రేవంత్‌రెడ్డికీ, తనకూ సంబంధం లేదని ప్రకటించలేరు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది తానేనంటూ ఫొరెన్సిక్ పరీక్షలో తేలితే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. గవర్నర్‌తోనూ, ఇతరులతోని ఏమి చెప్పుకున్నా రేవంత్‌రెడ్డి టేపునూ, నారావారి టేపునూ కలిపి చూసినవారికి శాసనసభ్యుడిని రూ. 5 కోట్లతో కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. నిజనిర్థారణ జరిగే వరకూ ఏదైనా వాదనగానే మిగులుతుంది. నిజనిర్థారణ చేయవలసిన బాధ్యత ఏసీబీది, న్యాయస్థానాలది. నేర పరిశోధన సంస్థలూ, న్యాయవ్యవస్థ మాత్రమే కాకుండా రాజకీయ విలువలూ, నైతిక విలువలు కూడా ఉన్నాయి. రైలు ప్రమాదం జరిగిన వెంటనే నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన లాల్ బహద్దూర్ శాస్త్రి ఉన్నారు. జైన్ డెయిరీలో పేరున్నదని వార్త రాగానే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికలలో విజయం సాధించిన తర్వాతనే తిరిగి సభలో అడుగుపెట్టిన అద్వానీ వంటి వారు ఉన్నారు. నేర నిరూపణ దిగువ న్యాయస్థానంలో జరిగిన తర్వాత పదవికి రాజీనామా చేసిన లాలూ, జయలలిత వంటి ప్రముఖ రాజకీయ నాయకులున్నారు. ప్రస్తుత ఉదంతంలో నిందితులూ, వారి పక్షాన వాదించేవారూ శాసనసభ్యుడి కొనుగోలు ప్రయత్నం ప్రస్తావన చేయకుండా, నేరం ఎవరిదో తేల్చకుండా ఫోన్‌ను రహస్యంగా ట్యాప్ చేయడం నేరమంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనంటూ ఎదురుదాడి ప్రారంభించారు. కుట్ర సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. దీని లోతు చూస్తాం, అంతు చూస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుపై జరుగుతున్న కుట్రను ప్రజలంతా కలిసి ఓడించాలంటూ మహాసంకల్ప సభలో వక్తలు ఉద్బోధిస్తున్నారు. ‘కుట్ర రాజకీయాల ద్వారా’ అవమానపరిచింది తనను కాదనీ తన పార్టీకి ఓటు చేసిన మొత్తం అయిదు కోట్ల మంది ప్రజలననీ చంద్రబాబు గొంతు పెంచి హెచ్చరించారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదనీ, తనను బుట్టలో వేయడానికి ప్రయత్నం జరుగుతోందని అనుమానించిన శాసనసభ్యుడే ఆ మాటలు రికార్డు చేశారనీ తెలంగాణ ప్రభుత్వం వాదన. ఒకవైపు టేపులో ఉన్నది ముఖ్యమంత్రి గొంతు కాదంటూనే ముఖ్యమంత్రి ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారంటూ ప్రశ్నించడం పరస్పర వైరుధ్యాన్ని బయటపెడుతోంది. రాజకీయాలలో నీతి క్రమంగా అడుగంటుతున్న మాట వాస్తవమే అయినా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఇంత పచ్చిగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగా, ఇంత నిర్భయంగా కొనసాగిస్తారనీ ఊహించడం కూడా కష్టమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అధికార పార్టీలు పరస్పరం నిందించుకోవడం కొత్త కాదు. కానీ సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా టీడీపీ దబాయించడం విశేషం. ఈ ఉదంతంలో నిజనిర్థారణ జరుగుతుందా లేక మసిపూసి మారేడుకాయ చేస్తారా అన్నది వేచి చూడాలి. తన మిత్రపక్షం, కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత వ్యవహారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్లా పరిగణిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. ప్రధాని నరేంద్రమోదీ స్పందన ఎట్లా ఉంటుందన్నది చర్చనీయాంశం. గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఏమని నివేదిస్తారనేది అందుకే అత్యంత కీలకంగా మారింది.