గవర్నర్‌పై గురుతర బాధ్యత | Sakshi
Sakshi News home page

గవర్నర్‌పై గురుతర బాధ్యత

Published Tue, Jun 9 2015 1:15 AM

గవర్నర్‌పై గురుతర బాధ్యత

ఇతర రాష్ట్రాల గవర్నర్లకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంయుక్త గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పాత్ర కీలకమైనదీ, క్లిష్టమైనదీ.  రాష్ట్ర విభజనకు పూర్వం సైతం రెండు ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్ర, సమైక్య ఉద్యమాలు చెలరేగి, రెండు భిన్నమైన వాదనలు వినిపించిన దశలోనూ  కేంద్ర నాయకత్వం గవర్నర్ నరసింహన్ అందించే సమాచారంపైనా, ఇచ్చే సలహాపైనా ఆధారపడేది.

ముఖ్య మంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి పదవిలో కొనసాగుతూనే పార్టీ అధిష్ఠానవర్గంపైన తిరుగుబాటు చేసినట్టు వ్యవహరించిన రోజులలో నరసింహన్ బాధ్యత మరింత పెరిగింది. అందుకే నరసింహన్ అంత తరచుగా ఢిల్లీని సందర్శించిన గవర్నర్ మరొకరు లేరు. ఢిల్లీ వె ళ్ళిన ప్రతిసారీ రాష్ట్రపతినీ, ప్రధానినీ, దేశీయాంగమంత్రినీ, అధికార కూటమి అగ్రనాయకులనూ, అధికారపక్షం అధినేతనీ కలుసుకునే అవకాశం నరసింహన్‌లాగా మరే గవర్నర్‌కూ లభించలేదు.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలలోనూ అస్థిర పరిస్థితులూ, రాష్ట్ర విభజన జరిగిన తీరూ, విభజన చట్టం తెచ్చిన చిక్కులు కూడా  ఇందుకు కారణం. మంగళవారం మరోసారి ఢిల్లీ వెడుతున్న గవర్నర్ నరసింహన్‌పైన గురుతరమైన బాధ్యత ఉంది. ఆయన మామూలు రాజకీయాల ద్వారా రాజభవన్‌కు వెళ్ళిన వ్యక్తికాదు. ఐపీఎస్ అధికారిగా, ఇంటెలిజెన్స్ శాఖను నిర్వహించిన ఉన్నతాధికారిగా పని చేశాక ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా, అనంతరం ఆంధ్రప్రదేశ్ అదనపు గవర్నర్‌గా, దరిమిలా పూర్తికాలం గవర్నర్‌గా, విభజన తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా నియుక్తుడైన మాజీ ఉన్నతాధికారి.

వివాదాలకు అతీతంగా ఉంటారనీ, న్యాయానికీ, ధర్మానికీ పెద్దపీట వేస్తారనీ, దైవభక్తీ, పాపభీతీ కలిగినవారనీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సంభవించిన రాజకీయ విస్ఫోటనం నరసింహన్ సంయమనానికీ, ధర్మాధర్మ విచక్షణకూ అగ్నిపరీక్షగా పరిణమిస్తున్నది. ఆయన నివేదికపై ఆధారపడే ‘ఓటుకు నోటు’ కేసులో ఎటువంటి వైఖరి అనుసరించాలో కేంద్రం నిర్ణయించుకుంటుంది. రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి గవర్నర్ నివేదికను వినియోగించుకునే అవకాశాలకోసం కేంద్ర సర్కారు తరచి చూసే అవకాశం ఉంది.

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన గూఢచర్యం ఫలితంగా నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్‌ను ఇటీవలి ఎంఎల్‌సీ ఎన్నికలలో డబ్బుతో లోబరుచుకొని టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి వీడియోలో రూ. 50లక్షల నగదు సహితంగా  దొరికిపోయారు. తక్కిన రూ 4.50 కోట్లు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు  ఇస్తామంటూ ఆయన స్పష్టంగా చెప్పడం టీవీల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరూ చూశారు, విన్నారు.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆయనతో మాట్లాడినట్టు నిరూపించే ఆడియోను న్యూస్ చానళ్ళు ప్రసారం చేశాయి. దీంతో టీడీపీ అధినేత సంకటావస్థలో చిక్కుకున్నారు. రేవంత్‌రెడ్డికీ, తనకూ సంబంధం లేదని ప్రకటించలేరు. స్టీఫెన్సన్‌తో మాట్లాడింది తానేనంటూ ఫొరెన్సిక్ పరీక్షలో తేలితే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. గవర్నర్‌తోనూ, ఇతరులతోని ఏమి చెప్పుకున్నా రేవంత్‌రెడ్డి టేపునూ, నారావారి టేపునూ కలిపి చూసినవారికి శాసనసభ్యుడిని రూ. 5 కోట్లతో కొనుగోలు చేయడానికి ప్రయత్నం జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది.

నిజనిర్థారణ జరిగే వరకూ ఏదైనా వాదనగానే మిగులుతుంది. నిజనిర్థారణ చేయవలసిన బాధ్యత ఏసీబీది, న్యాయస్థానాలది. నేర పరిశోధన సంస్థలూ, న్యాయవ్యవస్థ మాత్రమే కాకుండా రాజకీయ విలువలూ, నైతిక విలువలు కూడా ఉన్నాయి. రైలు ప్రమాదం జరిగిన వెంటనే నైతిక బాధ్యత వహించి రైల్వేమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన లాల్ బహద్దూర్ శాస్త్రి ఉన్నారు. జైన్ డెయిరీలో పేరున్నదని వార్త రాగానే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికలలో విజయం సాధించిన తర్వాతనే తిరిగి సభలో అడుగుపెట్టిన అద్వానీ వంటి వారు ఉన్నారు. నేర నిరూపణ దిగువ న్యాయస్థానంలో జరిగిన తర్వాత పదవికి  రాజీనామా చేసిన లాలూ, జయలలిత వంటి ప్రముఖ రాజకీయ నాయకులున్నారు.  

ప్రస్తుత ఉదంతంలో నిందితులూ, వారి పక్షాన వాదించేవారూ శాసనసభ్యుడి కొనుగోలు ప్రయత్నం ప్రస్తావన చేయకుండా, నేరం ఎవరిదో తేల్చకుండా ఫోన్‌ను రహస్యంగా ట్యాప్ చేయడం నేరమంటూ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడమేనంటూ ఎదురుదాడి ప్రారంభించారు. కుట్ర సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు. దీని లోతు చూస్తాం, అంతు చూస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబుపై జరుగుతున్న కుట్రను ప్రజలంతా కలిసి ఓడించాలంటూ మహాసంకల్ప సభలో వక్తలు ఉద్బోధిస్తున్నారు.

‘కుట్ర రాజకీయాల ద్వారా’ అవమానపరిచింది తనను కాదనీ తన పార్టీకి ఓటు చేసిన మొత్తం అయిదు కోట్ల మంది ప్రజలననీ చంద్రబాబు గొంతు పెంచి హెచ్చరించారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదనీ, తనను బుట్టలో వేయడానికి ప్రయత్నం జరుగుతోందని అనుమానించిన శాసనసభ్యుడే ఆ మాటలు రికార్డు చేశారనీ తెలంగాణ ప్రభుత్వం వాదన. ఒకవైపు టేపులో ఉన్నది ముఖ్యమంత్రి గొంతు కాదంటూనే ముఖ్యమంత్రి ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తారంటూ ప్రశ్నించడం పరస్పర వైరుధ్యాన్ని బయటపెడుతోంది.

రాజకీయాలలో నీతి క్రమంగా అడుగంటుతున్న మాట వాస్తవమే అయినా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ఇంత పచ్చిగా, ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగా, ఇంత నిర్భయంగా కొనసాగిస్తారనీ ఊహించడం కూడా కష్టమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అధికార పార్టీలు పరస్పరం నిందించుకోవడం కొత్త కాదు. కానీ సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత కూడా టీడీపీ దబాయించడం విశేషం.

ఈ ఉదంతంలో నిజనిర్థారణ జరుగుతుందా లేక మసిపూసి మారేడుకాయ చేస్తారా అన్నది వేచి చూడాలి. తన మిత్రపక్షం, కూటమిలో భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత వ్యవహారాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎట్లా పరిగణిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. ప్రధాని నరేంద్రమోదీ స్పందన ఎట్లా ఉంటుందన్నది చర్చనీయాంశం. గవర్నర్ నరసింహన్ కేంద్రానికి ఏమని నివేదిస్తారనేది అందుకే అత్యంత కీలకంగా మారింది.

Advertisement
Advertisement