'నన్ను ఫేస్బుక్లో ఫ్రెండ్‌గా చేర్చుకోరా ప్లీజ్'
న్యూఢిల్లీ: సాధారణంగా ఫేస్బుక్ గురించిన చర్చ పట్టణాల నుంచి పల్లెల్లోకి.. పక్కా మాస్ భాషలో చెప్పాలంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు చర్చ జరగని చోటు లేదు. దీని గురించిన ఆలోచన రాగానే తనకు ఒక ఫేస్ బుక్ ఖాతా ఉంటే బావుంటుందనిపించి ఎంతోమంది ఫేస్ బుక్ ఖాతాను తెరుస్తారు. అయితే, తెరిచేంత వరకు ఒక బాధైతే తెరిచిన తర్వాత మరొక బాధ. తనకు ఎవరూ ఫ్రెండ్స్ రావడం లేదే, తనను ఎవరూ ఫ్రెండ్ గా చేర్చుకోవడం లేదే.. తాను పెట్టిన అంశానికి, ఫొటోకు లైక్ లు కొట్టడం లేదే, కామెంట్ లు పెట్టడం లేదే అంటూ మనసులో కొంత ఆందోళన ఉండే ఉంటుంది.
ఈ క్రమంలో అసలు ఆ ఖాతాను గాలికొదిలేసేవారు చాలామందే ఉన్నారు. కానీ, పాకిస్థాన్ లో కరాచీకి చెందిన రెహాన్ అల్లవాలా అనే వ్యక్తి మాత్రం అలా కాదు. కాస్త భిన్నంగా ఆలోచించాడు. ఎలాగైనా తనకు ఫేస్ బుక్ లో లక్షల్లో స్నేహితులు ఉండాలని కోరుకున్నాడు. బాగా ఆలోచించి 'నన్ను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ గా చేర్చుకోరా' అంటూ రహదారిపక్కనే పెద్దపెద్ద హోర్డింగులు ఏర్పాటుచేశాడు. అందులో తన ఫొటోను, ఫేస్ బుక్ ఖాతా వివరాలను అందులో పెట్టి తనను ఫాలో అవ్వాల్సిందిగా, స్నేహితుడిగా చేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. తనకు లక్షల్లో స్నేహితులను పొందాలని ఉందని చెప్పాడు.