breaking news
recruitments in ISIS
-
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఐసిస్‌లోకి ఏయే దేశాల నుంచి రిక్రూట్మెంట్స్?
ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఆవిర్భవించిన ఐసిస్ టెర్రరిస్టు సంస్థలోకి ఏ దేశాల నుంచి ఎక్కువమంది విదేశీ ఫైటర్లు చేరుతున్నారు? ఎందుకు చేరుతున్నారు? వారు చేరడం వెనుకనున్న సామాజిక పరిస్థితులు ఏమిటి? అన్న అంశాలు ఇస్తాంబుల్, బాగ్దాద్ నరమేధం నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశాలయ్యాయి. మధ్యప్రాచ్యం, అరబ్ దేశాల నుంచే ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఐసిస్‌లో చేరుతున్నా, ఐరోపా కూటమి దేశాలతో పాటు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి పాశ్చాత్య దేశాలే కాకుండా రష్యా, ఇండోనేషియా, తజకిస్థాన్ లాంటి దేశాల నుంచి కూడా వేలాది మంది విదేశీ ఫైటర్లు చేరుతున్నారు. 2015, డిసెంబర్ నాటికి దాదాపు 85 దేశాల నుంచి 30 వేల మంది విదేశీ ఫైటర్లు ఐసిస్ టెర్రరిస్టు సంస్థలో చేరారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్న దేశాల నుంచే విదేశీ ఫైటర్లు చేరుతున్నందున ఆర్థిక పురోభివృద్ధికి, వారు టెర్రరిజాన్ని ఆశ్రయించడానికి సంబంధం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆర్థికాభివృద్ధితోపాటు రాజకీయంగా బలంగా ఉండి, భాషాపరంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఎక్కువ మంది టెర్రరిజం వైపు మొగ్గుచూపడం సామాజిక విశ్లేషకులు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వలస వచ్చిన ముస్లింలను చిన్నచూపు చూడడం, సామాజికాభివృద్ధి సూచికలో వారు వెనకబడి ఉండడం కారణాల వల్ల ముస్లిం యువత టెర్రరిజం వైపు మొగ్గుచూపుతోందని ఇంతవరకు భావిస్తూ వచ్చారు. ముస్లింలపట్ల సామాజిక వివక్ష లేని దేశాల నుంచి కూడా ఎక్కువ మంది ఐసిస్ పట్ల ఆకర్షితులవడం కూడా ఆశ్చకరమైన విషయమని వారు భావిస్తున్నారు. సామాజిక అభివృద్ధి సూచికలో కొంత వెనకబాటుతనం పరోక్షంగా కారణం అవుతుండవచ్చని వారు భావిస్తున్నారు. అయితే ఓ దేశ జనాభాలో ముస్లింల సంఖ్యకు, ఐసిస్ సంస్థలో విదేశీ ఫైటర్లు చేరడానికి మాత్రం ప్రత్యక్ష సంబంధం ఉందని వారు చెబుతున్నారు. ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ మంది చేరుతున్నారని వారంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది విదేశీ ఫైటర్లు ఆకర్షిలవుతున్నారనే విషయం స్పష్టమైనా, అందుకు దారితీస్తున్న సామాజికాంశాలను మాత్రం ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతానికి మాత్రం కారణాలు అంతుచిక్కడం లేదని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.