breaking news
Ratangarh temple
-
ఉదాసీనతే అసలు దోషి!
మరోసారి పాలకుల నిర్లక్ష్యం 115 నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. ఆదివారం మధ్యప్రదేశ్‌లోని రతన్‌గఢ్ ఆలయంలో తొక్కిసలాట మరిన్ని వందలమందిని గాయాలపాలు చేసింది. మరణించినవారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే. పుణ్యక్షేత్ర సందర్శనకెళ్లిన యాత్రికుల భద్రత విషయంలో ఎన్నెన్ని చేదు అనుభవాలు ఎదురైనా ప్రభుత్వాలు గుణపాఠాలు నేర్వడంలేదని ఈ ఘటన నిరూపించింది. రతన్‌గఢ్ ఆలయం దాటియా జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలో ఉంది. ఈ ఆలయం సమీపంలోని సింధు నదిలో ఏడేళ్లక్రితం ఒక్కసారి ప్రవాహం ముంచుకురావడంతో పడవ తలకిందులై 57మంది మరణించారు. పడవలపై నదిని దాటే దుస్థితిని తొలగిస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగబోవని భావించి మూడేళ్లనాడు వంతెన నిర్మించారు. కానీ, ముందు జాగ్రత్తలను తీసుకోలేని అశక్తులు ప్రభుత్వ యంత్రాంగంలో ఉంటే... ఏదో ఒకమూల మృత్యువు పొంచి ఉండి కాటేయకమానదని తాజా ఘటన రుజువు చేస్తోంది. దేవీ నవరాత్రుల్లో ఆలయానికి నిత్యమూ వేలాది మంది భక్తులు వస్తారని, ఆ జనసమ్మర్థానికి అనుగుణంగా వంతెన నిర్మాణం ఉండాలని అప్పట్లో పాలకులు అనుకో లేదు. ఇప్పుడు ఆ ఇరుకైన వంతెనే రాకపోకలకు ఆధారమైంది. ఒకరకంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ఘటన జరిగిన సమయానికి దానిపై 25,000మంది భక్తులున్నారు. వంతెనకున్న రెయిలింగ్‌ను ఒక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన తర్వాత వంతెన కూలిపోతున్నదని వ్యాపించిన వదంతితో ఒక్కసారిగా భక్తుల్లో భయాందోళనలు చెలరేగి ఈ తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భయకంపితులైన కొందరు వంతెన పైనుంచి నదిలోకి దూకి ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. అలాగే, మృతుల సంఖ్యను తగ్గించి చూపడం కోసం పోలీసులే కొన్ని శవాలను నదిలోకి విసిరేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆలయాలవద్ద తొక్కిసలాటలు జరిగిన ఉదంతాలు గతంలో ఎన్నో ఉన్నాయి. నేర్చుకోదల్చుకున్నవారికి అవన్నీ గుణపాఠాలే. 2008 ఆగస్టులో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి ఆలయంవద్ద తొక్కిసలాట జరిగి 162 మంది చనిపోయారు. ఆ మరుసటి నెలలోనే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చాముండాదేవి ఆలయంలో ఇదే పునరావృతమై 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో మహారాష్ట్రలోని మంధర్‌దేవి ఆలయంవద్ద జరిగిన తొక్కిసలాట 304 మంది ఉసురుతీసింది. రెండేళ్ల క్రితం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో తొక్కిసలాట జరిగి వందమందికిపైగా భక్తులు దుర్మరణంపాలయ్యారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా న్యాయ విచారణ కమిషన్లను నియమించడం రివాజుగా మారింది. ఆ కమిషన్ల అధ్యయనంలో ఎలాంటి లోపాలు వెల్లడయ్యాయో, వాటి నివారణకు అవి సూచించిన మార్గాలేమిటో తెలుసుకోవడంలో మాత్రం ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. అందువల్లే ఈ తరహా ప్రమాదాలు పదే పదే జరుగు తున్నాయి. రతన్‌గఢ్ ఆలయంలో 2007లో జరిగిన దుర్ఘటనపై విచారణ కమిషన్ సమర్పించిన నివేదిక ఏమూలో దుమ్ముకొట్టుకుపోయి ఉంది. ఆరేళ్లవుతున్నా మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాన్ని అసెంబ్లీ ముందుంచలేదు. భక్తులు వేల సంఖ్యలో అక్కడికొస్తారని, పడవలపై నదిని దాటుతారని తెలిసినా నిర్లక్ష్యంగా రిజర్వాయర్ గేట్లు తెరిచారని, ఫలితంగా నదీప్రవాహం పెరిగిందని ఆ నివేదిక చెప్పినా ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. అక్కడ విధుల్లో ఉండాల్సిన పోలీసు అధికారులు ఆ సమయానికి ఎటో వెళ్లిపోయారని తేలినా సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు లేవు. ఘటనలకూ, విచారణ కమిషన్లు నివేదిక ఇవ్వడానికీ మధ్య ఎన్నో నెలలు గడిచిపోతాయి గనుక...‘అయిందేదో అయింది, ఇప్పుడు చర్యలెందుకులే’నన్న ఉదాసీనత ప్రభుత్వాలను ఆవరిస్తున్నది. జనం ప్రాణాలకు గడ్డిపోచ విలువ కూడా ఇవ్వని ఇలాంటి వైఖరే మళ్లీ మరో ఘటనకు తావిస్తున్నది. రతన్‌గఢ్ ఆలయానికి ఏటా ఈ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారని ప్రభుత్వానికి తెలుసు. అదేచోట కొన్నేళ్లక్రితం విషాద ఘటన జరిగిందని కూడా తెలుసు. అయినాసరే, ఇంతమంది భక్తుల రద్దీని క్రమబద్ధం చేయడానికి అక్కడ నియమించిన భద్రతా సిబ్బంది 60 మంది పోలీసులు మాత్రమే. వంతెనపై కేవలం డజనుమంది పోలీసులు మించిలేరు. ఈమధ్యే జరిగిన బీజేపీ బహిరంగ సభకు 12మంది ఐపీఎస్‌లు, 60మంది ఇతర ఉన్నతాధికారులతోపాటు 5,000మంది పోలీసు సిబ్బందిని నియమించారట. లక్షలమంది వచ్చే ఆలయంవద్ద మాత్రం కేవలం 60మంది సిబ్బంది సరిపోతారని ఎలా అనుకున్నారో?! ఇంత జరిగాక ఇప్పుడు అధికారులు రకరకాల సాకులు చెబుతున్నారు. సాధారణంగా దీపావళి అనంతరం అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటారని, ఈసారి తమ అంచనాలకు భిన్నంగా ఆదివారం దాదాపు 4 లక్షల మంది వచ్చారని వారు అంటున్నారు. యూపీకి చెందిన కొందరు యువకులు వదంతులు వ్యాప్తిచేశారని చెబుతున్నారు. తగిన బందోబస్తు ఉంటే వీటన్నిటినీ ఎదుర్కోవడం సాధ్యమయ్యే దని మాత్రం వారు గుర్తించినట్టు లేరు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగ బోతున్నాయి గనుక ప్రభుత్వం గట్టిగానే స్పందించింది. జిల్లా కలెక్టరు, ఎస్పీతోసహా 21మంది అధికారులను సస్పెండ్‌చేసింది. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిషన్‌ను రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని, ఆ నివేదిక వచ్చిన పక్షం రోజుల్లో చర్యలుంటాయని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చెబుతున్నారు. అందులో తమ వంతు పాపం ఎంత ఉన్నదో నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే జనం విశ్వసిస్తారని ఆయన తెలుసుకోవాలి. కనీసం ఈ ఘటన నుంచి అయినా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే కాదు...అన్ని ప్రభుత్వాలూ గుణపాఠం నేర్వాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవడం అలవాటుచేసుకోవాలి. -
'రతన్‌గడ్' మృతుల్లో 50 మంది యూపీ వాసులు
రతన్‌గడ్ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాట మృతుల్లో 50 మంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. వారిలో 33 మంది మహిళలు, చిన్నారులు మరణించారని చెప్పారు. దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లా నుంచి మృతుల వివరాలను సేకరిస్తున్నట్లు వారు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలో రతన్‌గడ్ ఆలయం ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆ దేవాలయం సమీపంలోని సింధ్ నదీ వంతెన కిక్కిరిసింది. వంతెన కూలిపోతుందని పుకార్లు వెల్లవెత్తాయి. దాంతో ప్రాణాలు కాపాడుకునేందుకు భక్తులు నలు దిశలా పరుగులు తీశారు. అందులోభాగంగా తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో 115 మందికి పైగా మరణించారు. వందాలాది మంది దతియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
రతన్‌గడ్ ఘటనలో కలెక్టర్, ఎస్పీ సహా 19 మంది సస్పెన్షన్
రతన్‌గడ్ దేవాలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగి 117 మంది మరణించిన ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కఠిన చర్యలు చేపట్టింది. అ ఘటనకు బాధ్యులు భావిస్తూ దతియా జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతోపాటు మరో 19 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వచ్చే నెల 25 నుంచి రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వారందరిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సస్పెన్షన్ చేశారు. అలాగే ఆ దుర్ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేపట్టిన విచారణ మంగళవారం నుండి ప్రారంభం అవుతుందని సోమవారం సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక అందజేస్తారని తెలిపారు. తొక్కిసలాటకు ముందు భక్తులతో, ఘటన అనంతరం మృతదేహలతో పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో అన్ని అంశాలపై జడ్జి విచారణ జరిపి నివేదిక అందజేస్తారని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై రెండు నెలల్లో నివేదిక సమర్పిస్తారన్నారు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌గడ్ దేవాలయం సమీపంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో 117 మంది మరణించారు. అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట, 60 మంది మృతి
-
64 మందిని బలిగొన్న వదంతి
భోపాల్: నదిపై ఉన్న వంతెన కూలిపోతుందన్న వదంతి 64 మందిని బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రతన్‌గఢ్ దుర్గామాత దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన తొక్కిసలాటకు వంతెన కూలిపోతుందన్న వదంతి కారణమని చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందిపైగా గాయపడ్డారు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింధ్ నదిపై ఉన్న ఇరుకైన బ్రిడ్జి దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. వంతెన కూలిపోతుందన్న వదంది రేగంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికివారు ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురు కాళ్ల కింద నలిగిపోయి మృతిచెందగా, కొందరు నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే పోలీసు లాఠీచార్జి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని వచ్చిన ఆరోపణలను దతియా ఎమ్మెల్యే నరోత్తమ్ మిశ్రా తోసిపుచ్చారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
మధ్యప్రదేశ్ ఆలయంలో తొక్కిసలాట, 50 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో ఓ దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 50కి చేరింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దతియా జిల్లా రతన్‌గఢ్ మాత దేవాలయంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం మృతుల సంఖ్యను ఐదుగానే భావించారు. కానీ, క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టం జరిగింది. తప్పించుకునే క్రమంలో వందలాంది మంది భక్తులు సమీపంలోని సింధ్ నది బ్రిడ్జి దిశగా పరుగులు తీశారు. కొందరు నదిలో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.